న్యూఢిల్లీ: సీబీఐ మాజీ న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ వచ్చిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఆయనది సహాజ మరణమేననీ, న్యాయ వ్యవస్థను అపఖ్యాతి పాల్జేసేందుకే దురుద్దేశంతో ఈ పిటిషన్లను వేశారనీ, దీనిని తీవ్ర చర్యగా పరిగణిస్తున్నామని పేర్కొంది. లోయా మృతికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణ ఇక ఈ తీర్పుతో ముగిసినట్లేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
పిటిషన్ల వెనుక రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలున్నాయనీ, న్యాయవ్యవస్థపై బురదజల్లాలనే దురుద్దేశంతోనే పిటిషన్లు వేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లోయా మృతికి దారితీసిన పరిస్థితులపై నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన వాంగ్మూలాలను అనుమానించడానికి కారణం లేదనీ, లోయాది సహాజ మరణమేనని రికార్డులను పరిశీలిస్తే స్పష్టమవుతోందని పేర్కొంది. సీనియర్ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలైన దుష్యంత్ దవే, ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ పిటిషన్లు వేశారు.కోర్టుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసేలా, న్యాయవ్యవస్థకు చెడ్డపేరు తెచ్చేలా వీరు ఈ పిటిషన్ల రూపంలో ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది.‘వాణిజ్య వివాదాలను మార్కెట్‌లో పరిష్కరించుకోవాలి. రాజకీయ విభేదాలను ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. చట్టాన్ని పరిరక్షించడం న్యాయస్థానాల బాధ్యత’ అని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు.
జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు మహారాష్ట్రకు చెందిన వారు కాబట్టి లోయా మృతికేసును బాంబే హైకోర్టులో విచారించిన న్యాయమూర్తులు వారికి తెలిసి ఉంటారనీ, కాబట్టి వారిద్దరూ ఈ కేసును విచారించకూడదని ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది.న్యాయమూర్తులపై అసంబద్ధ ఆరోపణలు చేయడం తగదంది. పిటిషనర్లపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుందామని తొలుత అనుకున్నామనీ, కానీ తర్వాత వెనక్కు తగ్గామని ధర్మాసనం తెలిపింది. కాగా, సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ ఏడాది జనవరి 12న మీడియా ముందుకు వచ్చి.. బీహెచ్ లోయా మృతి కేసు సహా పలు సున్నితమైన కేసుల కేటాయింపులో సరైన విధానాన్ని ప్రధాన న్యాయమూర్తి అవలంభించడం లేదంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే.
దేశ చరిత్రలోనే దుర్దినం: కాంగ్రెస్
జడ్జి లోయా మృతిపై సుప్రీం తీర్పు దేశ చరిత్రలోనే దుర్దినమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మృతిపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేసింది. సుప్రీంలో ఈ పిటిషన్ల దాఖలు వెనుక రాహుల్ హస్తముందన్న బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా ఖండించారు. ‘ఈరోజు దేశ చరిత్రలోనే అత్యంత దుర్దినం. న్యాయవ్యవస్థపై నమ్మకమున్నవారికి లోయా అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర ఆందోళన కలిగించే విషయం. తీర్పు పూర్తిస్థాయి కాపీని ఇంకా చూడలేదు. కానీ న్యాయవ్యవస్థపై నమ్మకమున్నవారికి ఇంకా పలు అనుమానాలు ఉన్నాయి. మృతికి సంబంధించిన నిజాలు ఏదో ఒకరోజు వెలుగులోకి వస్తాయి’ అని అన్నారు. లోయా కేసులో ఇప్పటివరకూ ఎలాంటి విచారణ జరగకపోవడాన్ని గుర్తుచేశారు. మరోవైపు రాహుల్ ట్వీటర్‌లో స్పందిస్తూ.. ‘భారతీయులు తెలివైనవాళ్లు. బీజేపీ నేతలతో సహా చాలామంది భారతీయులు అమిత్ షాకు సంబంధించిన నిజాలను ఇట్టే అర్థం చేసుకోగలరు.’ అని ట్వీట్ చేశారు.
పిల్ వెనుక రాహుల్ హస్తం: బీజేపీ
జస్టిస్ లోయా మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వెనుక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అదృశ్య హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. జస్టిస్ లోయాది సహజమరణమేనని తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ తమకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. న్యాయవ్యవస్థను వాడుకుని కాంగ్రెస్ అమిత్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని బీజేపీ ప్రతినిధి సంబిత్ ఆరోపించారు. స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్రపతిని రాహుల్ కలవడం సిగ్గు చేటని ఇది ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థని తప్పుదారి పట్టించడమేనని ఆయన అన్నారు. కేంద్రమంత్రి నఖ్వీ సుప్రీం కోర్టు తీర్పుపై స్పందిస్తూ...తమ పార్టీ అధినాయకత్వాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ చేసిన కుటిల యత్నాలను సుప్రీం కోర్టు తీర్పు తిప్పి కొట్టిందని..ఇప్పటికైనా ఆపార్టీ ఇటువంటి ప్రయత్నాలు మానుకుని తమకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం న్యాయవ్యవస్థను ఎవరూ తప్పుదోవ పట్టించలేరని సుప్రీం తీర్పు రుజువు చేసిందని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ ట్వీట్‌చేశారు.
చివరి ఆశ కూడా పోయింది: లోయా కుటుంబసభ్యులు
ముంబై: స్వతంత్ర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై లోయా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లోయా మామ శ్రీనివాస్ మాట్లాడారు. ‘తీర్పు మా అంచనాలకు తగ్గట్లుగా లేదు. అనుమానాలకు సమాధానాలు దొరకలేదు. ఈ కేసులో మేం ఇక ఎవ్వరిపైనా ఎలాంటి ఆశలు పెట్టుకోలేం. ఈ కేసులో ప్రతీ అంశాన్ని వాళ్లు మేనేజ్ చేసినట్లు కన్పిస్తోంది. మీడియా, ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండేట్లు లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాస్తవం వెలుగులోకి వస్తుందన్న ఒకే ఒక్క నమ్మకం కూడా సుప్రీం తీర్పుతో పోయింది. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా మాట్లాడటానికేం మిగల్లేదు’ అని లోయా సోదరి అనురాధ వాపోయారు. కాగా, తీర్పు అనంతరం లోయా కుమారుడు అనూజ్ అందుబాటులో లేకుండా పోయారు.
నేపథ్యమిదీ..
గుజరాత్‌లో 2005లో సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసÆŠ, వారి సన్నిహితుడు తులసీరామ్ ప్రజాపతిని పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేసి చంపేసిన కేసులో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా గతంలో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజ్‌గోపాల్ హరికిషన్ లోయా 2014 డిసెంబర్ 1న మృతి చెందగా, ఆ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జడ్జి గోసావి అమిత్‌ను నిర్దోషిగా ప్రకటించారు.
లోయా మృతి, తదనంతరం జరిగిన ఘటనలు
2014, డిసెంబర్ 1: నాగ్‌పూర్‌లో సహచరుడి కూతురి పెళ్లికి వెళ్లిన లోయా అక్కడే గుండెపోటుతో మృతిచెందారు.
2018 జనవరి 11: లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు ఆదేశాలివ్వాలంటూ వచ్చిన 2 పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు
జనవరి 12: లోయా మృతి తీవ్ర అంశమనీ, దీనిపై స్పందన తెలపాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
జనవరి 22: పిటిషన్లలో పేర్కొన్నవి తీవ్ర అంశాలంటూ లోయా మృతిపై బాంబే హైకోర్టులో ఉన్న రెండు కేసులను తన వద్దకే తెప్పించుకున్న సుప్రీంకోర్టు
ఫిబ్రవరి 12: లోయా మరణించినప్పుడు ఆయన పక్కన ఉన్న నలుగురు న్యాయమూర్తుల వాంగ్మూలాలను బట్టి ఆయనది సహజమరణమేనని సుప్రీంకోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
మార్చి 8: కేసు వేసిన వారినే గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారనీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగడం లేదంటూ న్యాయమూర్తులపై సీనియర్ న్యాయవాది ఆరోపణలు. ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
మార్చి 16: లోయా మృతిపై విచారణ కోరుతూ వచ్చిన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు.
ఏప్రిల్ 19: పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment