సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర ప్రత్యేక జడ్జీ బ్రిజ్‌గోపాల్ హరికిషన్ లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంపై స్వతంత్య్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు గురువారం నాడు నిర్ద్వంద్వంగా కొట్టివేసిన విషయం తెల్సిందే. లోయా మరణించిన రోజున ఆయన పక్కనే ఉన్న నలుగురు జడ్జీలు ఇచ్చిన వాంగ్మూలాన్ని శంకించడం అంటే న్యాయవవస్థను శంకించడమేనని, భారత పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు కోర్టుల విలువైన సమయాన్ని ఇలా వృధా చేయడం సమంజసం కాదని, ఈ కేసులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దుర్వినియోగం అయిందంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ వ్యాఖ్యానించింది.
దీపక్ మిశ్రా బెంచీ ఇచ్చిన తీర్పుపై, ఆయన చేసిన వ్యాఖ్యలపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014 నవంబర్ 30వ తేదీ అర్ధరాత్రా లేదా ఆ మరుసటి రోజు డిసెంబర్ ఒకటవ తేదీన లోయా మరణించారా ? అన్న విషయంలో స్పష్టత లేదు. గుండెపోటు వచ్చిన లోయాను ముందు డాండే ఆస్పత్రికి తీసుకెళ్లారా లేదా మెడిత్రినా ఆస్పత్రికి తీసుకెళ్లారా అన్న అంశంలో పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జీలను అనుమానిస్తే న్యాయవ్యవస్థనే శంకించడమని ధర్మాసనం మాట్లాడింది. ముందురోజే ఈసీజీ తీసినప్పుడు ఆయనకు గుండె బాగుందని, ఆ మరునాడు చనిపోయారని, అసలు ఈసీజేనే తీయలేదని, ఆస్పత్రిలోని ఈసీజీ మిషన్ పనిచేయలేదని, ఆయన ఈసీజీ బాగానే ఉందిగానీ, ఆ తర్వాత ఆయన మెట్లు ఎక్కి ఆస్పత్రి పైఅంతస్తులోకి రావడం వల్ల ఆయనకు గుండె పోటు వచ్చి ఉండవచ్చని... రకరకాలుగా రెండు ఆస్పత్రి వర్గాలు పరస్పర భిన్న కథనాలను వెల్లడించినా అనుమానించకూడదా?
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్న సంచలనం సృష్టించిన షొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు విచారణ ముగించి తీర్పును వెల్లడించడమే తరువాయిగా ఉన్నప్పుడు నాగపూర్ పెళ్లికి వెల్లి అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో లోయా మరణిస్తే అనుమానించకూడదా? ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని స్నేహితులతోపాటు కుటుంబ సభ్యులు వెల్లడించినప్పుడు కూడా అనుమానించకూడదా? తన కుమారుడికి ఎప్పుడు గుండె జబ్బులేదని, షొహ్రాబుద్ధీన్ ఎన్‌కౌంటర్ కేసును కొట్టివేస్తే వంద కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఒత్తిళ్లు వచ్చాయంటూ కన్న తండ్రే, సోదరి ఆరోపించినప్పుడు, కారావాన్ మాగజైన్ లోయ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించినప్పుడు అనుమానించకూడదా? లోయా స్థానంలో బదిలీపై వచ్చిన జడ్జీ కేసు పూర్వపరాలను సరిగ్గా పరిశీలించకుండానే వారం రోజుల్లో షొహ్రాబుద్ధీన్ ఎన్‌కౌంటర్ కేసును కొట్టివేస్తే అనుమానించకూడదా? కేసులో కీలకసాక్ష్యులైన 50 మందిలో కొందరు హత్యకు గురై, మిగతా వారు వారం రోజుల్లోనే ప్రాసిక్యూషన్‌కు ఎదురు తిరిగితే అనుమానించకూడదా? కేసుల దర్యాప్తునకు నెలలు, సంవత్సరాలు తీసుకునే పోలీసులు కారావాన్ మాగజైన్ కథనంపై ఐదు రోజుల్లో దర్యాప్తు ముగించి నలుగురు జడ్జీల నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని మాత్రం విశ్వసించాలా? ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ లాయరు ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే విశ్వసించరా? అది న్యాయవ్యవస్థను శంకించడం, కోర్టు సమయాన్ని వృధా చేయడమా ?
‘మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా’ లంచం కేసులో సీనియర్ జడ్జీలపైనే అవినీతి ఆరోపణలు వచ్చినా, నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు ఎన్నడూలేని విధంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తి ప్రవర్తననే ప్రశ్నించినా న్యాయవ్యవస్థను అనుమానించకూడదా? అసాధ్యమైన కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తీసుకురావాలంటూ, సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ, యోగాను నిర్బంధ విద్యగా ప్రవేశపెట్టాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు వద్ద సమయం ఉంటుంది. ఆధార్ కార్డులపై కొన్నేళ్లుగా విచారణ కొనసాగించడానికి సమయం ఉంటుంది. లోయా మృతి లాంటి కీలక కేసులో పిటిషన్ విచారించే సమయం ఉండదా?
జడ్జీ హరికిషన్ లోయా గుండెపోటుతోనే మరణించి ఉండవచ్చు. ఆయన్ని ఎవరూ హత్యచేసి ఉండకపోవుచ్చు. ఆ విషయాన్ని స్పష్టంగా తేల్చడానికైనా స్వతంత్య్ర దర్యాప్తు అవసరం కదా! అప్పుడు న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత గౌరవం పెరుగుతుందికదా! న్యాయ వ్యవస్థనే ఇలా తీర్పు చెబితే ఇక తామెక్కడికి న్యాయం కోసం వెళ్లగలమంటూ తీర్పు తర్వాత లోయా కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారంటే అర్థం ఏమిటీ? ‘ఏ కేసులోనైనా న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు స్పష్టంగా కనిపించడం ముఖ్యం’ అన్న కీలక సూత్రాన్ని సూక్తిగా బోధించినది కూడా సుప్రీం కోర్టే కదా!
Comments
Please login to add a commentAdd a comment