Brijgopal Harkishan Loya
-
జడ్జి లోయా మరణంపై తిరిగి దర్యాప్తు
ముంబై: స్పెషల్ సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మరణంపై తిరిగి దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం విలేకరులతో వెల్లడించారు. లోయా మరణానికి సంబంధించిన కేసును తిరిగి దర్యాప్తు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని కొంతమంది తనను కలిసి కోరుతున్నారన్నారు. అవసరమైతే ఈ కేసును తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు. లోయా కుటుంబసభ్యులు మిమ్మల్ని కలుస్తున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. దానిని వెల్లడించడానికి తాను ఇష్టపడటం లేదన్నారు. గుజరాత్‌కు చెందిన సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారించిన లోయా.. 2014 డిసెంబర్ 1న నాగ్‌పూర్‌లో గుండెపోటుతో మరణించారు. -
సుప్రీం తీర్పుపై అన్నీ సందేహాలే!
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర ప్రత్యేక జడ్జీ బ్రిజ్గోపాల్ హరికిషన్ లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంపై స్వతంత్య్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు గురువారం నాడు నిర్ద్వంద్వంగా కొట్టివేసిన విషయం తెల్సిందే. లోయా మరణించిన రోజున ఆయన పక్కనే ఉన్న నలుగురు జడ్జీలు ఇచ్చిన వాంగ్మూలాన్ని శంకించడం అంటే న్యాయవవస్థను శంకించడమేనని, భారత పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు కోర్టుల విలువైన సమయాన్ని ఇలా వృధా చేయడం సమంజసం కాదని, ఈ కేసులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దుర్వినియోగం అయిందంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ వ్యాఖ్యానించింది. దీపక్ మిశ్రా బెంచీ ఇచ్చిన తీర్పుపై, ఆయన చేసిన వ్యాఖ్యలపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014 నవంబర్ 30వ తేదీ అర్ధరాత్రా లేదా ఆ మరుసటి రోజు డిసెంబర్ ఒకటవ తేదీన లోయా మరణించారా ? అన్న విషయంలో స్పష్టత లేదు. గుండెపోటు వచ్చిన లోయాను ముందు డాండే ఆస్పత్రికి తీసుకెళ్లారా లేదా మెడిత్రినా ఆస్పత్రికి తీసుకెళ్లారా అన్న అంశంలో పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జీలను అనుమానిస్తే న్యాయవ్యవస్థనే శంకించడమని ధర్మాసనం మాట్లాడింది. ముందురోజే ఈసీజీ తీసినప్పుడు ఆయనకు గుండె బాగుందని, ఆ మరునాడు చనిపోయారని, అసలు ఈసీజేనే తీయలేదని, ఆస్పత్రిలోని ఈసీజీ మిషన్ పనిచేయలేదని, ఆయన ఈసీజీ బాగానే ఉందిగానీ, ఆ తర్వాత ఆయన మెట్లు ఎక్కి ఆస్పత్రి పైఅంతస్తులోకి రావడం వల్ల ఆయనకు గుండె పోటు వచ్చి ఉండవచ్చని... రకరకాలుగా రెండు ఆస్పత్రి వర్గాలు పరస్పర భిన్న కథనాలను వెల్లడించినా అనుమానించకూడదా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్న సంచలనం సృష్టించిన షొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు విచారణ ముగించి తీర్పును వెల్లడించడమే తరువాయిగా ఉన్నప్పుడు నాగపూర్ పెళ్లికి వెల్లి అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో లోయా మరణిస్తే అనుమానించకూడదా? ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని స్నేహితులతోపాటు కుటుంబ సభ్యులు వెల్లడించినప్పుడు కూడా అనుమానించకూడదా? తన కుమారుడికి ఎప్పుడు గుండె జబ్బులేదని, షొహ్రాబుద్ధీన్ ఎన్కౌంటర్ కేసును కొట్టివేస్తే వంద కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఒత్తిళ్లు వచ్చాయంటూ కన్న తండ్రే, సోదరి ఆరోపించినప్పుడు, కారావాన్ మాగజైన్ లోయ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించినప్పుడు అనుమానించకూడదా? లోయా స్థానంలో బదిలీపై వచ్చిన జడ్జీ కేసు పూర్వపరాలను సరిగ్గా పరిశీలించకుండానే వారం రోజుల్లో షొహ్రాబుద్ధీన్ ఎన్కౌంటర్ కేసును కొట్టివేస్తే అనుమానించకూడదా? కేసులో కీలకసాక్ష్యులైన 50 మందిలో కొందరు హత్యకు గురై, మిగతా వారు వారం రోజుల్లోనే ప్రాసిక్యూషన్‌కు ఎదురు తిరిగితే అనుమానించకూడదా? కేసుల దర్యాప్తునకు నెలలు, సంవత్సరాలు తీసుకునే పోలీసులు కారావాన్ మాగజైన్ కథనంపై ఐదు రోజుల్లో దర్యాప్తు ముగించి నలుగురు జడ్జీల నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని మాత్రం విశ్వసించాలా? ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ లాయరు ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే విశ్వసించరా? అది న్యాయవ్యవస్థను శంకించడం, కోర్టు సమయాన్ని వృధా చేయడమా ? ‘మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా’ లంచం కేసులో సీనియర్ జడ్జీలపైనే అవినీతి ఆరోపణలు వచ్చినా, నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు ఎన్నడూలేని విధంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తి ప్రవర్తననే ప్రశ్నించినా న్యాయవ్యవస్థను అనుమానించకూడదా? అసాధ్యమైన కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తీసుకురావాలంటూ, సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ, యోగాను నిర్బంధ విద్యగా ప్రవేశపెట్టాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు వద్ద సమయం ఉంటుంది. ఆధార్ కార్డులపై కొన్నేళ్లుగా విచారణ కొనసాగించడానికి సమయం ఉంటుంది. లోయా మృతి లాంటి కీలక కేసులో పిటిషన్ విచారించే సమయం ఉండదా? జడ్జీ హరికిషన్ లోయా గుండెపోటుతోనే మరణించి ఉండవచ్చు. ఆయన్ని ఎవరూ హత్యచేసి ఉండకపోవుచ్చు. ఆ విషయాన్ని స్పష్టంగా తేల్చడానికైనా స్వతంత్య్ర దర్యాప్తు అవసరం కదా! అప్పుడు న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత గౌరవం పెరుగుతుందికదా! న్యాయ వ్యవస్థనే ఇలా తీర్పు చెబితే ఇక తామెక్కడికి న్యాయం కోసం వెళ్లగలమంటూ తీర్పు తర్వాత లోయా కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారంటే అర్థం ఏమిటీ? ‘ఏ కేసులోనైనా న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు స్పష్టంగా కనిపించడం ముఖ్యం’ అన్న కీలక సూత్రాన్ని సూక్తిగా బోధించినది కూడా సుప్రీం కోర్టే కదా! -
‘ఈ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు’
-
‘ఈ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనవసరంగా ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ లోయ మృతి కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జస్టిస్ లోయ కేసును రాజకీయం చేయాలని చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. మీకు రాజకీయంగా ఉన్న, వ్యక్తిగతంగా ఉన్నా అవి బయట చూసుకోండి తప్ప, ఇక్కడ కాదని కోర్టు చెప్పిన విషయాల్ని గుర్తుచేశారు. ఈ తీర్పు అమిత్ షాపై ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు లాంటిది అన్నారు. లోయ కేసు పిటిషన్ల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు మానుకుని బీజేపీకి, అమిత్ షాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జస్టిస్ లోయ మృతి కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి ఇదేమీ కొత్త కాదంటూ మండిపడ్డారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ లౌకిక వాదం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా చేశారు. మోదీని తిట్టడానికే వామపక్షాలు ఐదు రోజుల సభలు పెట్టుకుందని లక్ష్మణ్ విమర్శించారు. -
లోయా మృతిపై దురుద్దేశంతోనే పిటీషన్లు : సుప్రీం
న్యూఢిల్లీ : జడ్జి బీహెచ్ లోయా మరణంపై ప్రత్యేక విచారణ కమిటీ(సిట్)ను ఏర్పాటు చేసి స్వతంత్ర విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సందర్భంగా ’రిట్ పిటిషన్లలో లోయా మరణంపై సిట్ విచారణ ఎందుకు జరిపించాలో సరైన వివరణ లేదని, లోయా సహజంగానే మరణించారు’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సొంత లాభం కోసం దురుద్దేశంతోనే ఈ పిటిషన్లను దాఖలు చేశారని దీపక్ మిశ్రా, డీవై చంద్రచూడ్, ఖన్విల్కర్‌ల ధర్మాసనం మండిపడింది. లోయా మరణానికి ముందు జరిగిన సంఘటనలు నిజమైనవి కావని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కాగా, ఈ మధ్యకాలంలో కాంట్రావర్సీలో చిక్కుకున్న కేసు ఇదే. రాజకీయాల పరంగానే కాకుండా, ఉన్నతమైన న్యాయవ్యవస్థలో సైతం చీలికలు తీసుకొచ్చింది ఈ కేసే. 2014 డిసెంబర్లో జస్టిస్ లోయా మరణించారు. అప్పటికి ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) న్యాయస్థానంలో సొహ్రబుద్దీన్ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తుది తీర్పు మరికొద్ది రోజుల్లో వెలువడుతుందనగా లోయా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయారు. లోయా మృతిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు న్యాయమూర్తులు భూషణ్ గవాయ్, సునీల్ షుక్రేలు ఆయనది సహజమరణమేనని తీర్పు చెప్పారు. అయితే, 2017 నవంబర్‌లో లోయా కుటుంబసభ్యులు ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ సమయంలో నిజానిజాలు బయటకు రాలేదని వ్యాఖ్యానించారు. లోయా మరణం తర్వాత కేవలం నెల రోజుల్లోనే సోహ్రబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాను సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల అయ్యారు. దీంతో లోయా హత్యపై ప్రతిపక్ష పార్టీలు గళమెత్తాయి. లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ డిమాండ్ చేశాయి. -
జస్టిస్ లోయా మృతిపై ఎన్నో అనుమానాలు: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ దివంగత జడ్జి బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా (బీహెచ్ లోయా) మృతికి సంబంధించి అంశాలపై ఫిర్యాదు చేసేందుకు విపక్ష నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షనేతలు శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతిని కలుసుకుని జస్టిస్ బీహెచ్ లోయా మృతిపై తమకు చాలా అనుమానాలున్నాయని తెలిపారు. లోయా మృతిపై సిట్‌తో కేసు దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. లోయా మృతిపై ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. కేసును తప్పుదోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయని విపక్ష నేతలు రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. జస్టిస్ లోయా మృతిపై 15 పార్టీలకు చెందిన 114 మంది ఎంపీలు సంతకాలు చేసిన పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్‌కు అందజేశాం. 13 పార్టీలకు చెందిన నేతలు సిట్ విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాం. జస్టిస్ లోయా మృతితో పాటు మరో కేసుల్లో అనుమానాలున్నాయని తెలిపాం. విచారణ కోసం తాము చేసిన విజ్ఞప్తిపై రాష్ట్రపతి కోవింద్ సానుకూలంగా స్పందించారని రాహుల్ వివరించారు. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తుండగానే 2014 డిసెంబర్ 1న లోయా అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జస్టిస్ లోయా కేసు విచారించనున్న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వం వహించనున్నారు. అంతకుముందు ఈ బెంచ్‌లో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రాను పక్కకు తప్పించారు. -
‘ఛస్.. ఇది సుప్రీం కోర్టా? చేపల మార్కెటా?’
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ లోయా మృతి కేసులో వాదిస్తున్న న్యాయవాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు కొనసాగుతున్న సమయంలో ఒక దశలో పరుష పదజాలంతో ఇద్దరు దూషించుకున్నారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వీవై చంద్రచూడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టు మర్యాదను కాపాడండి. మీ వాగ్వాదంతో న్యాయస్థానాన్ని చేపల మార్కెట్‌గా మార్చకండి. మీరు వాదించేది చాలా సున్నితమైన అంశం. ఒక న్యాయమూర్తి మృతికి సంబంధించిన కేసు. ఇక్కడ మాజీ న్యాయమూర్తుల చిత్రపటాలు ఉన్నాయి. కనీసం వారికైనా గౌరవం ఇచ్చి కోర్టు హాలులో కాస్త పద్ధతిగా మెలగండి’’ అంటూ జస్టిస్ చంద్రచూడ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతిలో అనుమానాలు ఉన్నాయంటూ కార్వాన్ మాగ్జైన్(లోయా సోదరి అనురాధా బియానీ ఇచ్చిన ఇంటర్వ్యూ), ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాల ఆధారంగా ‘బీహెచ్ లోనే’ అనే జర్నలిస్ట్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోనే తరపున అడ్వొకేట్ పల్లవ్ సిసోడియా.. ముంబై లాయర్స్ అసోషియన్ తరపున దుష్యంత్ దవే వాదిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయమూర్తులు దూషించుకున్నారు. లోయా మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే స్వతంత్ర్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిసోడియా వాదించారు. దీనికి స్పందిన దవే.. గతంలో ఇదే అంశంపై బాంబే హైకోర్టు పిటిషన్ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన సిసోడియా ‘నువ్వు ఎలా చచ్చినా నాకు పర్వాలేదు’’ అంటూ దవేను ఉద్దేశించి వ్యాఖ్యానించగా.. దవే కూడా మాటల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను వారించాల్సి వచ్చింది. అయినప్పటికీ దవే వెనక్కి తగ్గకపోవటంతో సున్నితంగా వారించిన న్యాయమూర్తి కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
ఇది చాలా ప్రమాదకరమైన అంశం : సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతి కేసుపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది ఎంతో ప్రమాదకరమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. నిజాయితీపరుడైన ఓ న్యాయమూర్తి చనిపోతే నిర్లక్ష్యం వహించటం సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తుందని తెలిపింది. ‘‘లోయా మృతి చుట్టూ అల్లుకున్న అనుమానాలు నివృత్తి అయితేనే సాధారణ పౌరుడిలో న్యాయవ్యవస్ధ సామర్థ్యం, నిజాయితీల పట్ల విశ్వాసం పునరుద్ధరింపబడుతుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి పత్రాలను, నివేదికలను సోమవారం తమకు సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. వివాదాస్పద సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో వాదనలు వింటున్న లోయా.. సరిగ్గా తీర్పు వెలువరించటానికి కొద్దిరోజుల ముందు మృతి చెందారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మహారాష్ట్రకు చెందిన ‘బీఆర్ లోనే’ అనే పాత్రికేయుడు పిటిషన్ దాఖలు చేశారు. షోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షాతోపాటు పలువురు నేతలు, పోలీస్ అధికారుల పేర్లు కూడా వినిపించాయి. అసలేం జరిగింది... 2014 డిసెంబర్ 1న సహచర జడ్జి కుమార్తె వివాహం కోసం నాగ్‌పూర్‌కు ఆయన వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట మరో ఇద్దరు జడ్జిలు కూడా ఉన్నారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన బస చేయగా.. ఆ రాత్రి గుండెపోటుతో ఆయన మృతి చెందారు. వైద్యులు ఆయనది సహజమరణమేనని దృవీకరించినప్పటికీ.. దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా తమకు తెలీకుండానే అంత్యక్రియలు చేశారని.. మొబైల్ ఫోన్ కూడా వారం తర్వాత తమకు అందించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లోయా సోదరి డాక్టర్ అనురాథా బియాని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో కొందరు లోయాకు 100 కోట్ల రూపాయల లంచం ఇవ్వ చూపారని, కానీ, నిజాయితీపరుడైన లోయా తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు.