సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనవసరంగా ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ లోయ మృతి కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జస్టిస్ లోయ కేసును రాజకీయం చేయాలని చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. మీకు రాజకీయంగా ఉన్న, వ్యక్తిగతంగా ఉన్నా అవి బయట చూసుకోండి తప్ప, ఇక్కడ కాదని కోర్టు చెప్పిన విషయాల్ని గుర్తుచేశారు. ఈ తీర్పు అమిత్ షాపై ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు లాంటిది అన్నారు. లోయ కేసు పిటిషన్ల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు మానుకుని బీజేపీకి, అమిత్ షాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జస్టిస్ లోయ మృతి కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి ఇదేమీ కొత్త కాదంటూ మండిపడ్డారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ లౌకిక వాదం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా చేశారు. మోదీని తిట్టడానికే వామపక్షాలు ఐదు రోజుల సభలు పెట్టుకుందని లక్ష్మణ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment