
అమిత్ షా, రాహుల్‌లకు కేజ్రీవాల్ సవాలు
న్యూఢిల్లీ: యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు.
ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హరియాణాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు.
కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లు
యమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హరియాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment