బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయా (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : జడ్జి బీహెచ్ లోయా మరణంపై ప్రత్యేక విచారణ కమిటీ(సిట్)ను ఏర్పాటు చేసి స్వతంత్ర విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సందర్భంగా ’రిట్ పిటిషన్లలో లోయా మరణంపై సిట్ విచారణ ఎందుకు జరిపించాలో సరైన వివరణ లేదని, లోయా సహజంగానే మరణించారు’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సొంత లాభం కోసం దురుద్దేశంతోనే ఈ పిటిషన్లను దాఖలు చేశారని దీపక్ మిశ్రా, డీవై చంద్రచూడ్, ఖన్విల్కర్‌ల ధర్మాసనం మండిపడింది. లోయా మరణానికి ముందు జరిగిన సంఘటనలు నిజమైనవి కావని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కాగా, ఈ మధ్యకాలంలో కాంట్రావర్సీలో చిక్కుకున్న కేసు ఇదే. రాజకీయాల పరంగానే కాకుండా, ఉన్నతమైన న్యాయవ్యవస్థలో సైతం చీలికలు తీసుకొచ్చింది ఈ కేసే.
2014 డిసెంబర్‌లో జస్టిస్ లోయా మరణించారు. అప్పటికి ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) న్యాయస్థానంలో సొహ్రబుద్దీన్ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తుది తీర్పు మరికొద్ది రోజుల్లో వెలువడుతుందనగా లోయా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయారు. లోయా మృతిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు న్యాయమూర్తులు భూషణ్ గవాయ్, సునీల్ షుక్రేలు ఆయనది సహజమరణమేనని తీర్పు చెప్పారు.
అయితే, 2017 నవంబర్‌లో లోయా కుటుంబసభ్యులు ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ సమయంలో నిజానిజాలు బయటకు రాలేదని వ్యాఖ్యానించారు. లోయా మరణం తర్వాత కేవలం నెల రోజుల్లోనే సోహ్రబుద్దీన్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాను సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల అయ్యారు. దీంతో లోయా హత్యపై ప్రతిపక్ష పార్టీలు గళమెత్తాయి. లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment