సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ న్యాయమూర్తి బ్రిజ్‌గోపాల్ హర్‌కిషన్ లోయా మృతి కేసుపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది ఎంతో ప్రమాదకరమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. నిజాయితీపరుడైన ఓ న్యాయమూర్తి చనిపోతే నిర్లక్ష్యం వహించటం సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తుందని తెలిపింది.
‘‘లోయా మృతి చుట్టూ అల్లుకున్న అనుమానాలు నివృత్తి అయితేనే సాధారణ పౌరుడిలో న్యాయవ్యవస్ధ సామర్థ్యం, నిజాయితీల పట్ల విశ్వాసం పునరుద్ధరింపబడుతుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి పత్రాలను, నివేదికలను సోమవారం తమకు సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది.
వివాదాస్పద సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో వాదనలు వింటున్న లోయా.. సరిగ్గా తీర్పు వెలువరించటానికి కొద్దిరోజుల ముందు మృతి చెందారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మహారాష్ట్రకు చెందిన ‘బీఆర్ లోనే’ అనే పాత్రికేయుడు పిటిషన్ దాఖలు చేశారు. షోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షాతోపాటు పలువురు నేతలు, పోలీస్ అధికారుల పేర్లు కూడా వినిపించాయి.
అసలేం జరిగింది... 2014 డిసెంబర్ 1న సహచర జడ్జి కుమార్తె వివాహం కోసం నాగ్‌పూర్‌కు ఆయన వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట మరో ఇద్దరు జడ్జిలు కూడా ఉన్నారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన బస చేయగా.. ఆ రాత్రి గుండెపోటుతో ఆయన మృతి చెందారు. వైద్యులు ఆయనది సహజమరణమేనని దృవీకరించినప్పటికీ.. దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా తమకు తెలీకుండానే అంత్యక్రియలు చేశారని.. మొబైల్ ఫోన్ కూడా వారం తర్వాత తమకు అందించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లోయా సోదరి డాక్టర్ అనురాథా బియాని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో కొందరు లోయాకు 100 కోట్ల రూపాయల లంచం ఇవ్వ చూపారని, కానీ, నిజాయితీపరుడైన లోయా తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment