సీజేఐపై అభిశంసన నోటీసులు | Chief Justice Dipak Misra Faces Impeachment Motion, 71 Have Signed | Sakshi
Sakshi News home page

సీజేఐపై అభిశంసన నోటీసులు

Published Sat, Apr 21 2018 1:42 AM | Last Updated on Sun, Sep 2 2018 5:48 PM

Chief Justice Dipak Misra Faces Impeachment Motion, 71 Have Signed - Sakshi

దీపక్‌ మిశ్రా- మీడియాతో మాట్లాడుతున్న సిబల్‌. చిత్రంలో ఆజాద్, డీ రాజా, కేటీఎస్‌ తులసీ

న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై అభిశంసన నోటీసులు. ఇప్పటివరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయినప్పటికీ అసాధారణరీతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వటం ఇదే తొలిసారి. కాంగ్రెస్‌ నేతృత్వంలో 6 విపక్ష పార్టీలు సీజేఐ  మిశ్రాకు వ్యతిరేకంగా ఈ నోటీసులను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యకు శుక్రవారం అందజేశారు. ఈ అభిశంసన నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఏడుగురు మాజీ ఎంపీలు సంతకాలు చేశారు. సీజేఐ దుష్ప్రవర్తనతోపాటుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నోటీసులో విపక్ష నేతలు పేర్కొన్నారు. సీజేఐ తీరుపై 5 ఆరోపణలు చేశారు.

భారమైన హృదయంతో..: సిబల్‌
జడ్జి బీహెచ్‌ లోయా మృతికేసుపై స్వతంత్ర విచారణ జరపాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన మరుసటిరోజే ఈ అభిశంసన నోటీసులు ఇవ్వటం చర్చనీయాంశమైంది. ‘ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. కానీ న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడేందుకు భారమైన హృదయంతో నోటీసులు ఇవ్వక తప్పడంలేదు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు. సీజేఐపై వచ్చిన ఆరోపణలను విస్మరించలేమన్న సిబల్‌ ఒకవేళ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభిస్తే సంప్రదాయం ప్రకారం ఆయన తక్షణమే తన విధులనుంచి తప్పుకోవాల్సి ఉంటుందన్నారు.

‘ ఈ విచారణలో నిజానిదే తుది విజయం. న్యాయవ్యవస్థ సుస్థిరంగా ఉన్నప్పుడే ప్రజ్వాస్వామ్యం వర్ధిల్లుతుంది’ అని సిబల్‌ తెలిపారు. ‘రాజ్యసభ చైర్మన్‌ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాము’ అని రాజ్యసభ విపక్ష నేత ఆజాద్‌ అన్నారు. వారం రోజుల క్రితమే రాజ్యసభ చైర్మన్‌ను కలిసేందుకు అనుమతి కోరామని.. అయితే, శుక్రవారం అపాయింట్‌మెంట్‌ దొరికిందని ఆయన తెలిపారు.  ఈనోటీసులపై కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ నేతలు సంతకాలు చేశారు.  

కాంగ్రెస్‌లో విభేదాలు
సీజేఐపై అభిశంసన నోటీసుల విషయంలో కాంగ్రెస్‌లో విభేదాలు నెలకొన్నాయి. ఈ నోటీసులపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, సీనియర్‌ నేతలు, న్యాయవాదులైన పి. చిదంబరం, అభిషేక్‌ సింఘ్వీ తదితరులు సంతకాలు చేయలేదు. అయితే విభేదాలను కాంగ్రెస్‌ నేతలు తిరస్కరించారు. విపక్షాలన్నీ ఏకతాటిపైనే ఉన్నాయని.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగానే భాగస్వామ్యం చేయలేదన్నారు. మిగిలిన నేతలు కూడా వివిధ కేసులకు సంబంధించిన విరుద్ధ ప్రయోజనాల కారణంగానే.. సంతకాలు చేయలేదన్నారు.

మరో సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ ఈ నోటీసులపై చర్చకు వ్యతిరేకంగా ఉన్నారు. ‘అభిశంసన చాలా తీవ్రమైన విషయం.  ఒక కేసు తీర్పుపై విభేదించినంత మాత్రాన ఈ నోటీసులు ఇవ్వటం సరికాదు. అందుకే ఉపరాష్ట్రపతిని కలిసే బృందంలో ఉండటం లేదు’ అని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అటు, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఈ నోటీసులకు మద్దతివ్వలేదు. ఆర్నెల్లలో పదవీ విరమణ పొందనున్న జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై ఇలాంటి నోటీసులు ఇవ్వటం న్యాయబద్ధంగా సరైంది కాదని ఆ పార్టీ భావిస్తోంది.  

ప్రతీకార పిటిషన్‌: జైట్లీ
సీజేఐపై అభిశంసన నోటీసులను కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ఆయుధంగా వినియోగించుకుంటోందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విమర్శించారు. జడ్జి లోయా కేసులో కాంగ్రెస్‌ పన్నిన కుట్రను సుప్రీంకోర్టు భగ్నం చేయటంతో ప్రతీకారంగానే అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చిందన్నారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు సోహ్రాబుద్దీన్‌ కేసుతో ఎటువంటి సంబంధం లేదని.. రాష్ట్ర పోలీసుల సహకారంతో కేంద్ర బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌ చేశాయన్నారు. కాంగ్రెస్, వారి మిత్రులంతా కలిసి రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారన్నారు. అభిశంసన నోటీసుల గురించి ఆలోచించటమే చాలా ప్రమాదకరమన్న జైట్లీ.. అనవసర అంశాలపైనా ఎంపీల సంతకాలను సేకరించటం కష్టమేమీ కాదన్నారు. ఓ న్యాయమూర్తిని భయపెట్టడం.. తద్వారా మరికొందరు న్యాయమూర్తులను హెచ్చరించేందుకే కాంగ్రెస్‌ ఈ ప్రయత్నం చేసిందన్నారు.

గత 25 ఏళ్లలో..
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలివ్వటం గత 25 ఏళ్లలో మూడుసార్లు జరిగింది. కానీ..సిట్టింగ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులు ఇవ్వటం మాత్రం ఇదే తొలిసారి. 1993లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామస్వామిపై అవినీతి ఆరోపణలు రావటంతో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇది పార్లమెంటులో ఓటింగ్‌ వరకు చేరుకుంది. అయితే లోక్‌సభలో ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవటంతో తీర్మానం వీగిపోయింది. 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌పై ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది రాజ్యసభలో ఆమోదం పొంది.. లోక్‌సభకు ఓటింగ్‌ కోసం వచ్చింది.

ఫలితాన్ని ముందుగానే ఊహించిన జస్టిస్‌ సౌమిత్ర సేన్‌ తన పదవికి రాజీనామా చేశారు. 2011లోనే సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ పీడీ దినకరన్‌పై అవినీతి ఆరోపణలొచ్చాయి. ప్రాథమిక విచారణలోనే అవి వాస్తవమేనని తేలింది. సెలవుపై వెళ్లాలని ఆదేశించినా వినకపోవటంతో కర్ణాటక హైకోర్టుకు ఆయన్ను బదిలీ చేశారు. అయితే అభిశంసన ప్రక్రియకు పావులు కదులుతుండగానే ఆయన రాజీనామా చేశారు. 2016లో.. తన అధికారాలను దుర్వినియోగంచేసి ఓ దళిత జూనియర్‌ సివిల్‌ జడ్జిని బెదిరింపులకు గురిచేశారన్న ఆరోపణలపై జస్టిస్‌ నాగార్జున్‌రెడ్డిపై అభిశంసన తీర్మానాన్ని పెట్టారు. అయితే దీన్ని బలపరిచిన వారిలో 19 మంది తమ సంతకాలను వెనక్కు తీసుకోవటంతో ఈ అభిశంసన వీగిపోయింది.

సీజేఐపై ఐదు ఆరోపణలు
1. ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేసు విషయంలో ముడుపులు తీసుకున్నారు. ఇదే కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వలేదు.
2. సుప్రీంకోర్టులో ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌పై విచారణకు సంబంధించిన పిటిషన్‌ను ముందు తేదీకి మార్చటం (ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్న కాంగ్రెస్‌)
3. రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం.
4. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తప్పుడు అఫిడవిట్‌తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో తను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినపుడు దీన్ని సరెండర్‌ చేశారు. అయితే 1985లోనే ప్లాట్‌ కేటాయింపు నిబంధనలు రద్దుచేశారు. అప్పటినుంచి వీటిని సీజేఐ ఉల్లంఘించారు.
5. తనకున్న మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారు.  


‘అభిశంసన సరికాదు’
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులను రాజ్యాంగ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజకీయంగా పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించారు. అసలు అభిశంసన ఇవ్వాల్సిన తీవ్ర ఆరోపణలేమీ లేవని.. కనుక ఇలాంటి తీర్మానాలు వీగిపోతాయని మాజీ అటార్నీ జనరల్‌ సోలీ సొరాబ్జీ, మాజీ హైకోర్టు న్యాయమూర్తులు ఎస్‌ఎన్‌ ధింగ్రా, అజిత్‌ కుమార్‌ సిన్హా, సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వంటి న్యాయకోవిదులు పేర్కొన్నారు. ‘స్వతంత్ర భారత చరిత్రలో న్యాయవ్యవస్థపై జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది’ అని సోలీ సొరాబ్జీ పేర్కొన్నారు. ఇది జడ్జి లోయా కేసు తీర్పుకు వ్యతిరేకంగానే కాంగ్రెస్‌ ఈ కుట్రకు పాల్పడుతోందని వికాస్‌ సింగ్, జస్టిస్‌ సిన్హాలు అభిప్రాయపడ్డారు. రాజకీయ స్వలాభం, ఉద్దేశపూర్వకంగానే ఈ నోటీసులు ఇచ్చారని మరికొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.

తీవ్రంగా కలచివేశాయి
సీజేఐను తొలగించాలంటూ ఎంపీలు బహిరంగంగా ప్రకటించడం లాంటి పరిణామాలు తీవ్రంగా కలచివేశాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సీజేఐపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సన్నద్ధమయ్యే క్రమంలో మార్గదర్శకాలు పాటించే విధంగా ప్రజాప్రతినిధులను నియంత్రించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం మాట్లాడుతూ.. ‘ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం దురదృష్టకరం. అభిశంసన గురించి సమాజంలో చర్చ జరగడం సరికాదు.

తద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది’అని అభిప్రాయపడ్డారు. విచారణ సందర్భంగా సీనియర్‌ అడ్వకేట్‌ మీనాక్షి అరోరా వాదనలు వినిపిస్తూ.. పార్లమెంటులో ఎలాంటి తీర్మానం ప్రవేశపెట్టకుండానే న్యాయమూర్తి తొలగింపుపై రాజకీయ నాయకులు పలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. దీని ప్రభావం సదరు న్యాయమూర్తి విధి నిర్వహణపై పడుతుందన్నారు. ఆ ప్రకటనలు ప్రచురించకుండా, ప్రసారం చేయనీయకుండా మీడియాపై నిషేధం విధించాలని కోరగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. విచారణను మే 7కి వాయిదా వేసింది. అనంతరం ఈ అంశంపై అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సహకారం తీసుకోనున్నట్టు ధర్మాసనం తెలిపింది.

అభిశంసన ప్రక్రియ ఇలా
► రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలు సహా ప్రధాన న్యాయమూర్తిని తొలగించవచ్చు.
► ఈ ప్రక్రియను పార్లమెంట్‌లోని ఏ సభలోనైనా ప్రారంభించొచ్చు.
► రాజ్యసభలో అయితే..ప్రతిపాదనపై 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి
► లోక్‌సభలో అయితే.. 100 మంది సభ్యులు సంతకాలు చేయాలి
► స్పీకర్‌ లేదా చైర్మన్‌ ఆ తీర్మానాన్ని ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు
► ఒకవేళ తిరస్కరిస్తే ఆ ప్రతిపాదన వీగి పోయినట్లే


ఆమోదం పొందితే..
► సుప్రీం జడ్జీ, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక న్యాయ నిపుణుడితో కూడిన కమిటీ ఏర్పాటవుతుంది
► ఆ కమిటీయే అభియోగాలను నమోదు చేస్తుంది
► అభిశంసన ఎదుర్కొంటున్న జడ్జీకి ఆ కాపీ పంపుతారు
► తనను సమర్థించుకుంటూ జడ్జీ రాతపూర్వక వివరణ ఇవ్వాలి
► విచారణ తుది నివేదికను కమిటీ స్పీకర్‌ లేదా చైర్మన్‌కు సమర్పిస్తుంది
► పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంది
► సాధారణ మెజారిటీతో లేదా అందుబాటులో ఉన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రతిపాదన ఆమోదం పొందాలి
► ఒక సభలో ఆమోదం పొందిన తరువాత మరో సభకు పంపుతారు
► రెండింట్లోనూ ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతికి చేరుతుంది
► సదరు జడ్జీని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేస్తారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement