న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. పరిగణనలోకి తీసుకునేందుకు నోటీసుకు ఎలాంటి అర్హత లేదని, అందులోని ఆరోపణలు సమర్థనీయం, అంగీకారయోగ్యం కావన్నారు. శనివారం పలువురు న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులతో విస్తృత చర్చల తర్వాత సోమవారం ఈ ఉత్తర్వులిచ్చారు.
నోటీసులో పేర్కొన్న దుష్ప్రవర్తన, అసమర్థత అభియోగాల్ని నిరూపించేందుకు కచ్చితమైన సమాచారం లేనందుకే తిరస్కరిస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో పేర్కొన్న ఆరోపణలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని వెంకయ్య తప్పుపట్టారు. కాగా రాజ్యసభ చైర్మన్ తమ నోటీసుపై హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని, ఇది అసాధారణమే కాక చట్ట విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు.
లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్స్, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులతో పాటు ప్రముఖ న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించిన అనంతరం వెంకయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సీజేఐపై ప్రతిపక్షాలు అభిశంసన నోటీసులివ్వడం తెల్సిందే. కాంగ్రెస్ నేతృత్వంలో 7 విపక్ష పార్టీలు జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులిచ్చారు. నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఏడుగురు మాజీ సభ్యులు సంతకాలు చేశారు.
దుష్ప్రవర్తనతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.ప్రతిపక్షాల నోటీసుపై పలువురు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిష్ణాతుల అభిప్రాయం మేరకు నోటీసుల్ని తిరస్కరిస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు. ‘ప్రతిపక్షాల నోటీసులోని అంశాల్ని పూర్తిగా పరిశీలించాను. న్యాయ నిపుణులు, రాజ్యంగ కోవిదులతో సంప్రదింపుల అనంతరం వ్యక్తమైన అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకున్నాక నోటీసుకు ఎలాంటి అర్హత లేదని అభిప్రాయానికి వచ్చాను.
అందువల్ల నోటీసును తిరస్కరిస్తున్నాను’ అని ఉత్తర్వుల్లో వెంకయ్య పేర్కొన్నారు.నోటీసు ద్వారా వ్యక్తమైన అంశాలపై అన్ని కోణాల్లో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపానని, ఒక్కో ఆరోపణను విడివిడిగానే కాకుండా, సమష్టిగా కూడా పరిగణనలోకి తీసుకున్నానని ఆయన తెలిపారు. ‘ఇది సుప్రీంకోర్టు స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అంతర్గత అంశం. నోటీసులో పేర్కొన్న ఐదు ఆరోపణల్ని నిశితంగా పరిశీలించాక.. అవి సమర్ధనీయం కాదు, అలాగే అంగీకారయోగ్యం కావనే అభిప్రాయానికి వచ్చాను.
ఈ కేసులోని ఆరోపణలు రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ స్వతంత్రతను బలహీనపరిచేలా ఉంది. ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చేశాక.. నోటీసులో నిరూపించదగ్గ ఆరోపణలు లేవని నిర్ధారణకు వచ్చాను. తీర్మానానికి సంబంధించి రాజ్యసభ నియమావళిని పరిశీలించడంతో పాటు విస్తృత సంప్రదింపులు, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాల్ని పరిశీలించాక నోటీసును పరిగణనలోకి తీసుకోవడం వాంఛనీయం కాదన్న అంశంతో సంతృప్తి చెందాను’ అని రాజ్యసభ చైర్మన్ తెలిపారు.
న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నం: బీజేపీ
న్యాయవ్యవస్థను భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఓట్లు, ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు కుయుక్తులు పన్నుతోందని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ తప్పుపట్టారు. విపక్షాల పిటిషన్‌ను తిరస్కరించినందుకు ఉప రాష్ట్రపతికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తిరస్కారానికి గురైన కాంగ్రెస్... అసత్యాలు, ఇతరుల ప్రోద్బలంతో కూడిన పిటిషన్ల ద్వారా కోర్టు ఆవరణల నుంచి దేశాన్ని నడిపించలేదని న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విమర్శించారు. నాలుగేళ్ల క్రితం గుండె నొప్పితో మరణించిన జడ్జి లోయా మృతిని కూడా కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా వాడుకుందని ఆయన తప్పుపట్టారు.
15 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన న్యాయమూర్తులు
సోమవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ దీపక్ మిశ్రాతో పాటు ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బెంచ్‌లపైకి 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పలు ఊహాగానాలు విన్పించాయి. సీజేఐపై విపక్షాల అభిశంసన నోటీసు, తిరస్కరణ అంశంపై వారు చర్చించి ఉండవచ్చని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంలోని అన్ని బెంచ్‌లు పనిని ప్రారంభించాల్సి ఉండగా.. 10.45 వరకూ న్యాయమూర్తులు బెంచ్‌లపైకి రాలేదు. 15 నిమిషాలు ఆలస్యంగా బెంచ్‌కి వచ్చిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వెంటనే కేసుల విచారణను ప్రారంభించింది.
రాజ్యసభ చైర్మన్‌కుఆ అధికారం ఉంది: న్యాయ నిపుణులు
సీజేఐపై అభిశంసన కోసం ఇచ్చిన నోటీసులో పరిగణనలోకి తీసుకునే అంశాలు లేవని, ఉప రాష్ట్రపతి సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ అన్నారు. నోటీసుపై నిర్ణయం తీసుకునేందుకు చట్టబద్ధమైన అధికారం రాజ్యసభ చైర్మన్‌కు మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లినా విజయం సాధించే అవకాశాలు లేవని మరో ప్రముఖ న్యాయవాది సోలి సొరాబ్జీ చెప్పారు. ‘ఉప రాష్ట్రపతి తన బుద్ధి కుశలతను వినియోగించి న్యాయ నిపుణులతో సంప్రదించాక నిర్ణయానికి వచ్చారు’ అని ప్రశంసించారు. కాగా లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ స్పందిస్తూ.. వెంకయ్య నాయుడు హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు అని పేర్కొన్నారు.
హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు: కాంగ్రెస్
అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ వెంకయ్య తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ నిర్ణయం దేశ న్యాయ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టిందని, ప్రజల నమ్మకంపై నీళ్లు చల్లిందని విమర్శించింది. నోటీసులోని అంశాల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు. ‘ఇది అసాధారణ, చట్ట విరుద్ధమైన పొరపాటు నిర్ణయం. మేం తప్పకుండా ఈ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేస్తాం’ అని చెప్పారు.
అభిశంసన నోటీసుపై సంతకం చేసినందుకు సీజేఐ దీపక్ మిశ్రా న్యాయమూర్తిగా ఉన్న ధర్మాసనం ముందు తాను వాదించబోనన్నారు. ‘నేను సీజేఐ ముందు వాదించను. వృత్తి విలువలను పాటిస్తాను. అభిశంసన నోటీసుపై సంతకం చేసి ఎలా వాదిస్తాను? నైతికంగా అది అసంబద్ధం. వృత్తి ప్రమాణాలకు విరుద్ధం’అని సిబల్ అన్నారు. ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సూర్జేవాల మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్న, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న శక్తుల మధ్య పోరు అని అభివర్ణించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
ఆధారాలు అవసరం: వెంకయ్య
ఆలోచన, మాట, చర్య ద్వారా పరిపాలన మూలస్తంభాల్ని బలహీనపరిచేందుకు అనుమతించకూడదని ఉత్తర్వుల్లో వెంకయ్య సూచించారు. ‘పిటిషన్‌లో వాడిన వ్యాఖ్యలు అనుమానం, ఊహా లేదా అంచనాల్ని మాత్రమే వెల్లడిస్తున్నాయి. నోటీసులో పేర్కొన్న అంశాలకు సరైన ఆధారాలు చూపలేదు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తనను నిరూపించాలంటే ఆధారాలు అవసరం’ అని అన్నారు. అభిశంసన నోటీసుపై ప్రతిపక్ష పార్టీల ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రస్తావిస్తూ.. రాజ్యసభ సభ్యుల నియమావళిలోని పేరా 2.2లో పేర్కొన్న పార్లమెంటరీ ఆచారాలు, సంప్రదాయాల్ని సభ్యులు విస్మరించారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నానని వెంకయ్య చెప్పారు. కాగా, జడ్జి అభిశంసనకు సంబంధించిన నోటీసును తిరస్కరించే చట్టబద్ధ అధికారం రాజ్యసభ చైర్మన్‌కు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ‘జడ్జిల విచారణ యాక్ట్’ ప్రకారం సంప్రదింపులు, నిబంధనల అధ్యయనం అనంతరం రాజ్యసభ చైర్మన్ లేదా లోక్‌సభ స్పీకర్ నోటీసును అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చని తెలిపాయి.
గతంలోనూ ఈ తిరస్కరణలు
జడ్జిలపై అవిశ్వాస నోటీసులు ఆదిలోనే తిరస్కరణకు గురవ్వడం ఇదే తొలిసారి కాదు. 1970లో నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేసీ షా అభిశంసన కోసం నాటి లోక్‌సభ స్పీకర్ జీఎస్ ధిల్లాన్‌కు నోటీసులు అందాయి. అయితే అభిశంసనకు అవసరమైనంత తీవ్రమైన విషయాలు నోటీసులో లేవని పేర్కొంటూ తదుపరి చర్యలు చేపట్టేందుకు స్పీకర్ తిరస్కరించారు. అలాగే 2015లోనూ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా రిజర్వేషన్లపై అనుచితంగా మాట్లాడారంటూ 58 మంది రాజ్యసభ సభ్యులు ఆయనపై అభిశంసనకు నాటి రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీకి నోటీసులు అందజేశారు. అయితే అభిశంసనపై తదుపరి చర్యలు చేపట్టక ముందే రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలను సర్దివాల తొలగించడంతో ఆ విషయం అక్కడితో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment