భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభింశసన తీర్మానం చుట్టే గత వారం రోజులుగా కేంద్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏడు విపక్ష పార్టీలు సంయుక్తంగా అభిశంసన కోరుతూ 71 మంది ఎంపీల సంతకాలతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడికి ఓ తీర్మానం సమర్పించడం, దాన్ని వెంకయ్య నాయకుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ఇది అన్యాయమంటూ విపక్షాలు గోల చేయడం తదితర పరిణామాలన్నీ తెలిసినవే. ప్రస్తుతమున్న విధానం ప్రకారం ఓ సుప్రీం కోర్టు జడ్జీని అభిశంసించడం దాదాపు సాధ్యమయ్యేపని కాదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడం కోసమే అభిశంసన అంశంపై కఠిన నిబంధనలు ఉన్నాయి.
న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో జడ్జీలకు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ మరింత సులవుగా ఉండాలి. ప్రస్తుతం కఠినంగా ఉండడం వల్ల అది పాలకపక్షానికి మాత్రమే ఉపయోగపడేలా ఉంది. సానుకూలంగా తీర్పు చెప్పకపోతే అభిశంసనతో తొలగిస్తామంటూ పాలకపక్షం సుప్రీం జడ్జీలను లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను పాలకపక్షం బెదిరించవచ్చు. అప్పుడు సదరు జడ్జీలు పాలకపక్షానికి సానుకూలంగా స్పందించవచ్చు. ‘జ్యుడీషియల్ స్టాండర్ట్స్ అండ్ అకౌంటబిలిటీ (న్యాయవ్యవస్థ ప్రమాణాలు, జవాబుదారితనం) బిల్’ను ఈ పాటికి ఆమోదించి ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ బిల్లు గత రెండేళ్లుకు పార్లమెంట్‌లో దుమ్ముకొట్టుకుపోతోంది.
ప్రస్తుత సుప్రీం జడ్జీలను అభిశంసించాలంటే నిర్దిష్ట సంఖ్యలో ఎంపీలు సంతకాలు చేసిన లేఖను లోక్‌సభ స్పీకర్‌కుగానీ, రాజ్యసభ చైర్మన్‌కుగానీ అందజేయాలి. దానిపై ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీ వేయాలి. ఆ విచారణ కమిటీ పార్లమెంట్‌కు నివేదిక సమర్పించాలి. ఆ నివేదికపై ఇరు సభల్లో చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఓటింగ్. ఇరు సభలో మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు లేదా ఆ రోజు సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది సభ్యలు అనుకూలంగా ఓటు వేస్తేనే అభిశంసన చెల్లుతుంది.
గతంలో ఏం జరిగిందీ!
దేశంలోనే మొట్టమొదటి సారిగా జస్టిస్ వీ. రామస్వామిపై అభిశంసన ప్రక్రియను చేపట్టారు. ఆయన పంజాబ్, హర్యాన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు భారీగా ప్రభుత్వం సొమ్మును ఖర్చు పెట్టారని, అందులో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ కొంతమంది న్యాయవాదులు 1990లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సవ్యసాచి ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణల నుంచి విముక్తి పొందేవరకు విధులు నిర్వర్తించరాదంటూ ఆ లేఖపై స్పందించిన ముఖర్జీ, రామస్వామిని ఆదేశించారు. 1991లో ఆయనపై లోక్‌సభ అభిశంసనకు అనుమతించింది. దానిపై త్రిసభ్య కమిటీని స్పీకర్ నియమించారు. కమిటీ నివేదిక సమర్పించింది. దానిపై సభ్యులు మాట్లాడారు. రామస్వామి తరఫున కపిల్ సిబాల్ వాదించారు.
1993, మే 10న అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరగాలి. అప్పుడు ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నారు. పాలకపక్ష కాంగ్రెస్ తన సభ్యులందరికీ తప్పనిసరిగా హాజరుకావాలనీ, అయితే ఓటింగ్‌లో పాల్గొనరాదని విప్ జారీ చేసింది. ఓటింగ్‌లో జడ్జీని అభిశంసించాలంటూ 196 ఓట్లు వచ్చాయి. ఒక్కరు కూడా రామస్వామికి అనుకూలంగా ఓటు వేయలేదు. తీర్మానం వీగిపోయింది. కారణం సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఓటు వేయకపోవడమే. ఓ జడ్జీని అభిశంసించడమంటే భారత దేశంలో ఎప్పుడూ ఓ రాజకీయమే.
ఆ తర్వాత జస్టిస్ పీడీ దినకరణ్, జస్టిస్ సౌమిత్రా సేన్‌లకు వ్యతిరేకంగా కూడా అభిశంసనకు ప్రయత్నించారు. అయితే వారిరువురు కూడా పార్లమెంట్‌లో తీర్మానం పెట్టకముందే తమ పదవులకు రాజీనామా చేయడంతో వారిపై ఎలాంటి చర్యతీసుకోలేదు. రాజ్యసభ చేసినా వారిపై అభిశంసన కొనసాగాలే చట్టాన్ని మార్చాలంటూ అప్పుడు డిమాండ్ వచ్చింది. అభిశంసన తీర్మానం వీగిపోతుందని తెలిసి కూడా దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చిందంటే కూడా రాజకీయమే.
దీన్ని వెంకయ్య నాయుడు తిరస్కరించారంటే సుప్రీం కోర్టుకు వెళ్లడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకున్న మార్గం. దాన్ని ఎవరు విచారించాలన్నది కూడా దీపక్ మిశ్రానే నిర్ణయిస్తారు కనుక కాంగ్రెస్‌కు సానుకూల నిర్ణయం రాకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా జడ్జీని ఒక్క బంగ్లాదేశ్‌లో తప్ప జడ్జీని అభిశంసించడమన్నది పార్లమెంట్ చేతుల్లోనే ఉంది. తమ దేశ రాజ్యాంగంలో నుంచి జడ్జీల అభిశంసనను 16వ రాజ్యాంగ సవరణ ద్వారా బంగ్లా సుప్రీం కోర్టు గత ఆగస్టు నెలలోనే తొలగించింది. అభిశంసన ప్రక్రియ ద్వారా న్యాయ వ్యవస్థను పాలకపక్షం బెదిరిస్తుందని, తద్వారా తనకూలంగా తీర్పులు చెప్పించుకుంటుందన్న కారణంగానే అభిశంసన ప్రక్రియను బంగ్లా ఎత్తివేసింది.
Comments
Please login to add a commentAdd a comment