అభిశంసనకు అడ్డుపుల్ల తగదు | Venkaiah Naidu On Supreme Court Judge Impeachment Issue | Sakshi
Sakshi News home page

అభిశంసనకు అడ్డుపుల్ల తగదు

Published Thu, May 3 2018 1:05 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Venkaiah Naidu On Supreme Court Judge Impeachment Issue - Sakshi

సుప్రీంకోర్టు

మెజారిటీ పాలన అనేది ప్రజలెన్నుకున్న ప్రతినిధులు, లోక్‌సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వంచే వ్యక్తమవుతుంది. కానీ సమస్యలను లేవనెత్తి, తమ అభిప్రాయం చెప్పే ప్రతిపక్షం హక్కును క్రియాశీలక ప్రజాస్వామ్యంలో స్పీకర్‌ కానీ, చైర్మన్‌ కానీ అడ్డుకోకూడదు. వెంకయ్యనాయుడు, ఈ అంశంపై ప్రస్తుతం తీర్పు చెప్పాల్సిన న్యాయమూర్తులు కానీ మరొక సందర్భంలో సుప్రీంకోర్టు మాజీ  న్యాయమూర్తి జస్టిస్‌ కేకే మాథ్యూ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని, స్పందించాల్సి ఉంది.

భారత ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించడానికి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాన్ని నిరాకరించడం ద్వారా రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడు రాజ్యాంగ సంక్షోభాన్ని తీవ్రతరం చేశారు. విపక్షాల ప్రయత్నాన్ని వమ్ము చేసే క్రమంలో రాజ్యసభ అధ్యక్షుడు రాజ్యాంగాన్నీ, అభిశంసన కోసం చట్టం నిర్దేశించిన విధానాన్నీ కూడా కించ పరిచారు. అంతేకాదు, ఈ అంశాన్ని స్వీకరించే క్రమంలో అనుసరించవలసిన విధి విధానాలను, వాస్తవాలను విస్మరించారు. రాజ్యాంగం, చట్టం చైర్మన్‌కు కట్టబెట్టని అధికారాలను సైతం ఆయన చలాయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే విధానం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124 (4)లో పొందుపరిచారు. అది ఈ విధంగా చెబుతున్నది: 

‘పార్లమెంట్‌ ఉభయ సభలు మొదట చర్చించాలి. మొత్తం సభ్యులలో మెజారిటీ ఆమోదం కావాలి, అంటే మూడింట రెండువంతుల మెజారిటీతో ఆమోదం పొందాలి. ఆ పార్లమెంట్‌ సమావేశాలలోనే ఓటింగ్‌ నిర్వహించి దానిని రాష్ట్రపతికి వివరించాలి కూడా. ఆ తరువాత రాష్ట్రపతి ఉత్తరువులు ఇస్తే తప్ప సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించరాదు.’

న్యాయమూర్తుల చట్టం ఏం చెప్పింది?
అభిశంసన ప్రవేశపెట్టే పద్ధతినీ, ఆర్టికల్‌ 124 (5) కోరిన మేరకు న్యాయమూర్తి అనుచిత ప్రవర్తన, అసమర్థతలకు సంబంధించిన రుజువులు చూపడాన్నీ, దర్యాప్తు క్రమాలను క్రమబద్ధం చేయడానికీS పార్లమెంట్‌ ‘న్యాయమూర్తుల (దర్యాప్తు) చట్టం 1968’ని ఆమోదించింది. రాజ్యసభ చైర్మన్‌ ఇచ్చిన ఉత్తరువు అభిశంసన నోటీసులో ప్రధాన న్యాయమూర్తి మీద పేర్కొన్న అభియోగాలలోని నిజానిజాలను పరిశీలించే అవకాశం కల్పిస్తుంది. ఆ చట్టంలోని సెక్షన్‌ 3(2) ప్రకారం ఆ అభియోగాలను చైర్మన్‌ ఏర్పాటు చేసిన ఒక సంఘం పరిశీలిస్తుంది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సభ్యులుగా ఉంటారు. వీరే ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి అనుచిత ప్రవర్తనపై వచ్చిన రుజువులలోని వాస్తవాలను పరిశీలిస్తారు.

అనుచిత ప్రవర్తనకు సంబంధించి రాజ్యాంగంలోని 124(4) ఆర్టికల్‌ వివరించిన మేరకు న్యాయమూర్తి మీద రుజువులు లభిస్తేæ ఆ విషయాన్ని మళ్లీ పార్లమెంటుకు నివేదిస్తారు. ఆ అంకం అక్కడితో ముగుస్తుంది. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ప్రస్తుత అభిశంసన ఉదంతం ౖచెర్మన్‌ ఇచ్చిన ఉత్తరువులోని నాల్గవ పేరాతో ముగియవలసి ఉంది. అందులో అభిశంసన కోరుతూ 64 మంది సభ్యులు సంతకాలు చేసిన సంగతిని ఆయన గమనించవలసి ఉంటుంది. నిజానికి 1968 చట్టంలోని 3(1)(బి) ప్రకారం 50 మంది సభ్యులు సంతకాలు చేస్తే సరిపోతుంది. అయితే వెంకయ్యనాయుడు, వాస్తవాలను సంపూర్ణంగా పరిశీలించిన తరువాత ఈ అభిశంసన చట్టబద్ధం కాదు, వాంఛించదగినదీ కాదు, వీటిలో ఏ ప్రాతిపదికనైనా కూడా అనుమతించదగినది కాదని నా కచ్చితమైన అభిప్రాయం అని చెప్పారు. ఇలాంటి పరిశీలన, సమీక్ష ఆయన పరిధికి మించినవి.

ఇలాంటి పరిశీలన చేయడానికి గాని, ఇలాంటి ముగింపునకు రావడానికి గాని 1968 నాటి న్యాయమూర్తుల (దర్యాప్తు) చట్టం మేరకు నియమించిన సంఘానికి మాత్రమే అర్హత ఉంది. కృష్ణస్వామి వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద రాజ్యసభ చైర్మన్‌ ఆధారపడ్డారు. నిజానికి చైర్మన్‌ ఉటంకించిన భాగం జస్టిస్‌ కె. రామస్వామి ఇచ్చిన అసమ్మతి తీర్పులోనిది. ఈ విషయాన్ని చైర్మన్‌ గమనంలోకి తీసుకోలేదు. ఒక వ్యాజ్యంలో తీర్పును నిర్దేశించే కీలకాంశాన్ని రూఢి పరచడానికి వేసే మొదటి అడుగు న్యాయపాలన. దాని మీద ఆధారపడి తీసుకున్న నిర్ణయమే అసమ్మతి తీర్పుకు మినహాయింపును ఇస్తుందని రాజ్యాంగ నిపుణుడు హెచ్‌ ఎం సీర్వాయి అభిప్రాయం. కాబట్టి అసమ్మతి తీర్పులో ప్రకటించిన చట్టం 141వ ఆర్టికల్‌ కోసం సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టంగా పరిగణనలోనికి రాదు. కాబట్టి అత్యున్నత న్యాయస్థానం నియమించే విస్తృత ధర్మాసనం ఆమోదం పొందేవరకు వేచి ఉండవలసిందే. 

దారితప్పిన ఉత్తరువు..
మరొక అంశం కూడా ఉంది. రాజ్యసభ చైర్మన్‌ ఇచ్చిన ఉత్తరువులో (పదకొండవ పేరా) ఇలా పేర్కొన్నారు. ఆర్టికల్‌ 124(4) మేరకు అనుచిత ప్రవర్తనకు వర్తింప చేయవలసిన ప్రామాణికత హేతుబద్ధమైన సందేహానికి అతీతమైన క్రిమినల్‌ చట్ట ప్రామాణికత అని ఆయన పేర్కొన్నారు. మెహర్‌ సింగ్‌ సయానీ (2010) గురించిన విశ్వాసం కూడా గాడి తప్పింది. అనుచిత ప్రవర్తన అన్న పదం దుష్ప్రవర్తన అనే పదానికి విస్తృతంగా అన్వయిస్తుందని ఆ కేసులో పేర్కొన్నారు. అలాంటి ప్రవర్తన అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దగ్గర ఊహించలేనిది. ఆ స్థాయి పదవి మీద ప్రజలలో ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని అలాంటి ప్రవర్తన తుడిచి పెడుతుందని కూడా ఆ కేసులో పేర్కొన్నారు. అలాంటి ప్రవర్తన ఉన్న వ్యక్తి రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉంటే ఆయన నుంచి న్యాయాన్ని ఆశించగలమా

అన్నదే ప్రశ్న. 
ఆయన తుది నిర్ణయంలోని తార్కిక భ్రమ చెప్పేదేమిటంటే, అభిశంసించదలిచిన న్యాయమూర్తి మీద వచ్చిన ఆరోపణలు ఏమిటో వాటిని ఆయన మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్యసభ సభ్యులే నిరూపించుకోవాలి. ఇది ఎలా ఉన్నదంటే, బండికి ముందు గుర్రాన్ని ఉంచాలని రాజ్యాంగ పరిభాషలో చెప్పినట్టు ఉంది. ఇలాంటి తుది నిర్ణయానికి రావడం అవాంఛనీయం, చట్ట విరుద్ధమని సవినయంగా చెప్పాలి. రాజ్యాంగ నిపుణుడు సీర్వాయి భాషలో చెప్పాలంటే, ఇలాంటి నిర్ణయం‘శుద్ధ తప్పిదం, ప్రజలను దారుణంగా దగా చేయడం ద్వారా ఉద్భవించినది.’æ అధికార, విపక్ష సభ్యులతో ఉండే పార్లమెంట్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసన అనేది సంఖ్యాపరంగా సాధ్యంకానిదిగా వెంకయ్యనాయుడు ప్రకటించడం అసలు పార్లమెంటు వ్యవస్థను కించపరచడమే. అందుకే ఆయన ఇచ్చిన ఆదేశం దిగ్భ్రాంతిని కలిగించింది.

రాజ్యాంగం న్యాయపాలన కోసం రూపొందించినదే కానీ, మనుషుల కోసం కాదు అన్న సూత్రాన్ని పునరుత్థానం చేసే బాధ్యత ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీదే ఉంది. ఇంకా చెప్పాలంటే తాను అధిరోహించిన రాజ్యాంగ ఉన్నత పదవిని లక్ష్యపెట్టని, తన చర్యల ద్వారా ఆ పదవిని వివాదాస్పదం చేసిన వ్యక్తి కోసం రాజ్యాంగం రూపొందలేదు. దురదృష్టం ఏమిటంటే, ఇటీవల కాలంలో ఇలాంటి ప్రవర్తన రాజ్యాంగ పదవులు చేపట్టిన అనేక మందిలో  ఎక్కువగా కనిపిస్తున్నది కూడా. దీనితో సమాంతరమైనవి ఇటీవలనే జరిగాయి. అవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నవే కూడా. ఆఖరికి రాజ్యాంగాన్ని కించ పరచడానికి ప్రభుత్వమే కుట్ర పన్నుతున్నది. 

ప్రస్తుత సంక్షోభానికి మూలమైనది ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి అధికారం మీద తలెత్తిన వివాదం. దీనితో పాటు ప్రతిపక్షం గోడు వినకుండా ఆర్థిక బిల్లులను లోక్‌సభ స్పీకర్‌ అనుమతించడం, సుప్రీంకోర్టు పరిశీలనలోని ఆధార్‌ కేసు, ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలని కోరుతూ ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని నిరాకరించడం ప్రస్తుత ప్రభుత్వ అహంకారానికి ఉదాహరణలు. కాబట్టి రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్లకు ఉన్న విచక్షణాధికారాలను పరిమితం చేయడం గురించి యోచించవలసిన సమయం కూడా వచ్చింది. ప్రజాస్వామ్యం మౌలిక సారం ఏమిటంటే మెజారిటీ పాలన. రాజ్యాంగ, న్యాయపరమైన హక్కులకు ఆ మౌలిక ప్రజాస్వామ్య సూత్రం లోబడి ఉంటుంది.వీటిలో మొదటిది పార్లమెంట్‌ పరిధికి చెందినది కాగా రెండోది రాజ్యాంగ న్యాయస్థానాలకు చెందిన అంశంగా ఉంటుంది.

ప్రతిపక్షం హక్కును కాపాడాలి
మెజారిటీ పాలన అనేది ప్రజలెన్నుకున్న ప్రతినిధులు, లోక్‌సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వంచే వ్యక్తమవుతుంది. కానీ సమస్యలను లేవనెత్తి, తమ అభిప్రాయం చెప్పే ప్రతిపక్షం హక్కును క్రియాశీలక ప్రజాస్వామ్యంలో స్పీకర్‌ కానీ, చైర్మన్‌ కానీ అడ్డుకోకూడదు. 
వెంకయ్యనాయుడు, ఈ అంశంపై ప్రస్తుతం తీర్పు చెప్పాల్సిన న్యాయమూర్తులు కానీ మరొక సందర్భంలో సుప్రీంకోర్టు మాజీ  న్యాయమూర్తి జస్టిస్‌ కేకే మాథ్యూ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని, స్పందించాల్సి ఉంది.
‘పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను నిరోధించే విషయంలో రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ విధివిధానాలను నిర్దేశించినప్పుడు, కొందరికి ఇవి కర్ణకఠోరంగా వినిపించినప్పటికీ ఆ విధానాన్ని పూర్తిగా పాటించవలసిన బాధ్యత మనదేనని తప్పక భావించాలి.’
వ్యక్తిగత స్వేచ్ఛకు వర్తించే అంశం ప్రజాస్వామ్యానికి కూడా వర్తిస్తుంది. గత జనవరిలో నలుగురు కొలీజియం న్యాయమూర్తులు (అ)ప్రతిష్టాత్మకమైన మీడియా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత వివిధ రాజ్యాంగాధికారుల చర్యలు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే తమ అభిప్రాయాలను సమర్థించుకునేలా పరిణమించాయి. స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర న్యాయవ్యవస్థ లేకుండా ప్రజాస్వామ్యం మనజాలదు. అలాగే ప్రభుత్వ యంత్రాంగాలు, వాటి అహంకార వైఖరికి అతీతంగా.. పార్లమెంటరీ నిబంధనల ద్వారా నడిచే క్రియాశీలక పార్లమెంటు లేకుండా కూడా ప్రజాస్వామ్యం మనలేదు. 

సుచీంద్రన్‌ బీయన్‌ 
వ్యాసకర్త సుప్రీంకోర్టు న్యాయవాది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement