సాక్షి, న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అభిశంసన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని కాంగ్రెస్ పార్టీ సవాలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు ప్రతాప్‌సింగ్ భజ్వా, అమీ హర్షడ్రే యాజ్నిక్‌లు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
సీజేఐ అభిశంసన తీర్మానం కోరుతూ విపక్ష ఎంపీలు నోటీసులపై చేసిన సంతకాలను రాజ్యసభ చైర్మన్ పట్టించుకోలేదని, నిబంధనల ప్రకారం నోటీసులను తిరస్కరించే అధికారం ఆయనకు(వెంకయ్యకు) ఉన్నా, సీజేఐపై వచ్చిన ఆరోపణలపై కనీసం దర్యాప్తు కమిటీనైనా ఏర్పాటుచేయాల్సి ఉందని, ఈ మేరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు. కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సిఉంది.
ధర్మాసనాల ఏర్పాటు, కేసుల కేటాయింపులు, రోస్టర్ విధానం తదితర అంశాల్లో సీజేఐ దీపక్ మిశ్రా తీరును నిరసిస్తూ నలుగురు సీనియర్ జడ్జిలు మీడియా సమావేశం నిర్వహించడం, ఆపై ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరగడం తెలిసిందే. రాజ్యసభలో సీజేఐపై అభిశంసన తీర్మానం కోరుతూ ఏడు పార్టీలకు చెందిన దాదాపు 60 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేయడం, చైర్మన్ వెంకయ్య నాయుడు సదరు నోటీసులను తిరస్కరించడం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment