dipak misra
-
వరుసగా సంచలన తీర్పులు : రేపు రిటైర్మెంట్
న్యూఢిల్లీ : పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించడం, వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ.. 150 ఏళ్ల నాటి అడల్ట్రీ చట్టం రద్దు, ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడం, శబరిమల కేసులో అన్ని వయసుల మహిళలను అయ్యప్ప దేవాలయంలోకి అనుమతిస్తూ గ్రీన్ సిగ్నల్... ఇలా గత కొన్ని రోజుల నుంచి చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోబోతున్నారు. 2017 ఆగస్టున సీజేఐగా బాధ్యతలు చేపట్టిన దీపక్ మిశ్రా, రేపు అంటే అక్టోబర్ 2న పదవి విరమణ చేయనున్నారు. ఒడిశాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించారు దీపక్ మిశ్రా. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘునాథ్ మిశ్రా కొడుకు దీపక్ మిశ్రా. 1953 అక్టోబర్ 3న జన్మించిన మిశ్రా, ఒడిశా హైకోర్టులో 1996లో అదనపు జడ్జిగా తన జ్యూడిషియల్ కెరీర్ ప్రారంభించారు. 2011లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టారు. ఆశ్చర్యకరంగా దీపక్ మిశ్రా తను పదవిలో ఉన్నంత కాలం పలు చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. అవి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి కూడా. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరి చేశారు. జాతీయ గీతం తప్పనిసరి చేయడంపై పలువురు పలు రకాలుగా స్పందించారు. అంతేకాక ఇటీవల వెలువరించిన వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ సెక్షన్ 497 కొట్టివేత కూడా అంతే చర్చనీయాంశమైంది. స్వలింగ సంపర్కం కూడా నేరం కాదంటూ.. సెక్షన్ 377 రద్దు చేయడం మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎల్జీబీటీ కమ్యూనిటీల్లో సంబరాలు నింపాయి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఎల్జీబీటీ కమ్యూనిటీకి కూడా వర్తిస్తాయని దీపక్ మిశ్రా స్పష్టంచేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అదేవిధంగా నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో కూడా నలుగురు నిందితులకు మరణ శిక్షను విధించడానికే దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మొగ్గు చూపింది. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు ఇచ్చి, తన పదవి నుంచి విరమణ పొందుతున్నారు దీపక్ మిశ్రా. అంతేకాక మరో కీలక పరిణామం కూడా దీపక్ మిశ్రా పదవీ కాలంలోనే చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు బహిరంగంగా వచ్చి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లు మీడియా ముందు సంచలన విషయాలు వెల్లడించారు. తొలిసారి నలుగురు జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించి మరీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై ఆరోపణలు చేయడం అప్పట్లో దుమారం రేపింది. ఇలా ఆరోపణలు చేసిన వారిలో ఉన్న రంజన్ గగోయ్‌నే తదుపరి సీజేఐగా రాబోతున్నారు. రంజన్ గగోయ్‌ను తనకు సక్సెసర్‌గా నియమించాలని దీపక్ మిశ్రా ప్రతిపాదించారు. మిశ్రా తర్వాత టాప్ మోస్ట్ జడ్జి గగోయ్‌నే. -
4 రోజులు.. 8 తీర్పులు
-
సంచనాలకు కేంద్ర బిందువుగా సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక తీర్పులతో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పూర్వపరాలను సైతం తవ్వి తీర్పులను వెలువరిస్తోంది. అక్టోబర్ 2తో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ దీపక్ మిశ్రా.. పోతూపోతూ చారిత్రక తీర్పులను వెలువరిస్తున్నారు. 158 ఏళ్ల నుంచి భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లో వేళ్లూనుకుని పోయి స్వలింగ సంపర్కుల పాలిట శాపంగా మారిన సెక్షన్ 377ను రద్దు చేస్తు సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 6న వెలువడిన ఈ తీర్పు పట్ల ఎల్జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు హర్షం వ్యక్తం చేశారు. దీంతో 150 ఏళ్లుగా వారు ఎదుర్కొంటున్న వివక్షకు సుప్రీంకోర్టు చరమగీతం పాడింది. స్వలింగ సంపర్కం నేరం కాదు ఆధార్ రాజ్యాంగ బద్దమైనది... యూపీఏ హాయాములో ఎన్నో వివాదాల నడుమ తీసుకువచ్చిన ఆధార్ కార్టుపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డును ఎక్కడ వాడాలో, ఎక్కడ వాడకూడదో అంటూ దేశంలోని 110 కోట్ల జనాభా తికమకపడుతున్న సమయంలో న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ఏఏ సమయాల్లో ఆధార్ వాడాల్లో స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తూ.. పౌరుల వ్యక్తిగత డాటాను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. నిజానికి ఆధార్ సమస్య ఈ నాటిది కాదు. ఆధార్‌పై గతంలో కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి పుట్టస్వామి కేసులో విచారిస్తూ 2017 ఆగస్ట్ 24న పౌరుల వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సంచలన తీర్పును వెలువరించింది. ఆధార్‌పై మరో తీర్పును వెలువరించి దానికి రాజ్యాంగ బద్దతను గుర్తించింది. ఆధార్ రాజ్యాంగబద్ధమే వివాహేతర సంబంధాలు.. సెక్షన్ 497 కొట్టివేత ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లో దీనిని అత్యున్నత తీర్పుగా కొందరు వర్ణిస్తున్నారు. వివాహేతర సంబంధం నేరం కాదని.. ఐపీసీలోని సెక్షన్ 497ను కొట్టివేస్తే న్యాయస్థానం తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 27న వెలువరించిన ఈ తీర్పుపై దేశంలోని విభిన్న వర్గాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. వివాహేతర సంబంధానికి సుప్రీంకోర్టే లైసెన్స్ ఇచ్చిందని కొందరూ అభిప్రాయపడుతుండగా.. ప్రజల హక్కులకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలకు కాలం చెల్లిందని కోర్టు తీర్పును సమర్థించుకుంది. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్ కాలరాస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు శబరిమలపై సంచలన తీర్పు... కేరళలోని శబరిమల ఆలయంలోకి పురుషులతో పాటు మహిళలు కూడా ప్రవేశించవచ్చని కోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది. దేశంలోని మహిళల హక్కులను గుర్తిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన అత్యున్నత తీర్పుగా కేంద్రమంత్రి మేనకా గాంధీ ఈ తీర్పును వర్ణించారు. శబరిమల ఆలయంలోకి మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని కోరతూ ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేశారు. మహారాష్ట్రకు చెందన తృప్తీ దేశాయ్ అనే యువతి ఆలయంలోకి ప్రవేశంపై పెద్ద ఉద్యమాన్నే నడిపింది. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఆలయ నిబందనలు రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుకు విరుధ్దంగా ఉన్నాయంటూ అనేక కేసులు సుప్రీం ముంగిట ఉన్నాయి. ఆచారం అనేది మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదంటూ.. పురుషులతో సహా మహిళలకు కూడా ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి జస్టీస్ దీపక్ నేతృత్వంలోని ధర్మాసనం ముగింపు పలికింది. సుప్రీంకోర్టు వరస తీర్పులపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వివాదాస్పద అయోధ్య రామ మందిరంపై కూడా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించాల్సి ఉంది. దీనిపై దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుస్తున్నారు. -
శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతి
-
శబరిమల కేసు : సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : రెండు రోజులుగా సంచలన తీర్పులు వెల్లడిస్తూ వస్తోన్న సుప్రీంకోర్టు... నేడు కూడా మరో కీలక తీర్పు వెలువరించింది. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దీంతో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశించడానికి అనుమతి లభించింది. ఈ తీర్పు వెల్లడి సందర్భంగా దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళలు పూజలు చేసేందుకు అనుమతించాలని, మహిళలు దేవతలతో సమానమని ధర్మాసనం అభివర్ణించింది. శారీరక మార్పులను సాకుగా చూపి, మహిళలపై వివక్ష చూపడం సరికాదని సీజేఐ దీపక్ మిశ్రా అన్నారు. దేవతలను పూజిస్తూ.. మహిళలను సమదృష్టితో చూడకపోవడం సబబు కాదన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువమేమీ కాదని, చట్టాలు, సమాజం అందరినీ గౌరవించాలని పేర్కొన్నారు. 4-1 మెజార్టీతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. పదేళ్ళ నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు శబరిమల దేవాలయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కొన్నేళ్ల పాటు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలను విన్న తర్వాత ఆగస్టులో తీర్పును వాయిదా వేసింది. ఇన్ని రోజుల పాటు తీర్పును రిజర్వులో ఉంచిన అత్యున్నత న్యాయస్థానం, నేడు ఈ తీర్పు వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన ఈ సంచలన తీర్పు వెలువరించారు. ఇదీ కేసు నేపథ్యం రుతుస్రావం జరిగే 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం లేదన్న నిబంధనను పలువురు మహిళా న్యాయవాదులు తప్పుబట్టారు. కేరళ హిందూ ఆలయాలకు సంబంధించి ఉన్న రూల్3(బి)ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇందుకు సంబంధించిన నియమాలను నిర్ణయించే అధికారం స్థానిక పూజరాలకు మాత్రమే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 14, 15, 17 ఆర్టికల్స్ ప్రకారం... ఇలాంటి నిబంధనలు చట్ట విరుద్ధమని వాదించారు. అన్ని వయస్కుల మహిళలకు ఆలయంలో ప్రవేశించి పూజలు చేసే అవకాశం కల్పించాలని కోరారు. శబరిమలలో అమలవుతోన్న ఈ విధానంపై దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. దేవుడి ముందు అంతా సమానం అయినప్పుడు... శారీక అంశాల ఆధారంగా మహిళలపై నిషేధం ఎలా విధిస్తారని సామాజిక వాదులు వాదిస్తూ వచ్చారు. -
నూతన సీజేగా రంజన్ గొగోయ్!!
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర న్యాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు నూతన సీజే నియామకం గురించి జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయాన్ని కోరుతూ లేఖ రాసింది. ఈ క్రమంలో నూతన సీజేగా సీనియర్ జస్టిస్ రంజన్ గొగోయ్ పేరును ప్రతిపాదిస్తూ మిశ్రా న్యాయశాఖకు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబరు 3న రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సంప్రదాయాన్ని పాటిస్తూ... కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న జడ్జీల్లో రంజన్ గొగోయ్ సీనియర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో నూతన సీజేగా రంజన్ గొగోయ్ నియామకం లాంఛనప్రాయమే కానుంది. కాగా ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు రోస్టర్ (ఏ కేసును ఎవరు విచారించాలనే నిర్ణయం) కేటాయింపులు సమతూకంతో ఉండటం లేదని సీజేఐ దీపక్ మిశ్రాను వ్యతిరేకిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు జడ్జీల బృందంలో రంజన్ గొగోయ్ కూడా ఒకరు. ఈ సమావేశంలో జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు, జాస్తి చలమేశ్వర్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసెఫ్‌లు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. రంజన్ గొగోయ్ -
తొలిసారి మౌనం వీడిన చీఫ్ జస్టిస్ మిశ్రా
సాక్షి, న్యూఢిల్లీ : ఏ వ్యవస్థనైన విమర్శించడం, దాడి చేయడం చాలా సులువైన పని కానీ పని చేసే విధంగా మార్చడం కష్టమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. తనకు వ్యతిరేకంగా నలుగురు సీనియర్ జడ్జీలు తొలిసారి మీడియా సమావేశాన్ని పెట్టడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మిశ్రా పై విధంగా స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఏ వ్యవస్థనైనా నాశనం చేయడం చాలా సులువైన పని కానీ వ్యవస్థను పనిచేసే విధంగా మార్చడం కష్టమని పేర్కొన్నారు. అది సవాలుతో కూడుకున్నదని చెప్పారు. వ్యవస్థను బలహీనపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయని, వాటికి న్యాయవ్యవస్థ లొంగకుండా తిరస్కరించాలని పేర్కొన్నారు. అయితే ఇది సాధించాలంటే వ్యక్తిగత ఆకాంక్షలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. సకారాత్మక ఆలోచనా దృక్పథంతో నిర్మాణాత్మక చర్యలను చేపట్టవలసి ఉందన్నారు. దృఢమైన సంస్కరణలు తీసుకురావలంటే హేతుబద్దంగా, బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. అప్పుడు మాత్రమే వ్యవస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్నారు. ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టు రోస్టర్ (ఏ కేసును ఎవరు విచారించాలనే నిర్ణయం) కేటాయింపులు సమతూకంతో ఉండటం లేదని సీజేఐ దీపక్ మిశ్రాపై వ్యతిరేకతను నలుగురు సీనియర్ జడ్జీలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మిశ్రా ఈ విషయంపై స్పందించలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ విషయంపై స్పందించడం గమనార్హం. -
రాత్రికి రాత్రే మార్పులు; సుప్రీంకోర్టులో హైడ్రామా
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కాంగ్రెస్ పార్టీ అనూహ్యరీతిలో ఉపసంహరించుకుంది. రాత్రికే రాత్రే ధర్మాసనాన్ని మార్చేయడం, ఆర్డర్ కాపీలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం, అసంతృప్తితో కాంగ్రెస్ వెనుకడుగు వేయడం తదితర పరిణామాలు సుప్రీంకోర్టు వద్ద హైడ్రామాను తలపించాయి. అసలేం జరిగింది?: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు(ప్రతాప్ సింగ్ బజ్వా, అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్‌లు) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణార్హమా, కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సోమవారమే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్‌ల ధర్మాసనం.. రెండో నంబర్ కోర్టులో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ ప్రకటించారు. కానీ.. రాత్రికి రాత్రే మార్పులు: కాగా, సోమవారం నాటి రిజిస్ట్రార్ ప్రకటనకు విరుద్ధంగా.. మంగళవారం ఉదయం 6వ నంబర్ కోర్టులో, వేరొక ధర్మాసనం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పిటిషన్‌పై విచారణను ప్రారంభించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాదులు కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్‌లు ఆశ్చర్యానికి గురయ్యారు. ధర్మాసనం మార్పునకు సంబంధించిన ఆర్డర్ కాపీలను సిబల్ కోరగా, కోర్టు నిరాకరించింది. దీంతో అసహనానికి గురైన సిబల్.. సదరు ధర్మాసనం ముందు వాదించబోమని, పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాలని చెప్పారు. ధర్మాసం అంగీకారం మేరకు కాంగ్రెస్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’ సీజేఐనే కాబట్టి ఏ నిమిషంలోనైనా ధర్మాసనాలను మార్చే అధికారం చీఫ్ జస్టిస్‌కు ఉంటుందని తెలిసిందే. ఆశ్యర్యంగా ఉంది: ‘‘రాత్రికి రాత్రే ధర్మాసనాన్ని మార్చే అధికారం సీజేఐకి ఉంది. అయితే, సంబంధిత ఆదేశాల కాపీని ఇవ్వబోమని చెప్పడం మాత్రం ఆశ్యర్యం కలిగించింది. ‘ఆర్డర్ కాపీ లేకుండా, దాన్ని చదవకుండా మేం చాలెంజ్‌కు ఎలా వెళ్లగలం? అని సిబర్ అడిగారు. అప్పుడు కోర్టు.. ‘మెరిట్స్ ఆధారంగా ముందుకు వెళ్లండి’ అని సూచించింది. విచారణపై నమ్మకం సడలిన పరిస్థితిలో సిబాల్ కాంగ్రెస్ ఎంపీల పిటిషన్‌ను వెనక్కితీసుకున్నారు’’ అని ప్రశాంత్ భూషణ్ మీడియాకు చెప్పారు. -
సీజేఐ అభిశంసన.. కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అభిశంసన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని కాంగ్రెస్ పార్టీ సవాలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు ప్రతాప్‌సింగ్ భజ్వా, అమీ హర్షడ్రే యాజ్నిక్‌లు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. సీజేఐ అభిశంసన తీర్మానం కోరుతూ విపక్ష ఎంపీలు నోటీసులపై చేసిన సంతకాలను రాజ్యసభ చైర్మన్ పట్టించుకోలేదని, నిబంధనల ప్రకారం నోటీసులను తిరస్కరించే అధికారం ఆయనకు(వెంకయ్యకు) ఉన్నా, సీజేఐపై వచ్చిన ఆరోపణలపై కనీసం దర్యాప్తు కమిటీనైనా ఏర్పాటుచేయాల్సి ఉందని, ఈ మేరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు. కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సిఉంది. ధర్మాసనాల ఏర్పాటు, కేసుల కేటాయింపులు, రోస్టర్ విధానం తదితర అంశాల్లో సీజేఐ దీపక్ మిశ్రా తీరును నిరసిస్తూ నలుగురు సీనియర్ జడ్జిలు మీడియా సమావేశం నిర్వహించడం, ఆపై ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరగడం తెలిసిందే. రాజ్యసభలో సీజేఐపై అభిశంసన తీర్మానం కోరుతూ ఏడు పార్టీలకు చెందిన దాదాపు 60 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేయడం, చైర్మన్ వెంకయ్య నాయుడు సదరు నోటీసులను తిరస్కరించడం విదితమే. -
జడ్జీల అభిశంసన ఎలా?
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రాను పదవి నుంచి తొలగించడానికి ప్రతిపక్షాల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మిశ్రాపై రాసిన అభిశంసన (తొలగింపు) తీర్మానం ముసాయిదాకు మద్ధతుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియ కాంగ్రెస్ నాయకత్వాన వేగంగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో సీజేఐని సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల మాదిరిగానే తొలగించవచ్చా? అభిశంసన ప్రక్రియ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియాలో ఇంత వరకూ ఏ ఒక్క జడ్జీని తొలగించలేదు. అభిశంసన ప్రక్రియ క్లిష్టమైనది కావడమే దీనికి కారణం. దేశంలో ఇతర జడ్జీల మాదిరిగానే ప్రధాన న్యాయమూర్తిని తొలగించడానికి రాజ్యాంగంలోని 124వ అధికరణ అవకాశమిస్తోంది. ఈ అధికరణ కేంద్రంలోని చట్టసభల(పార్లమెంటు) ద్వారా న్యాయ వ్యవస్థను నియంత్రిస్తోంది. 124వ అధికరణ ప్రకారం పార్లమెంటు రెండు సభల్లో విడివిడిగా ఓ న్యాయమూర్తిని అభిశంసించే తీర్మానానికి హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది అనుకూలంగా ఓటేస్తే ఆ జడ్జీని రాష్ట్రపతి తొలగిస్తారు. దుష్ప్రవర్తన, పదవి నిర్వహించే సామర్ధ్యం లేకపోవడం అనే రెండు కారణాలతో జడ్జీలను తొలగించడానికి రాజ్యాంగం అనుమతిస్తోంది. మొదట జడ్జీల తొలగింపు ప్రక్రియ ప్రారంభించడానికి 124(2) అధికరణ, 14(4) అధికరణ, 124(5) అధికరణ, జడ్జీల విచారణ చట్టం(1969)ను పరిగణనలోకి తీసుకుంటారు. జడ్జీ అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టడానికి 100 మంది లోక్‌సభ, 50 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం. తీర్మానాన్ని మొదట ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. దాన్ని సభలో ప్రవేశ పెట్టడాన్ని అనుమతించడానికి లేదా నిరాకరించడానికి స్పీకర్ లేదా చైర్మన్‌కు అధికారం ఉంది. అభిశంసన తీర్మాన్నాన్ని సభాధ్యక్షుడు అనుమతిస్తే, ఆ న్యాయమూర్తిపై అభియోగాల దర్యాప్తునకు స్పీకర్ లేదా చైర్మన్ ఓ కమిటీ నియమిస్తారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మీద అభిశంసనకు ప్రతిపాదిస్తే కమిటీలో సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రముఖ న్యాయకోవిదుడు ఒకరు సభ్యులుగా ఉంటారు. సివిల్ కోర్టు హోదా ఉన్న ఈ కమిటీ అభియోగాల దర్యాప్తులో భాగంగా దస్తావేజులు తనిఖీతోపాటు, సాక్షులను ప్రశ్నిస్తుంది. జడ్జీపై ఆరోపణలు రుజువైనట్టు ఈ కమిటీ భావిస్తే పార్లమెంటు ఉభయసభల్లో మొదట అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సభలో చర్చ, తర్వాత ఓటింగ్ జరుగుతాయి. మొదటి సభలో మూడింట రెండు వంతుల మెజారిటీతో సభ్యులు తీర్మానం ఆమోదించాక, రెండో సభ దీన్ని చేపట్టి అదే పద్ధతిలో ఆమోదించాక తీర్మానం రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ న్యాయమూర్తిని తొలగిస్తూ ఉత్తర్వు జారీచేయడంతో అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది. ఏ దశలోనైనా అభిశంసన ఆగిపోవచ్చు! పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వి.రామస్వామిపై 1993లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం లోక్‌సభలో ఓటింగ్‌కు పెట్టినప్పుడు మూడింట రెండు వంతుల మెజారిటీ లేక వీగిపోయింది. తర్వాత రామస్వామి పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్ట్18న కలకత్తా హైకోర్టు జడ్జీగా ఉన్న సౌమిత్రా సేన్‌పై రాజ్యసభలో తీర్మానాన్ని భారీ మెజారిటీతో ఆమోదించారు. అభిశంసనను లోక్‌సభ సెప్టెంబర్‌లో చేపట్టే ముందే సేనా రాజీనామా చేయడంతో తొలగింపు ప్రక్రియ నిలిపివేశారు. 2011లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న పీడీ దినకరన్‌పై అభిశంసన ప్రక్రియ కూడా మధ్యలో ఉండగానే పదవికి రాజీనామా చేశారు. 2015లో గుజరాత్ హైకోర్టు జడ్జీ జేబీ పార్దీవాలా ఓ కేసులో తీర్పు ఇస్తూ, 65 ఏళ్ల తర్వాత కూడా రిజర్వేషన్లు కొనసాగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 58 మంది రాజ్యసభ సభ్యులు పార్దీవాలా తొలగింపునకు తీర్మానాన్ని అప్పటి చైర్మన్ హమీద్ అన్సారీకి సమర్పించారు. కొన్ని గంటల్లోనే పార్దీవాలా అభ్యంతరకర వ్యాఖ్యలను స్వయంగా తొలగించగా అభిశంసనకు తెరపడింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన..?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ) బుధవారం పేర్కొంది. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలు అన్నింటితో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టు రోస్టర్ (ఏ కేసును ఎవరు విచారించాలనే నిర్ణయం) కేటాయింపులు సమతూకంతో ఉండటం లేదని సీజేఐ దీపక్ మిశ్రాపై వ్యతిరేకతను నలుగురు సీనియర్ జడ్జిలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తోందని తెలిసింది. భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీలు, 50 మంది రాజ్యసభ ఎంపీల మద్దతు అవసరం. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎంపీల సంతకాలను సేకరించడం ప్రారంభించిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్ తెలిపారు. ఎన్సీపీకి చెందిన మరో ఎంపీ డీపీ త్రిపాఠి మాట్లాడుతూ.. అభిశంసన తీర్మాన పత్రంపై తాను ఇప్పటికే సంతకం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మూడు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికే ఈ తీర్మానం సంతకం చేసినట్లు తెలిసింది. -
సుప్రీం కోర్టులో కొత్త రోస్టర్
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కేసు విచారణ రోస్టర్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తొలిసారి బయటకు ప్రకటించారు. ఈ నెల 5వ తేదీ నుంచి విచారణకు స్వీకరించే కేసుల టేకప్కు సంబంధించి రోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ రోస్టర్‌లో కేవలం కొత్త కేసులకు మాత్రమే వర్తించనుంది. సుప్రీం కోర్టు వెబ్సైట్లో రోస్టర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. కాగా, రోస్టర్ విధానంపై కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్త రోస్టర్ ప్రకారం.. సీజేఐ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఎన్నికల వివాదాల కేసులు, నేర సంబంధిత కేసులు, సామాజిక న్యాయానికి సంబంధించిన కేసులను విచారిస్తారు. అవసరమైన సమయంలో రాజ్యాంగ బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక విచారణల నిమిత్తం విచారణ కమిషన్లను కూడా ఏర్పరుస్తారు. సుప్రీం కోర్టులో నెంబర్ 2 సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కార్మిక, పరోక్ష పన్నులు, నేర సంబంధిత అంశాలు, వినియోగదారుల రక్షణ కేసులను విచారిస్తారు. -
బత్తాయిల భాషలో మాట్లాడుకున్నారు..!!
సాక్షి, న్యూఢిల్లీ : నలుగురు సీనియర్ జడ్జిలు పుట్టించిన సెగ ఇప్పుడిప్పుడే చల్లారుతుందనగా.. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ మరో బాంబు పేల్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ మెడికల్ సీట్ల కుంభకోణంలో సీజేఐ పాత్ర ముమ్మాటికీ నిజమని, అందుకే సిట్ ఏర్పాటుకు ఆయన జంకుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ భూషణ్.. జస్టిస్ మిశ్రాపై సుప్రీంకోర్టులో అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘సీజేఐకి, కుట్రదారులకు మధ్య బత్తాయి పండ్లు, ఆలయాల పేర్లతో కోడ్ లాగ్వేజీ సంవాదాలు నడిచాయ’ని చెప్పారు. లక్నో పోలీస్ స్టేషన్లో సీజేఐపై ఈ మేరకు ఫిర్యాదుచేశానని కూడా చెప్పారు. 200 బత్తాయి పండ్లను ఢిల్లీ మందిర్‌కు తీసుకురా! : ఉత్తరప్రదేశ్ మెడికల్ సీట్ల కుంభకోణంలో జడ్జిల పాత్రను సీబీఐనే నిర్ధారించిందన్న ప్రశాంత్ భూషణ్.. సిట్టింగ్ జడ్జిలను ప్రశ్నించే అధికారం దర్యాప్తు సంస్థకు లేనందున సుప్రీంకోర్టు నేతృత్వంలోనే ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేశారు. ‘‘యూపీలోని 46 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై మెడికల్ కౌన్సిల్ విధించిన నిషేధాన్ని తొలగిస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వెనుక పెద్ద కథ నడిచింది. దీపక్ మిశ్రా సభ్యుడిగా ఉన్న ధర్మాసనమే ఆ తీర్పు ఇచ్చింది. అత్యంత వ్యూహాత్మకంగా, రహస్యంగా సాగిన ఈ వ్యవహారానికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. డబ్బుల్ని బత్తాయి పండ్లుగా, కలవాల్సిన చోటుని మందిరంగా పేర్కొంటూ కోడ్ లాగ్వేజీ సంభాషణలు నడిచాయి. ‘200 బత్తాయిలను తీసుకుని ఢిల్లీ మందిర్‌కు రా..’, ‘100 బత్తాయిలు.. అలహాబాద్ మందిర్..’ లాంటి మాటలు రికార్డయ్యాయి. వీటితోపాటు మరికొన్ని ఆధారాలను చూపించి లక్నో పోలీస్ స్టేషన్లో సీజేఐ మిశ్రాపై కేసు పెట్టాను’’ అని ప్రశాంత్ భూషణ్ వివరించారు. జాస్తి చలమేశ్వర్‌కు పంపిన నోట్లోనూ దొరికిపోయారు : యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు.. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నుంచి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ దీపక్ మిశ్రా ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ లోపాలున్నాయని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ‘‘నవంబర్ 8న సుప్రీంకోర్టులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జాస్తి చలమేశ్వర్ ఇచ్చిన ఆదేశాలను అప్పటికప్పుడు రద్దుచేయడమేకాక ఆ కేసును వేరే బెంచ్‌కు మార్చుతూ సీజేఐ నోటీసులు ఇచ్చారు. కానీ ఆ కాపీలో తేదీ నవంబర్ 6 అని ఉంది. అంటే ఏమిటి? రెండు రోజుల ముందే ఉత్తర్వులు జారీ అయిఉంటే రహస్యంగా ఎందుకు ఉంచినట్లు? ఇలాంటి ప్రశ్నలెన్నింటికో సమాధానం చెప్పాల్సింది సీజేఐనే. కాబట్టి ఆయన లేకుండా పారదర్శకంగా దర్యాప్తు, విచారణ జరగాలని మేం డిమాండ్ చేస్తున్నాం..’’ అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఇవే ఆ రెండు కేసులు.. సుప్రీంకోర్టులో నంబర్2గా కొనసాగుతోన్న జస్టిస్ చలమేశ్వర్‌ను విచారణ నుంచి తొలగించినవి.. పరస్పరం సంబంధమున్న రెండు కేసులు. 1. యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, 2. ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు. పూర్వాపరాల్లోకి వెళితే.. : ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నో కేంద్రంగా నడిచే ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు చెందిన మెడికల్ కాలేజీతోపాటు 46 ఇతర మెడికల్ కాలేజీల్లో సరైన వసతులులేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వాటిలో అడ్మిషన్లను రద్దు చేసింది. అయితే.. ఈ విషయంలో సుప్రీంకోర్టులో అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొందరు కాలేజీ యాజమాన్యాలతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. డీల్స్ కుదుర్చుకున్నది మరెవరోకాదు సాక్షాత్తూ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి(2004-10 మధ్య పనిచేశారు) ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ, ఆయన అనుచరుడు భావనా పాండే, మరో మధ్యవర్తి విశ్వనాథ్ అగ్రావాలాలే అని తేల్చింది. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌లో జస్టిస్ ఇష్రత్ సహా ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. పలువురు సిట్టింగ్ జడ్జిల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పొందరుపర్చింది. ఆ పేర్లలో దీపక్ మిశ్రా పేరుకూడా ఒకటికావడం గమనార్హం. ఈ కేసులో స్వయంగా జడ్జిలపైనే ఆరోపణలు వచ్చినందున... ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా అనే దానిపై వాదనలు విన్న జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. చివరకు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పింది. అంతలోనే.. ‘కాలేజీల్లో అడ్మిషన్లు జరుపుకోవచ్చు’అన్న తీర్పు ఇచ్చింది మిశ్రా ధర్మాసనమే కాబట్టి ఆయన పేరు లేకుండా బెంచ్‌ను ఏర్పాటుచేయాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను కూడా పరిగణలోకి తీసుకున్న చలమేశ్వర్.. 145(3) ప్రకారం సీజేఐ లేకుండానే బెంచ్‌ను ఏర్పాటుచేశారు. అంతలోనే.. ‘ఈ కేసును మీరు విచారించరాదు, దీన్ని వేరొక బెంచ్‌కు అప్పగించాలంటూ’ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి హుటాహుటిన ఆదేశాలు వచ్చాయి. జస్టిస్ ఇష్రత్ పేరుతో ముడుపుల కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ మిశ్రా మరో ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు అంశాలే తాజా వివాదానికి ప్రధాన కారణాలు భావిస్తున్నారు. -
‘సుప్రీం’లో సంక్షోభానికి కారణాలివి!
నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసెఫ్ శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కొన్ని కేసుల విచారణ, బెంచ్‌ల మార్పు వంటి విషయాల్లో ప్రధాన న్యాయమూర్తి(సీజే) దీపక్ మిశ్రా నిర్ణయాలు కారణమని చెబుతున్నారు. ఇందులో మొదటిది ఆర్.పీ. లూథ్రా వర్సెస్ భారత ప్రభుత్వ న్యాయశాఖ కేసులో కిందటేడాది అక్టోబర్ 27న ఇచ్చిన ఉత్తర్వు. రెండోది కిందటి నవంబర్‌లో సుప్రీంకోర్టు విచారణకు వచ్చిన జడ్జీల లంచాల కేసు. అత్యున్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సవరించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ) లేకుండా జరిపిన జడ్జీల నియామకాన్ని ఆర్పీ లూథ్రా అనే లాయర్ సవాలు చేశారు. ఈ కేసు విచారిస్తున్న ఆదర్శ్ కుమార్ గోయల్, ఉదయ్ ఉమేష్ లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ కిందటి అక్టోబర్ 27న కేంద్ర సర్కారుకు నోటీసు జారీ చేయడమేగాక కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ హాజరుకావాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సవరించిన ఎంఓపీ(నియామకాలకు సంబంధించి అనుసరించాల్సిన పద్ధతి) లేకుండా జడ్జీల నియామకాన్ని లూథ్రా సవాలుచేయడాన్ని ఇద్దరు జడ్జీల బెంచ్ తోసిపుచ్చింది. అయితే, విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎంఓపీని ఖరారు చేయడంలో ఇంకే మాత్రం జాప్యం తగదని తేల్చిచెప్పింది. తప్పుచేసే జడ్జీలను అభిశంసించడం ఒక్కటే పరిష్కార మార్గంగా చూడకుండా జడ్జీల వ్యవహారంలో దిద్దుబాటు చర్యలకు ఓ వ్యవస్థను ఏర్పాటుచేయాలని కూడా వారు సూచించారు. కేసు మరుసటి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసిన ఈ బెంచ్ కోర్టుకు ఈ కేసులో తోడ్పడడానికి సీనియర్ అడ్వకేట్ కేవీ విశ్వనాథన్‌ను నియమించింది. మరో బెంచీకి కేసు బదిలీ ఇద్దరు జడ్జీల బెంచి తదుపరి విచారణ ప్రారంభించక ముందే ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ కేసును జస్టిస్ మిశ్రా, ఏకే సిక్రీ, అమితావా రాయ్‌తో కూడిన ముగ్గురు జడ్జీల బెంచ్‌కు బదిలీచేశారు. ఈ కొత్త బెంచ్ కేసును నవంబర్ 8న విచారించింది. ఇద్దరు జడ్జీల బెంచ్ అక్టోబర్ 27న ఇచ్చిన ఆదేశంపై వ్యాఖ్యానిస్తూ, ‘‘ ఈ అంశాలు న్యాయవ్యవస్థ ఇలా పరిశీలించాల్సిన విషయాలు కావు’’ అని పేర్కొంది. ఇలాంటి ముఖ్యాంశాన్ని న్యాయవ్యవస్థ నిర్ణయించాల్సి వస్తే దానిపై రాజ్యాంగ ధర్మాసనమే విచారించాలన్నది నలుగురు సుప్రీం జడ్జీలు అభిప్రాయమని వారి లేఖ చదివితే అర్థమౌతోంది. చలమేశ్వర్ ఆదేశాన్ని పట్టించుకోని ప్రధాన న్యాయమూర్తి ఓ అవినీతి కేసులో సుప్రీంకోర్టు జడ్జీల పేర్లు చెప్పి అనుకూల తీర్పు వచ్చేలా చూస్తామని చెప్పి లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసు కూడా జడ్జీలకు, సీజే దీపక్ మిశ్రాకు మధ్య దూరం పెరగడానికి దారితీసింది. ఈ కేసును ఐదుగురు సీనియర్ జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని జాస్తి చలమేశ్వర్, ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన బెంచ్ నవంబర్ 9న ఆదేశించింది. అయితే, మరుసటి రోజే దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారిస్తూ, ‘‘ భారత ప్రధాన న్యాయమూర్తి కేసును కేటాయిస్తే తప్ప ఏ న్యాయమూర్తి తనంతట తాను ఏ విషయంపై విచారించజాలడు. ఎందుకంటే ఇలాంటి బాధ్యతల పంపిణీ వ్యవహారాల్లో ప్రధాన న్యాయమూర్తే సుప్రీం,’’ అని స్పష్టం చేసింది. బెంచ్‌లు ఏర్పాటు చేసే అధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉందని బెంచ్ తేల్చి చెప్పింది. ‘‘ఈ రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుకు భిన్నంగా ఉన్న ఎలాంటి ఆదేశం ఇంతకు ముందు జారీ చేసినా దానికి విలువ ఉండదు. అది రద్దయిన ఉత్తర్వు కిందే లెక్క,’’ అని జస్టిస్ మిశ్రా అన్నారు. కేంపెయిన్ ఫర్ జుడీషియల్ అకౌంటబిలిటీ అనే ఎన్జీఓ తరఫున ఈ కేసులో వాదిస్తున్న ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ రాజ్యాంగ ధర్మాసనం వాదనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. దీంతో సీజే ఆయనను తీవ్రంగా మందలించారు. లక్నోకు చెందిన ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే వైద్యకళాశాలలో కొత్త విద్యార్థుల ప్రవేశంపై నిషేధానికి సంబంధించిన ఈ కేసులో ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ నిందితుడు. సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో ఈ సంస్థ చైర్మన్ బీపీ యాదవ్, ఆయన కొడుకు పలష్ యాదవ్ తదితరులతో పాటు ఖుద్దూసీ కూడా అరెస్టయ్యారు. సీబీఐ జడ్జి లోయా మృతి కేసు సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసు విచారించిన సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి బీహెచ్ లోయా మృతి(2014 డిసెంబర్లో) కేసు విచారణ కూడా పై నలుగురు సుప్రీం జడ్జీల అసంతృప్తికి కారణమైంది. ఈ జడ్జి లోయా మృతిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ గురువారం దాఖలైన పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే మరుసటి రోజు శుక్రవారం లోయా మరణంపై సుప్రీంకోర్టు తన ముందుకొచ్చిన పిటిషన్‌పై వాదనలు వినడం ప్రారంభించింది. లాయర్లు అభ్యంతరాలు చెప్పినాగాని కేసును జడ్జీలు అరుణ్ మిశ్రా, ఎం.ఎం.శంతనగౌండర్తో కూడిన బెంచ్‌కి కేటాయించారు. ఓ పక్క బొంబాయి హైకోర్టు లోయా మృతిపై కేసు విచారిస్తుండగా సుప్రీంకోర్టు ఇలా వ్యవహరించడం, పైగా సీనియర్ జడ్జీల నిర్వహించే నాలుగు కోర్టులను కాదని పదో కోర్టుకు ఈ కేసు పంపడం కూడా నలుగురు జడ్జీల ఆగ్రహానికి కారణమైందని భావిస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
భారత ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ మంగళవారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీకాలం ఆగస్టు 27తో ముగియనుండటంతో ఆయన స్థానంలో మిశ్రా బాధ్యతలు చేపట్టనున్నారు. ఖేహర్ తర్వాత న్యాయస్ధానంలో అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్ మిశ్రాను కొలిజియం ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మిశ్రా.. ఒడిశా హైకోర్టులో అడిషనల్ జడ్జిగా, మధ్యప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఈ నెల 6వ తేదీవరకూ రాకపోకలు రద్దు
-
ఈ నెల 6వ తేదీవరకూ రాకపోకలు రద్దు
చెన్నై : చెన్నై విమానాశ్రయంలో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో విమానాశ్రయంలోని రన్ వే పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. చెన్నై విమానాశ్రయ డైరెక్టర్ దీపక్ మిశ్రా గురువారమిక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ వరకూ రాకపోకలు రద్దు చేసినట్లు తెలిపారు. భద్రత, రన్ వే లను పరిశీలించాకే విమానాల రాకపోకలను అనుమతిస్తామన్నారు. వరదలతో 350 విమానాల రాకపోకలు నిలిచిపోయాయని దీపక్ మిశ్రా వెల్లడించారు. ఇక విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 1500 మంది ప్రయాణికులను వివిధ మార్గాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు ఆయన తెలిపారు.