సాక్షి, న్యూఢిల్లీ : ఏ వ్యవస్థనైన విమర్శించడం, దాడి చేయడం చాలా సులువైన పని కానీ పని చేసే విధంగా మార్చడం కష్టమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. తనకు వ్యతిరేకంగా నలుగురు సీనియర్ జడ్జీలు తొలిసారి మీడియా సమావేశాన్ని పెట్టడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మిశ్రా పై విధంగా స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఏ వ్యవస్థనైనా నాశనం చేయడం చాలా సులువైన పని కానీ వ్యవస్థను పనిచేసే విధంగా మార్చడం కష్టమని పేర్కొన్నారు. అది సవాలుతో కూడుకున్నదని చెప్పారు.
వ్యవస్థను బలహీనపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయని, వాటికి న్యాయవ్యవస్థ లొంగకుండా తిరస్కరించాలని పేర్కొన్నారు. అయితే ఇది సాధించాలంటే వ్యక్తిగత ఆకాంక్షలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. సకారాత్మక ఆలోచనా దృక్పథంతో నిర్మాణాత్మక చర్యలను చేపట్టవలసి ఉందన్నారు. దృఢమైన సంస్కరణలు తీసుకురావలంటే హేతుబద్దంగా, బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. అప్పుడు మాత్రమే వ్యవస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్నారు.
ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టు రోస్టర్ (ఏ కేసును ఎవరు విచారించాలనే నిర్ణయం) కేటాయింపులు సమతూకంతో ఉండటం లేదని సీజేఐ దీపక్ మిశ్రాపై వ్యతిరేకతను నలుగురు సీనియర్ జడ్జీలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మిశ్రా ఈ విషయంపై స్పందించలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ విషయంపై స్పందించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment