సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించడం, వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ.. 150 ఏళ్ల నాటి అడల్ట్రీ చట్టం రద్దు, ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడం, శబరిమల కేసులో అన్ని వయసుల మహిళలను అయ్యప్ప దేవాలయంలోకి అనుమతిస్తూ గ్రీన్ సిగ్నల్... ఇలా గత కొన్ని రోజుల నుంచి చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోబోతున్నారు. 2017 ఆగస్టున సీజేఐగా బాధ్యతలు చేపట్టిన దీపక్ మిశ్రా, రేపు అంటే అక్టోబర్ 2న పదవి విరమణ చేయనున్నారు. ఒడిశాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించారు దీపక్ మిశ్రా. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘునాథ్ మిశ్రా కొడుకు దీపక్ మిశ్రా. 1953 అక్టోబర్ 3న జన్మించిన మిశ్రా, ఒడిశా హైకోర్టులో 1996లో అదనపు జడ్జిగా తన జ్యూడిషియల్ కెరీర్ ప్రారంభించారు. 2011లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టారు.
ఆశ్చర్యకరంగా దీపక్ మిశ్రా తను పదవిలో ఉన్నంత కాలం పలు చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. అవి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి కూడా. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరి చేశారు. జాతీయ గీతం తప్పనిసరి చేయడంపై పలువురు పలు రకాలుగా స్పందించారు. అంతేకాక ఇటీవల వెలువరించిన వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ సెక్షన్ 497 కొట్టివేత కూడా అంతే చర్చనీయాంశమైంది.
స్వలింగ సంపర్కం కూడా నేరం కాదంటూ.. సెక్షన్ 377 రద్దు చేయడం మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌జీబీటీ కమ్యూనిటీల్లో సంబరాలు నింపాయి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఎల్జీబీటీ కమ్యూనిటీకి కూడా వర్తిస్తాయని దీపక్ మిశ్రా స్పష్టంచేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అదేవిధంగా నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో కూడా నలుగురు నిందితులకు మరణ శిక్షను విధించడానికే దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మొగ్గు చూపింది. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు ఇచ్చి, తన పదవి నుంచి విరమణ పొందుతున్నారు దీపక్ మిశ్రా.
అంతేకాక మరో కీలక పరిణామం కూడా దీపక్ మిశ్రా పదవీ కాలంలోనే చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు బహిరంగంగా వచ్చి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లు మీడియా ముందు సంచలన విషయాలు వెల్లడించారు. తొలిసారి నలుగురు జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించి మరీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై ఆరోపణలు చేయడం అప్పట్లో దుమారం రేపింది. ఇలా ఆరోపణలు చేసిన వారిలో ఉన్న రంజన్ గగోయ్‌నే తదుపరి సీజేఐగా రాబోతున్నారు. రంజన్ గగోయ్‌ను తనకు సక్సెసర్‌గా నియమించాలని దీపక్ మిశ్రా ప్రతిపాదించారు. మిశ్రా తర్వాత టాప్ మోస్ట్ జడ్జి గగోయ్‌నే.
Comments
Please login to add a commentAdd a comment