
ఈ నెల 6వ తేదీవరకూ రాకపోకలు రద్దు
చెన్నై : చెన్నై విమానాశ్రయంలో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో విమానాశ్రయంలోని రన్ వే పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. చెన్నై విమానాశ్రయ డైరెక్టర్ దీపక్ మిశ్రా గురువారమిక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ వరకూ రాకపోకలు రద్దు చేసినట్లు తెలిపారు.
భద్రత, రన్ వే లను పరిశీలించాకే విమానాల రాకపోకలను అనుమతిస్తామన్నారు. వరదలతో 350 విమానాల రాకపోకలు నిలిచిపోయాయని దీపక్ మిశ్రా వెల్లడించారు. ఇక విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 1500 మంది ప్రయాణికులను వివిధ మార్గాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు ఆయన తెలిపారు.