భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ) బుధవారం పేర్కొంది. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలు అన్నింటితో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టు రోస్టర్ (ఏ కేసును ఎవరు విచారించాలనే నిర్ణయం) కేటాయింపులు సమతూకంతో ఉండటం లేదని సీజేఐ దీపక్ మిశ్రాపై వ్యతిరేకతను నలుగురు సీనియర్ జడ్జిలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటన ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తోందని తెలిసింది. భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీలు, 50 మంది రాజ్యసభ ఎంపీల మద్దతు అవసరం.
ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎంపీల సంతకాలను సేకరించడం ప్రారంభించిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) నాయకుడు శరద్ పవార్ తెలిపారు. ఎన్‌సీపీకి చెందిన మరో ఎంపీ డీపీ త్రిపాఠి మాట్లాడుతూ.. అభిశంసన తీర్మాన పత్రంపై తాను ఇప్పటికే సంతకం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మూడు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికే ఈ తీర్మానం సంతకం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment