సుప్రీంకోర్టు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రాను పదవి నుంచి తొలగించడానికి ప్రతిపక్షాల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మిశ్రాపై రాసిన అభిశంసన (తొలగింపు) తీర్మానం ముసాయిదాకు మద్ధతుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియ కాంగ్రెస్ నాయకత్వాన వేగంగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో సీజేఐని సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల మాదిరిగానే తొలగించవచ్చా? అభిశంసన ప్రక్రియ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియాలో ఇంత వరకూ ఏ ఒక్క జడ్జీని తొలగించలేదు. అభిశంసన ప్రక్రియ క్లిష్టమైనది కావడమే దీనికి కారణం.
దేశంలో ఇతర జడ్జీల మాదిరిగానే ప్రధాన న్యాయమూర్తిని తొలగించడానికి రాజ్యాంగంలోని 124వ అధికరణ అవకాశమిస్తోంది. ఈ అధికరణ కేంద్రంలోని చట్టసభల(పార్లమెంటు) ద్వారా న్యాయ వ్యవస్థను నియంత్రిస్తోంది. 124వ అధికరణ ప్రకారం పార్లమెంటు రెండు సభల్లో విడివిడిగా ఓ న్యాయమూర్తిని అభిశంసించే తీర్మానానికి హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది అనుకూలంగా ఓటేస్తే ఆ జడ్జీని రాష్ట్రపతి తొలగిస్తారు. దుష్ప్రవర్తన, పదవి నిర్వహించే సామర్ధ్యం లేకపోవడం అనే రెండు కారణాలతో జడ్జీలను తొలగించడానికి రాజ్యాంగం అనుమతిస్తోంది.
మొదట జడ్జీల తొలగింపు ప్రక్రియ ప్రారంభించడానికి 124(2) అధికరణ, 14(4) అధికరణ, 124(5) అధికరణ, జడ్జీల విచారణ చట్టం(1969)ను పరిగణనలోకి తీసుకుంటారు. జడ్జీ అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టడానికి 100 మంది లోక్‌సభ, 50 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం. తీర్మానాన్ని మొదట ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. దాన్ని సభలో ప్రవేశ పెట్టడాన్ని అనుమతించడానికి లేదా నిరాకరించడానికి స్పీకర్ లేదా చైర్మన్‌కు అధికారం ఉంది. అభిశంసన తీర్మాన్నాన్ని సభాధ్యక్షుడు అనుమతిస్తే, ఆ న్యాయమూర్తిపై అభియోగాల దర్యాప్తునకు స్పీకర్ లేదా చైర్మన్ ఓ కమిటీ నియమిస్తారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మీద అభిశంసనకు ప్రతిపాదిస్తే కమిటీలో సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రముఖ న్యాయకోవిదుడు ఒకరు సభ్యులుగా ఉంటారు.
సివిల్ కోర్టు హోదా ఉన్న ఈ కమిటీ అభియోగాల దర్యాప్తులో భాగంగా దస్తావేజులు తనిఖీతోపాటు, సాక్షులను ప్రశ్నిస్తుంది. జడ్జీపై ఆరోపణలు రుజువైనట్టు ఈ కమిటీ భావిస్తే పార్లమెంటు ఉభయసభల్లో మొదట అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సభలో చర్చ, తర్వాత ఓటింగ్ జరుగుతాయి. మొదటి సభలో మూడింట రెండు వంతుల మెజారిటీతో సభ్యులు తీర్మానం ఆమోదించాక, రెండో సభ దీన్ని చేపట్టి అదే పద్ధతిలో ఆమోదించాక తీర్మానం రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ న్యాయమూర్తిని తొలగిస్తూ ఉత్తర్వు జారీచేయడంతో అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది.
ఏ దశలోనైనా అభిశంసన ఆగిపోవచ్చు!
పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వి.రామస్వామిపై 1993లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం లోక్‌సభలో ఓటింగ్‌కు పెట్టినప్పుడు మూడింట రెండు వంతుల మెజారిటీ లేక వీగిపోయింది. తర్వాత రామస్వామి పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్ట్18న కలకత్తా హైకోర్టు జడ్జీగా ఉన్న సౌమిత్రా సేన్‌పై రాజ్యసభలో తీర్మానాన్ని భారీ మెజారిటీతో ఆమోదించారు. అభిశంసనను లోక్‌సభ సెప్టెంబర్లో చేపట్టే ముందే సేనా రాజీనామా చేయడంతో తొలగింపు ప్రక్రియ నిలిపివేశారు. 2011లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న పీడీ దినకరన్‌పై అభిశంసన ప్రక్రియ కూడా మధ్యలో ఉండగానే పదవికి రాజీనామా చేశారు. 2015లో గుజరాత్ హైకోర్టు జడ్జీ జేబీ పార్దీవాలా ఓ కేసులో తీర్పు ఇస్తూ, 65 ఏళ్ల తర్వాత కూడా రిజర్వేషన్లు కొనసాగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 58 మంది రాజ్యసభ సభ్యులు పార్దీవాలా తొలగింపునకు తీర్మానాన్ని అప్పటి చైర్మన్ హమీద్ అన్సారీకి సమర్పించారు. కొన్ని గంటల్లోనే పార్దీవాలా అభ్యంతరకర వ్యాఖ్యలను స్వయంగా తొలగించగా అభిశంసనకు తెరపడింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment