నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసెఫ్ శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కొన్ని కేసుల విచారణ, బెంచ్‌ల మార్పు వంటి విషయాల్లో ప్రధాన న్యాయమూర్తి(సీజే) దీపక్ మిశ్రా నిర్ణయాలు కారణమని చెబుతున్నారు. ఇందులో మొదటిది ఆర్.పీ. లూథ్రా వర్సెస్ భారత ప్రభుత్వ న్యాయశాఖ కేసులో కిందటేడాది అక్టోబర్ 27న ఇచ్చిన ఉత్తర్వు. రెండోది కిందటి నవంబర్లో సుప్రీంకోర్టు విచారణకు వచ్చిన జడ్జీల లంచాల కేసు. అత్యున్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సవరించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ) లేకుండా జరిపిన జడ్జీల నియామకాన్ని ఆర్పీ లూథ్రా అనే లాయర్ సవాలు చేశారు. ఈ కేసు విచారిస్తున్న ఆదర్శ్ కుమార్ గోయల్, ఉదయ్ ఉమేష్ లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ కిందటి అక్టోబర్ 27న కేంద్ర సర్కారుకు నోటీసు జారీ చేయడమేగాక కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ హాజరుకావాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
సవరించిన ఎంఓపీ(నియామకాలకు సంబంధించి అనుసరించాల్సిన పద్ధతి) లేకుండా జడ్జీల నియామకాన్ని లూథ్రా సవాలుచేయడాన్ని ఇద్దరు జడ్జీల బెంచ్ తోసిపుచ్చింది. అయితే, విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎంఓపీని ఖరారు చేయడంలో ఇంకే మాత్రం జాప్యం తగదని తేల్చిచెప్పింది. తప్పుచేసే జడ్జీలను అభిశంసించడం ఒక్కటే పరిష్కార మార్గంగా చూడకుండా జడ్జీల వ్యవహారంలో దిద్దుబాటు చర్యలకు ఓ వ్యవస్థను ఏర్పాటుచేయాలని కూడా వారు సూచించారు. కేసు మరుసటి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసిన ఈ బెంచ్ కోర్టుకు ఈ కేసులో తోడ్పడడానికి సీనియర్ అడ్వకేట్ కేవీ విశ్వనాథన్‌ను నియమించింది.
మరో బెంచీకి కేసు బదిలీ
ఇద్దరు జడ్జీల బెంచి తదుపరి విచారణ ప్రారంభించక ముందే ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ కేసును జస్టిస్ మిశ్రా, ఏకే సిక్రీ, అమితావా రాయ్‌తో కూడిన ముగ్గురు జడ్జీల బెంచ్‌కు బదిలీచేశారు. ఈ కొత్త బెంచ్ కేసును నవంబర్ 8న విచారించింది. ఇద్దరు జడ్జీల బెంచ్ అక్టోబర్ 27న ఇచ్చిన ఆదేశంపై వ్యాఖ్యానిస్తూ, ‘‘ ఈ అంశాలు న్యాయవ్యవస్థ ఇలా పరిశీలించాల్సిన విషయాలు కావు’’ అని పేర్కొంది. ఇలాంటి ముఖ్యాంశాన్ని న్యాయవ్యవస్థ నిర్ణయించాల్సి వస్తే దానిపై రాజ్యాంగ ధర్మాసనమే విచారించాలన్నది నలుగురు సుప్రీం జడ్జీలు అభిప్రాయమని వారి లేఖ చదివితే అర్థమౌతోంది.
చలమేశ్వర్ ఆదేశాన్ని పట్టించుకోని ప్రధాన న్యాయమూర్తి
ఓ అవినీతి కేసులో సుప్రీంకోర్టు జడ్జీల పేర్లు చెప్పి అనుకూల తీర్పు వచ్చేలా చూస్తామని చెప్పి లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసు కూడా జడ్జీలకు, సీజే దీపక్ మిశ్రాకు మధ్య దూరం పెరగడానికి దారితీసింది. ఈ కేసును ఐదుగురు సీనియర్ జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని జాస్తి చలమేశ్వర్, ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన బెంచ్ నవంబర్ 9న ఆదేశించింది. అయితే, మరుసటి రోజే దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారిస్తూ, ‘‘ భారత ప్రధాన న్యాయమూర్తి కేసును కేటాయిస్తే తప్ప ఏ న్యాయమూర్తి తనంతట తాను ఏ విషయంపై విచారించజాలడు. ఎందుకంటే ఇలాంటి బాధ్యతల పంపిణీ వ్యవహారాల్లో ప్రధాన న్యాయమూర్తే సుప్రీం,’’ అని స్పష్టం చేసింది. బెంచ్‌లు ఏర్పాటు చేసే అధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉందని బెంచ్ తేల్చి చెప్పింది.
‘‘ఈ రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుకు భిన్నంగా ఉన్న ఎలాంటి ఆదేశం ఇంతకు ముందు జారీ చేసినా దానికి విలువ ఉండదు. అది రద్దయిన ఉత్తర్వు కిందే లెక్క,’’ అని జస్టిస్ మిశ్రా అన్నారు. కేంపెయిన్ ఫర్ జుడీషియల్ అకౌంటబిలిటీ అనే ఎన్జీఓ తరఫున ఈ కేసులో వాదిస్తున్న ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ రాజ్యాంగ ధర్మాసనం వాదనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. దీంతో సీజే ఆయనను తీవ్రంగా మందలించారు. లక్నోకు చెందిన ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే వైద్యకళాశాలలో కొత్త విద్యార్థుల ప్రవేశంపై నిషేధానికి సంబంధించిన ఈ కేసులో ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ నిందితుడు. సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో ఈ సంస్థ చైర్మన్ బీపీ యాదవ్, ఆయన కొడుకు పలష్ యాదవ్ తదితరులతో పాటు ఖుద్దూసీ కూడా అరెస్టయ్యారు.
సీబీఐ జడ్జి లోయా మృతి కేసు
సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసు విచారించిన సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి బీహెచ్ లోయా మృతి(2014 డిసెంబర్‌లో) కేసు విచారణ కూడా పై నలుగురు సుప్రీం జడ్జీల అసంతృప్తికి కారణమైంది. ఈ జడ్జి లోయా మృతిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ గురువారం దాఖలైన పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే మరుసటి రోజు శుక్రవారం లోయా మరణంపై సుప్రీంకోర్టు తన ముందుకొచ్చిన పిటిషన్పై వాదనలు వినడం ప్రారంభించింది. లాయర్లు అభ్యంతరాలు చెప్పినాగాని కేసును జడ్జీలు అరుణ్ మిశ్రా, ఎం.ఎం.శంతనగౌండర్‌తో కూడిన బెంచ్‌కి కేటాయించారు. ఓ పక్క బొంబాయి హైకోర్టు లోయా మృతిపై కేసు విచారిస్తుండగా సుప్రీంకోర్టు ఇలా వ్యవహరించడం, పైగా సీనియర్ జడ్జీల నిర్వహించే నాలుగు కోర్టులను కాదని పదో కోర్టుకు ఈ కేసు పంపడం కూడా నలుగురు జడ్జీల ఆగ్రహానికి కారణమైందని భావిస్తున్నారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment