శబరిమలలోని అయ్యప్ప దేవాలయం
న్యూఢిల్లీ : రెండు రోజులుగా సంచలన తీర్పులు వెల్లడిస్తూ వస్తోన్న సుప్రీంకోర్టు... నేడు కూడా మరో కీలక తీర్పు వెలువరించింది. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దీంతో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశించడానికి అనుమతి లభించింది. ఈ తీర్పు వెల్లడి సందర్భంగా దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళలు పూజలు చేసేందుకు అనుమతించాలని, మహిళలు దేవతలతో సమానమని ధర్మాసనం అభివర్ణించింది. శారీరక మార్పులను సాకుగా చూపి, మహిళలపై వివక్ష చూపడం సరికాదని సీజేఐ దీపక్ మిశ్రా అన్నారు. దేవతలను పూజిస్తూ.. మహిళలను సమదృష్టితో చూడకపోవడం సబబు కాదన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువమేమీ కాదని, చట్టాలు, సమాజం అందరినీ గౌరవించాలని పేర్కొన్నారు. 4-1 మెజార్టీతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.
పదేళ్ళ నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు శబరిమల దేవాలయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కొన్నేళ్ల పాటు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలను విన్న తర్వాత ఆగస్టులో తీర్పును వాయిదా వేసింది. ఇన్ని రోజుల పాటు తీర్పును రిజర్వులో ఉంచిన అత్యున్నత న్యాయస్థానం, నేడు ఈ తీర్పు వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన ఈ సంచలన తీర్పు వెలువరించారు.
ఇదీ కేసు నేపథ్యం
రుతుస్రావం జరిగే 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం లేదన్న నిబంధనను పలువురు మహిళా న్యాయవాదులు తప్పుబట్టారు. కేరళ హిందూ ఆలయాలకు సంబంధించి ఉన్న రూల్3(బి)ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇందుకు సంబంధించిన నియమాలను నిర్ణయించే అధికారం స్థానిక పూజరాలకు మాత్రమే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 14, 15, 17 ఆర్టికల్స్ ప్రకారం... ఇలాంటి నిబంధనలు చట్ట విరుద్ధమని వాదించారు. అన్ని వయస్కుల మహిళలకు ఆలయంలో ప్రవేశించి పూజలు చేసే అవకాశం కల్పించాలని కోరారు. శబరిమలలో అమలవుతోన్న ఈ విధానంపై దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. దేవుడి ముందు అంతా సమానం అయినప్పుడు... శారీక అంశాల ఆధారంగా మహిళలపై నిషేధం ఎలా విధిస్తారని సామాజిక వాదులు వాదిస్తూ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment