సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక తీర్పులతో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పూర్వపరాలను సైతం తవ్వి తీర్పులను వెలువరిస్తోంది. అక్టోబర్ 2తో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ దీపక్ మిశ్రా.. పోతూపోతూ చారిత్రక తీర్పులను వెలువరిస్తున్నారు. 158 ఏళ్ల నుంచి భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లో వేళ్లూనుకుని పోయి స్వలింగ సంపర్కుల పాలిట శాపంగా మారిన సెక్షన్ 377ను రద్దు చేస్తు సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 6న వెలువడిన ఈ తీర్పు పట్ల ఎల్‌జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు హర్షం వ్యక్తం చేశారు. దీంతో 150 ఏళ్లుగా వారు ఎదుర్కొంటున్న వివక్షకు సుప్రీంకోర్టు చరమగీతం పాడింది.
స్వలింగ సంపర్కం నేరం కాదు
ఆధార్ రాజ్యాంగ బద్దమైనది...
యూపీఏ హాయాములో ఎన్నో వివాదాల నడుమ తీసుకువచ్చిన ఆధార్ కార్టుపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డును ఎక్కడ వాడాలో, ఎక్కడ వాడకూడదో అంటూ దేశంలోని 110 కోట్ల జనాభా తికమకపడుతున్న సమయంలో న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ఏఏ సమయాల్లో ఆధార్ వాడాల్లో స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తూ.. పౌరుల వ్యక్తిగత డాటాను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. నిజానికి ఆధార్ సమస్య ఈ నాటిది కాదు. ఆధార్‌పై గతంలో కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి పుట్టస్వామి కేసులో విచారిస్తూ 2017 ఆగస్ట్ 24న పౌరుల వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సంచలన తీర్పును వెలువరించింది. ఆధార్‌పై మరో తీర్పును వెలువరించి దానికి రాజ్యాంగ బద్దతను గుర్తించింది.
ఆధార్ రాజ్యాంగబద్ధమే
వివాహేతర సంబంధాలు.. సెక్షన్ 497 కొట్టివేత
ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లో దీనిని అత్యున్నత తీర్పుగా కొందరు వర్ణిస్తున్నారు. వివాహేతర సంబంధం నేరం కాదని.. ఐపీసీలోని సెక్షన్ 497ను కొట్టివేస్తే న్యాయస్థానం తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 27న వెలువరించిన ఈ తీర్పుపై దేశంలోని విభిన్న వర్గాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. వివాహేతర సంబంధానికి సుప్రీంకోర్టే లైసెన్స్ ఇచ్చిందని కొందరూ అభిప్రాయపడుతుండగా.. ప్రజల హక్కులకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలకు కాలం చెల్లిందని కోర్టు తీర్పును సమర్థించుకుంది. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్ కాలరాస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
శబరిమలపై సంచలన తీర్పు...
కేరళలోని శబరిమల ఆలయంలోకి పురుషులతో పాటు మహిళలు కూడా ప్రవేశించవచ్చని కోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది. దేశంలోని మహిళల హక్కులను గుర్తిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన అత్యున్నత తీర్పుగా కేంద్రమంత్రి మేనకా గాంధీ ఈ తీర్పును వర్ణించారు. శబరిమల ఆలయంలోకి మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని కోరతూ ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేశారు. మహారాష్ట్రకు చెందన తృప్తీ దేశాయ్ అనే యువతి ఆలయంలోకి ప్రవేశంపై పెద్ద ఉద్యమాన్నే నడిపింది.
శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఆలయ నిబందనలు రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుకు విరుధ్దంగా ఉన్నాయంటూ అనేక కేసులు సుప్రీం ముంగిట ఉన్నాయి. ఆచారం అనేది మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదంటూ.. పురుషులతో సహా మహిళలకు కూడా ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి జస్టీస్ దీపక్ నేతృత్వంలోని ధర్మాసనం ముగింపు పలికింది. సుప్రీంకోర్టు వరస తీర్పులపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వివాదాస్పద అయోధ్య రామ మందిరంపై కూడా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించాల్సి ఉంది. దీనిపై దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment