న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నుల దాఖలుకు ఆధార్–పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని తాము గతంలోనే స్పష్టం చేశామనీ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏను సమర్థించామని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల ధర్మాసనం గుర్తుచేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. శ్రేయా సేన్, జయశ్రీ సప్తుతే అనే వ్యక్తులు ఆధార్–పాన్ అనుసంధానం చేయకుండా 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. దీన్ని కేంద్రం వ్యతిరేకించగా, ఢిల్లీ హైకోర్టు అనుమతించింది.
తాజాగా కేంద్రం పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి పాన్–ఆధార్ కార్డులను లింక్ చేశాకే రిటర్నులు దాఖలు చేయాలని ఇద్దరు ప్రతివాదులకు స్పష్టం చేసింది. అనంతరం కేంద్రం దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆధార్ కార్యక్రమం చట్టబద్ధమైనదేనని 2018, సెప్టెంబర్ 26న ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆధార్–పాన్ అనుసంధానాన్ని సమర్థించిన కోర్టు.. స్కూలు అడ్మిషన్లు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్ ఇవ్వాలన్న నిబంధనల్ని కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment