పాన్–ఆధార్ లింకు సరైందే
సుప్రీం కోర్టు సమర్థన
► ఆధార్‌లేని వారికి మినహాయింపు
► రాజ్యాంగ బెంచ్ నిర్ణయం వెలువడేవరకు నిబంధనపై పాక్షిక స్టే
న్యూఢిల్లీ: పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఇంతవరకూ ఆధార్ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చని.. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఆధార్ కోసం దరఖాస్తు చేసి ఇంకా పొందని వారికి పాన్‌కార్డుతో అనుసంధానం నుంచి, వారి పాన్‌కార్డుల్ని చెల్లనివిగా ప్రకటించడం నుంచి మినహాయింపునిచ్చింది.
పాన్ జారీ, ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను తీసుకురావడం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ సీపీఐ నేత బినయ్ విశ్వం తదితరులు వేసిన పిటిషన్లపై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనకు, ఆధార్ చట్టానికి మధ్య ఎలాంటి వైరుధ్యమూ లేదని పేర్కొంది. అయితే ఈ అంశంతో సంబంధమున్న 21వ అధికరణ(గోప్యత హక్కు)పై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు కొత్త నిబంధనపై పాక్షిక స్టే అవసరమని బెంచ్ పేర్కొంది. రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం వెలువడే వరకు ఆధార్ జతచేయని పాన్ కార్డులు, గతంలో జరిపిన లావాదేవీలు కూడా చెల్లుతాయని స్పష్టం చేసింది.
ఆధార్ సమాచారం లీక్ కాకుండా చర్యలు తీసుకోండి..
పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను కోర్టు సమర్ధించింది. ఆధార్‌పై కోర్టు తరచూ ఉత్తర్వులు జారీ చేస్తోంది కనుక ప్రభుత్వం సెక్షన్ 139ఏఏను తీసుకురాకుండా ఉండాల్సిందన్న పిటిషనర్ల వాదనను బెంచ్ తోసిపుచ్చింది. ఈ సెక్షన్ రూపకల్పన, అమలులో పార్లమెంట్‌కు పూర్తి అధికారం ఉందని, అది కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించడం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా 139ఏఏ సెక్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే కోర్టులో గట్టిగా సమర్థించుకుంది.
పాన్‌లకు నకిలీలను సృష్టించే అవకాశముందని, ఆధార్ విషయంలో ఇది సాధ్యం కాదని తెలిపింది. ఉగ్రవాదులకు నిధుల కోసం, నల్లధనం సృష్టికి వాడుతున్న నకిలీ కార్డుల ఏరివేత కోసం ఈ నిబంధన తెచ్చామని వివరించింది. అయితే ఆధార్ పౌరులకు తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని సుప్రీం కోర్టు 2015లో ఇచ్చిన తీర్పును కేంద్రం తిరస్కరించకూడదని పిటిషనర్లు వాదించారు. గోప్యత హక్కు వంటి అంశాలపై తాము జోక్యం చేసుకోబోమని బెంచ్ పేర్కొంది. అయితే ఆధార్ సమాచారం లీకయ్యే అవకాశముందన్న ఆందోళన నేపథ్యంలో ఆ సమాచారం లీక్ కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
స్వాగతించిన కాంగ్రెస్
‘పాన్–ఆధార్ తప్పనిసరి’ నిబంధనపై సుప్రీం కోర్టు విధించిన పాక్షిక స్టేను కాంగ్రెస్ స్వాగతించింది. గోప్యత హక్కు తీవ్రమైన అంశమని అత్యున్నత న్యాయస్థానం భావించినట్లు కనిపిస్తోందని పార్టీ ప్రతినిధి టోమ్ వడక్కన్ పేర్కొన్నారు.