ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ తప్పనిసరి
► జూలై 1 నుంచి ఆధార్ నంబర్ ఇవ్వాల్సిందే
► పాన్ కార్డు దరఖాస్తుకు కూడా: కేంద్ర ప్రభుత్వం
► సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో స్పష్టత
న్యూఢిల్లీ: జూలై 1 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి అని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) కార్డు కోసం దరఖాస్తు చేసే వారు ఆధార్‌ను సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే సుప్రీం తాత్కాలిక మినహాయింపునిచ్చిందని, వారి పాన్‌కార్డుల్ని రద్దుచేయమని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో సందేహాల నివృత్తికి ‘తీర్పు ప్రభావం’ పేరిట మూడు అంశాలతో కూడిన ప్రకటనను సీబీడీటీ విడుదల చేసింది.
2017 జూలై 1 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేవారు, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి తమ ఆధార్ నంబర్‌ను లేదా తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని సమర్పించాలని స్పష్టం చేసింది. 2017 జూలై 1 నాటికి పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆధార్ నంబర్ కలిగి ఉన్నా.. ఆధార్ నంబర్ పొందేందుకు అర్హత ఉన్న వారు.. తమ ఆధార్ నంబర్‌ను పాన్ కార్డుకు అనుసంధానం చేసేందుకు ఆదాయపుపన్ను అధికారులకు తెలియజేయాలని పేర్కొంది.
ఈ ప్రక్రియ పూర్తి చేయకపోయినా.. సదరు వ్యక్తి ఆధార్ నంబర్‌ను పొందకపోయినా ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా సీబీడీటీ వెల్లడించింది. ఆధార్ కార్డు లేని వారికి, ఆధార్ తీసుకోవడానికి ఇష్టపడని వారికీ సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చిందని, అలాంటి వారి పాన్ కార్డులు చెల్లనివిగా ప్రకటించడం నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఒకవేళ పాన్ కార్డు చెల్లనిదిగా ప్రకటిస్తే.. సదరు వ్యక్తి తన బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడం కుదరదని, అందువల్లే సుప్రీంకోర్టు ఈ మినహాయింపు ఇచ్చిందని తెలిపింది.
ఇంతవరకూ 1.16 కోట్ల ఆధార్–పాన్‌కార్డుల అనుసంధానం
సుప్రీంకోర్టు తీర్పును ప్రధాని కార్యాలయంలోని ఉన్నతాధికారుల బృందం, న్యాయ, ఆర్థిక శాఖ లు, సీబీడీటీ, ఆదాయపన్ను విభాగాలకు చెందిన అధికారుల బృందం సమీక్షించిందని, అనంతరం దీనిపై స్పష్టతనిస్తూ ప్రకటన జారీ చేశామని సీనియర్ అధికారులు వెల్లడించారు. కాగా ఇంతవరకూ ఐటీ శాఖ 1.16 కోట్ల ఆధార్ నంబర్లను పాన్‌కార్డులకు అనుసంధానం చేసింది.