నకిలీ పాన్‌కార్డుల నియంత్రణకు ఆధార్ తప్పనిసరి
సుప్రీంకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ
న్యూఢిల్లీ: పాన్ కార్డుల జారీకి ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సమర్థించుకుంది. దేశవ్యాప్తంగా నకిలీ పాన్ కార్డుల వినియోగాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, పాన్ కార్డుల జారీకోసం ‘ఆధార్’ నంబర్‌ను తప్పనిసరి చేస్తున్న ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
కేంద్రం తరఫున అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘పాన్’ కార్డుల జారీలో నకిలీకి అవకాశముందని, అదే సమయంలో ‘ఆధార్’ అత్యంత సురక్షితమైన, బలీయమైన వ్యవస్థ అని, ఇందులో నకిలీకి ఏమాత్రం ఆస్కారం లేదని స్పష్టం చేశారు. దాదాపు పది లక్షల పాన్ కార్డులను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా 113.7 కోట్ల ఆధార్ కార్డులు జారీ చేస్తే ఒక్క నకిలీ కూడా బయటపడలేదని తెలిపారు.
‘ఆధార్’ వ్యవస్థ కారణంగా ప్రభుత్వం పేదలకు ప్రయోజనం కలిగించే వివిధ పథకాలు, పెన్షన్ పథకాలపై రూ.50 వేల కోట్లను ఆదా చేసుకోగలిగిందని వివరించారు. ఉగ్రవాద సంస్థలకు నిధుల పంపిణీ ప్రమాదాన్ని, అలాగే నల్లధన వ్యాప్తిని నివారించడంలో ఆధార్ అత్యంత ప్రభావవంతంగా ఉపయోగపడు తోందన్నారు.