సాక్షి, న్యూఢిల్లీ : నలుగురు సీనియర్ జడ్జిలు పుట్టించిన సెగ ఇప్పుడిప్పుడే చల్లారుతుందనగా.. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ మరో బాంబు పేల్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ మెడికల్ సీట్ల కుంభకోణంలో సీజేఐ పాత్ర ముమ్మాటికీ నిజమని, అందుకే సిట్ ఏర్పాటుకు ఆయన జంకుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ భూషణ్.. జస్టిస్ మిశ్రాపై సుప్రీంకోర్టులో అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘సీజేఐకి, కుట్రదారులకు మధ్య బత్తాయి పండ్లు, ఆలయాల పేర్లతో కోడ్ లాగ్వేజీ సంవాదాలు నడిచాయ’ని చెప్పారు. లక్నో పోలీస్ స్టేషన్‌లో సీజేఐపై ఈ మేరకు ఫిర్యాదుచేశానని కూడా చెప్పారు.
200 బత్తాయి పండ్లను ఢిల్లీ మందిర్‌కు తీసుకురా! : ఉత్తరప్రదేశ్ మెడికల్ సీట్ల కుంభకోణంలో జడ్జిల పాత్రను సీబీఐనే నిర్ధారించిందన్న ప్రశాంత్ భూషణ్.. సిట్టింగ్ జడ్జిలను ప్రశ్నించే అధికారం దర్యాప్తు సంస్థకు లేనందున సుప్రీంకోర్టు నేతృత్వంలోనే ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేశారు. ‘‘యూపీలోని 46 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై మెడికల్ కౌన్సిల్ విధించిన నిషేధాన్ని తొలగిస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వెనుక పెద్ద కథ నడిచింది. దీపక్ మిశ్రా సభ్యుడిగా ఉన్న ధర్మాసనమే ఆ తీర్పు ఇచ్చింది. అత్యంత వ్యూహాత్మకంగా, రహస్యంగా సాగిన ఈ వ్యవహారానికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. డబ్బుల్ని బత్తాయి పండ్లుగా, కలవాల్సిన చోటుని మందిరంగా పేర్కొంటూ కోడ్ లాగ్వేజీ సంభాషణలు నడిచాయి. ‘200 బత్తాయిలను తీసుకుని ఢిల్లీ మందిర్‌కు రా..’, ‘100 బత్తాయిలు.. అలహాబాద్ మందిర్..’ లాంటి మాటలు రికార్డయ్యాయి. వీటితోపాటు మరికొన్ని ఆధారాలను చూపించి లక్నో పోలీస్ స్టేషన్‌లో సీజేఐ మిశ్రాపై కేసు పెట్టాను’’ అని ప్రశాంత్ భూషణ్ వివరించారు.
జాస్తి చలమేశ్వర్‌కు పంపిన నోట్‌లోనూ దొరికిపోయారు : యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు.. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నుంచి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ దీపక్ మిశ్రా ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ లోపాలున్నాయని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ‘‘నవంబర్ 8న సుప్రీంకోర్టులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జాస్తి చలమేశ్వర్ ఇచ్చిన ఆదేశాలను అప్పటికప్పుడు రద్దుచేయడమేకాక ఆ కేసును వేరే బెంచ్‌కు మార్చుతూ సీజేఐ నోటీసులు ఇచ్చారు. కానీ ఆ కాపీలో తేదీ నవంబర్ 6 అని ఉంది. అంటే ఏమిటి? రెండు రోజుల ముందే ఉత్తర్వులు జారీ అయిఉంటే రహస్యంగా ఎందుకు ఉంచినట్లు? ఇలాంటి ప్రశ్నలెన్నింటికో సమాధానం చెప్పాల్సింది సీజేఐనే. కాబట్టి ఆయన లేకుండా పారదర్శకంగా దర్యాప్తు, విచారణ జరగాలని మేం డిమాండ్ చేస్తున్నాం..’’ అని ప్రశాంత్ భూషణ్ అన్నారు.
ఇవే ఆ రెండు కేసులు..
సుప్రీంకోర్టులో నంబర్2గా కొనసాగుతోన్న జస్టిస్ చలమేశ్వర్‌ను విచారణ నుంచి తొలగించినవి.. పరస్పరం సంబంధమున్న రెండు కేసులు. 1. యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, 2. ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు.
పూర్వాపరాల్లోకి వెళితే.. : ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నో కేంద్రంగా నడిచే ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు చెందిన మెడికల్ కాలేజీతోపాటు 46 ఇతర మెడికల్ కాలేజీల్లో సరైన వసతులులేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వాటిలో అడ్మిషన్లను రద్దు చేసింది. అయితే.. ఈ విషయంలో సుప్రీంకోర్టులో అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొందరు కాలేజీ యాజమాన్యాలతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. డీల్స్ కుదుర్చుకున్నది మరెవరోకాదు సాక్షాత్తూ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి(2004-10 మధ్య పనిచేశారు) ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ, ఆయన అనుచరుడు భావనా పాండే, మరో మధ్యవర్తి విశ్వనాథ్ అగ్రావాలాలే అని తేల్చింది. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌లో జస్టిస్ ఇష్రత్ సహా ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. పలువురు సిట్టింగ్ జడ్జిల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో పొందరుపర్చింది. ఆ పేర్లలో దీపక్ మిశ్రా పేరుకూడా ఒకటికావడం గమనార్హం.
ఈ కేసులో స్వయంగా జడ్జిలపైనే ఆరోపణలు వచ్చినందున... ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా అనే దానిపై వాదనలు విన్న జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. చివరకు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పింది. అంతలోనే.. ‘కాలేజీల్లో అడ్మిషన్లు జరుపుకోవచ్చు’అన్న తీర్పు ఇచ్చింది మిశ్రా ధర్మాసనమే కాబట్టి ఆయన పేరు లేకుండా బెంచ్‌ను ఏర్పాటుచేయాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను కూడా పరిగణలోకి తీసుకున్న చలమేశ్వర్.. 145(3) ప్రకారం సీజేఐ లేకుండానే బెంచ్‌ను ఏర్పాటుచేశారు. అంతలోనే.. ‘ఈ కేసును మీరు విచారించరాదు, దీన్ని వేరొక బెంచ్‌కు అప్పగించాలంటూ’ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి హుటాహుటిన ఆదేశాలు వచ్చాయి. జస్టిస్ ఇష్రత్ పేరుతో ముడుపుల కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ మిశ్రా మరో ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు అంశాలే తాజా వివాదానికి ప్రధాన కారణాలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment