
భారత ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ మంగళవారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీకాలం ఆగస్టు 27తో ముగియనుండటంతో ఆయన స్థానంలో మిశ్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఖేహర్ తర్వాత న్యాయస్ధానంలో అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్ మిశ్రాను కొలిజియం ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మిశ్రా.. ఒడిశా హైకోర్టులో అడిషనల్ జడ్జిగా, మధ్యప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.