కావేరీ ముగిసింది మహానది ముంచుకొస్తోంది!
కావేరీ ముగిసింది మహానది ముంచుకొస్తోంది!
Published Sat, Sep 17 2016 1:47 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
న్యూఢిల్లీ : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య హింసాత్మక వాతావరణం సృష్టించిన కావేరి నదీ జలవివాదం ఇలా సద్దుమణిందో లేదో మరో నదీ వివాదం ముంచుకొస్తోంది. ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య మహానది జలాల పంపకంపై వివాదం కేంద్రం చెంతకు చేరింది. కావేరి వివాదం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్రప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో, మహానది జలాల పంపకంపై కేంద్రం ముందుగానే స్పందించింది. ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, రమణ్ సింగ్లతో కేంద్రం నేడు సమావేశం నిర్వహించనుంది. కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది.
తమ రాష్ట్రంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా చత్తీస్గఢ్ ప్రభుత్వం మహానదిపై ఏడు నుంచి ఎనిమిది బ్యారేజీలు నిర్మించిందని ఒడిశా ఆరోపిస్తోంది. అదేవిధంగా అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్లను ఒడిశా వాడుకుంటుందని చత్తీస్గఢ్ ప్రభుత్వం మరోవైపు నుంచి విమర్శలు గుప్పిస్తోంది. నది ప్రవాహాన్ని అడ్డుకోవడానికేమీ ఈ బ్యారేజీలను నియమించడం లేదని రమణ్ సింగ్ వాదిస్తున్నారు. నది జలాల పంపక వివాదంపై ఓ ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయాలని ఒడిశా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, ఈ వివాదాన్ని నేషనల్ ఇంటరెస్ట్ కింద పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని ఒడిశా ప్రభుత్వం కోరుతోంది.
Advertisement