నిప్పు రాజేస్తున్న నీళ్లు!
⇒ కృష్ణా బేసిన్‌లో ఆది నుంచీ తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలే
⇒ నీటి వాటాలు, ఉల్లంఘనలపై పరస్పర ఫిర్యాదులు
⇒ బ్రజేశ్ ట్రిబ్యునల్ ముందు సైతం భిన్న వాదనలే
⇒ పాలమూరు, డిండితో మరింత ముదిరిన వివాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదం నిరంతరం నిప్పును రాజేస్తూనే ఉంది. రాష్ట్ర పునర్విభజనకు ముందు, ఆ తర్వాత కూడా దీని చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉన్నాయి. విభజన చట్టంలోని అనేక అంశాలు కొలిక్కి వస్తున్నా నీటి పంపకాల వివాదం మాత్రం తేలడం లేదు. విభజన అనంతరం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి వినియోగం, ప్రాజెక్టుల నియంత్రణపై మొదలైన రగడ 27 నెలలుగా రగులుతూనే ఉంది. కృష్ణా బోర్డు, కేంద్రం జోక్యం చేసుకున్నా వీటికి ఫుల్‌స్టాఫ్ పడటం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర జల వనరుల శాఖ నిర్వహిస్తున్న అపెక్స్ కౌన్సిల్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకనైనా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుందా? లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
ట్రిబ్యునల్ ముందూ భిన్న వాదనలే
కృష్ణా జలాల వివాదంపై విచారణ చేస్తున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుల సామర్థ్యం, వాటి కింద ఉన్న ఆయకట్టును పరిగణనలోకి తీసుకొని ప్రతి ప్రాజెక్టుకూ కేటాయింపులు చేయాలని తెలంగాణ వాదిస్తోంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతమే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఆయకట్టు ప్రాంతం 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు ఏమాత్రం సరిపోవ ని వాదిస్తోంది.
ఏపీలో పరీవాహక ప్రాంతం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా.. మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలన్నది రాష్ట్రం వాదన. తెలంగాణ చేపట్టిన పాలమూరు, డిండిలను ఏపీ తప్పుపడుతుండగా.. పట్టిసీమ, పోలవరంలో తమకు 90 టీఎంసీల వాటా వస్తుందని తెలంగాణ అడుగుతోంది.
నియంత్రణపై తలోమాట..
ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణపైనా ఇరు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతోంది. ప్రాజెక్టులన్నింటినీ కృష్ణా బోర్డు నియంత్రణలో ఉండాలని ఏపీ పట్టుబడుతుండగా.. తెలంగాణ అం గీకరించడం లేదు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ కాల పరి మితిని రెండేళ్లు పెంచారని, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై నిర్ణయం చేసే వరకు నియంత్రణ అన్న ప్రశ్నే ఉండదని చెబుతోంది.