సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్‌లో లభ్యత జలాల కేటాయింపులు మళ్లీ చేపట్టాలని, పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా తెలంగాణకు కోటా పెంచాలని విన్నవిస్తూ వస్తున్న తెలంగాణ.. ప్రస్తుతం మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగు అవసరాలు, పారిశ్రామిక అవసరాలు కలిపి రాష్ట్రానికి మొత్తం గా 936.58 టీఎంసీలు అవసరమని పేర్కొన్న తెలంగాణ.. అందులో 206 టీఎంసీలు తాము భవిష్యత్తులో చేపట్టాలని భావిస్తున్న కొత్త ప్రాజెక్టులకు అవసరమని ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
వీటి ద్వారా కొత్తగా 23,37,570 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రణాళిక తమవద్ద ఉందని స్పష్టంచేసింది. జూరాల వరద కాల్వ కిందే ఏకంగా 100 టీఎంసీలతో 4.57 లక్షల హెక్టార్లకు సాగునీరు ఇస్తామని అందులో తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపిణీకి గాను బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో భాగంగా తెలంగాణ తన అఫిడవిట్‌ను సమర్పించింది. ఇందులో కొన్ని కీలకాంశాలను పేర్కొంది. తమకు మొత్తంగా 936.58 టీఎంసీల అవసరాన్ని పేర్కొన్న తెలంగాణ ఇందులో గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీళ్లు తిరిగి 80శాతం వివిధ రూపాల్లో బేసిన్లోకే చేరుతున్నందున తమ నీటి వినియోగాన్ని 771.47 టీఎంసీలుగా చూపాలని కోరింది.
ఏడు ప్రాజెక్టులు.. 9.34 లక్షల హెక్టార్లు..
నిర్మాణం పూర్తయినా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయినా కృష్ణా బేసిన్‌లో ఇంకా చాలా ఆయకట్టుకు నీరందలేని పరిస్థితులు ఉన్నాయని, ఈ దృష్ట్యా తమకు నీటి కేటాయింపులు పెంచితే కొత్తగా 9.34 లక్షల హెక్టార్లలో సాగునీటిని ఇచ్చేలా 7 కొత్త ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది. ఖమ్మం జిల్లాలో మున్నేరు ద్వారా 4 టీఎంసీలతో 12,950 హెక్టార్లు, వరంగల్ జిల్లాలో 2 టీఎంసీలతో 5వేల హెక్టార్లు, మున్నేరు నదిపై బ్యారేజీల ద్వారా మరో 5 టీఎంసీలతో 20,235 హెక్టార్లు సాగులోకి వచ్చేలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది.
ఇక కోయిల్‌కొండ–గండేడు ఎత్తిపోతల ద్వారా 50 టీఎంసీలతో 2,28,686 హెక్టార్లు, రేలంపాడు ఎత్తిపోతలతో 10.50 టీఎంసీతో 48 వేల హెక్టార్లు, ఎస్‌ఎల్‌బీసీ విస్తరణతో 35 టీఎంసీలతో 1,61,473 హెక్టార్లు, జూరాల వరద కాల్వతో 100 టీఎంసీల నీటితో 4,57,684 ఎకరాలకు నీరిచ్చేలా తమ భవిష్యత్ ప్రణాళిక ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా 206.50 టీఎంసీల నీటితో 9.34 లక్షల హెక్టార్ల సాగుభూమికి నీటిని అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా నీటి కేటాయింపులు చేయాలని విన్నవించింది. వీటిపై ట్రిబ్యునల్ బుధవారం నుంచి 3 రోజుల పాటు వాదనలు జరగనున్నాయి.
206 టీఎంసీలు అవసరం!
Published Wed, Aug 8 2018 1:58 AM | Last Updated on Wed, Aug 8 2018 1:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment