Krishna River basin
-
‘అప్పర్ భద్ర’తో అనంత ఎడారి!
బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకకు చెందిన ‘అప్పర్ భద్ర’కు నీటి కేటాయింపులు లేకపోయినా, ఆగమేఘాల మీద సాంకేతిక అనుమతులు మంజూరు చేసి, జాతీయ హోదా కల్పించి, నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందువల్ల అనంతపురం జిల్లా కనీసం తాగునీరు కూడా అందకుండా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఎగువ భద్ర ప్రాజెక్టు పూర్తయితే, తుంగభద్ర, శ్రీశైలం డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి ఉండదు. ఇందువల్ల కృష్ణా బేసిన్ ఆయకట్టు పరిస్థితి అటుంచితే... అనంతపురం జిల్లాకు ఏకైక నీటి ఆధారమైన హై లెవెల్ కెనాల్ (హెచ్ఎల్సీ) ఎండిపోయే పరిస్థితి దాపురిస్తుంది. తుంగభద్ర డ్యామ్ పైన 295 టీఎంసీలకు మించి కర్ణాటక నీటిని వాడుకోవడానికి వీలులేదని బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడో చెప్పింది. అయినా 325 టీఎంసీల వరకు వాడుకుంటున్నట్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. అంతేకాకుండా కృష్ణా బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను బేఖాతరు చేసి, తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ... ‘మేం తుంగ, భద్ర, ప్రాజెక్టుల ఆధునికీకరణల వల్ల మిగిలిన నీటిని, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కృష్ణా బేసిన్‌కు వచ్చే 20 టీఎంసీల నీటిని కలుపుకొని వాడుకోవడానికి అప్పర్ భద్రను నిర్మిస్తున్నామ’ని కాకమ్మ–గువ్వమ్మ కథలు చెబుతోంది కర్ణాటక. తెలుగు రాష్ట్రాల కళ్ళు కప్పి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే 40 ఏళ్ల అనుభవజ్ఞుడు, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గుడ్డెద్దుకు గడ్డి వేస్తూ ఏమీ పట్టనట్లు కాలం గడిపేశారు. ఆ పాపం వల్లనే నేడు తుంగభద్ర డ్యామ్‌కు కనీసం నీరు కూడా చేరే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలు రాజకీయాలకతీతంగా అప్పర్ భద్ర నిర్మాణాన్ని అడ్డుకోవడంలో భాగంగా ‘ఛలో అప్పర్ భద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలి. – కె.వి.రమణ; బెస్త కార్పొరేషన్ డైరెక్టర్, అనంతపురం. -
Krishna River: 'కృష్ణా' తులాభారం
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా పారే కృష్ణమ్మ తనతో పాటే అనేక వివాదాలను మోసుకొస్తోంది. ఎడతెగని పంచాయతీలకు కారణమవుతోంది. వీటిని పరిష్కరించేలా ట్రిబ్యునళ్లు తీర్పులిచ్చినా..అంతరాష్ట్ర ఒప్పందాలు జరిగినా.. కేంద్రం మధ్యవర్తిత్వం చేసినా.. వివాదాలు షరా మామూలవుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలు తమ వాటాలకు మించి నీటి వినియోగం చేసేలా ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటే... ఉన్న వాటాల్లో నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తమ వాదనలకు అవకాశం లేక పరీవాహకానికి, ఆయకట్టుకు తగ్గట్లుగా వాటాలు దక్కలేదని తెలంగాణ అంటుంటే.. తమకున్న నీటి వాటాల్లోంచే వినియోగిస్తున్నామని, అంతకుమించి ఒక్క చుక్క నీటిని అదనంగా వినియోగించబోమని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేస్తోంది. విభజన తరువాతైనా నీటి వాటాలను సవరించి కృష్ణా జలాల పునఃపంపిణీ చేయాలని తెలంగాణ కోరుతుంటే.. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ నీటి వాడకంతో తమ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఏపీ అంటోంది. దీనిపై అటు కేంద్రానికి, ఇటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు ఇరు రాష్ట్రాలు లేఖలు రాస్తున్నా పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల విషయంలో ఇరు పక్షాల వాదనలు, వాస్తవాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ తెలిపే ప్రయత్నం చేస్తోంది. – సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి, ఆలమూరు రామగోపాల్ రెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధులు శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి తెలంగాణ శ్రీశైలం పూర్తిగా విద్యుత్ అవసరాల కోసం నిర్మించినదే. 1959లో శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగా చేపట్టగా 1963లో ప్లానింగ్ కమిషన్ దానిని ఆమోదించింది. ► బచావత్ అవార్డు పేజీ నంబర్ 104 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ► విభజన చట్టం 12వ షెడ్యూల్, సెక్షన్ (1) ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లను భౌగోళిక ప్రాంతం ఆధారంగా విభజించింది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 50 శాతం చొప్పున పంచుకోవాలని విభజన చట్టంలో ఎక్కడా లేదు. ► 1990–91 నీటి సంవత్సరం నుంచి 2019 – 20 వరకు ఏప్రిల్, మే నెలల్లో శ్రీశైలం కనీస మట్టం 834 అడుగుల్లో ఏపీ నీటిని నిల్వ ఉంచడం లేదు. పెన్నా బేసిన్ ప్రాజెక్టులకు తరలించేందుకు 854 అడుగుల మట్టాన్ని నిర్వహించాలని ఏపీ కోరడం సమంజసం కాదు. ► 2015 జూన్‌లో నిర్వహించిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ, బోర్డు భేటీల్లో శ్రీశైలం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 50 శాతం చొప్పున తాత్కాలిక పద్ధతిలో పంచుకున్నది కేవలం ఆ వాటర్ ఇయర్‌కు మాత్రమే వర్తిస్తుంది. దీనిని క్లెయిమ్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. ► 2020–21 వాటర్ ఇయర్లో ఏపీ 629.06 టీఎంసీలను కృష్ణా బేసిన్లో వాడింది. ఇంత భారీ ఎత్తున నీటిని తరలిస్తూ తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేయడం ద్వారా తమ తాగునీటి అవసరాలకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తుండటం అసంబధ్దం. ► తెలంగాణ సముద్ర మట్టానికి ఎగువన ఉంది. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదు. లిఫ్టులతో ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా కృష్ణా, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి రెండు పంటలకూ నీరందాలంటే జల విద్యుత్ ఉత్పత్తి కీలకం. అందుకే అన్ని ప్రాజెక్టుల్లోని జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 100 శాతం సామర్థ్యంతో కరెంట్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ► కేంద్ర ప్రణాళిక సంఘం 1963లో శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్ ప్రాజెక్టుగా అనుమతి ఇచ్చింది. కానీ ఆ తర్వాత బహుళార్ధకసాధక ప్రాజెక్టుగా ప్రణాళిక సంఘమే గుర్తించింది. శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ) ద్వారా 19 టీఎంసీలు వాడుకోవడానికి జూలై 4, 1994లో సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. విభజన చట్టం ద్వారా గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు అని తెలంగాణ సర్కార్ పేర్కొనడంలో అర్థం లేదు. ► జూలై 10, 2014న కృష్ణా బోర్డు మొదటి సమావేశంలోనే శ్రీశైలంలో 834 అడుగుల కంటే ఎగువన నీటి నిల్వ ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్టులో జూన్ 1న 808.4 అడుగుల్లో కేవలం 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నప్పటికీ బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ శ్రీశైలంలోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 26.05 టీఎంసీలను వదిలేసింది. ► కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలు లేకున్నా, బోర్డు æ కేటాయింపులు చేయకున్నా అక్రమంగా నీటిని వాడుకుంటూ నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 5.55 టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిశాయి. ► ఉత్పత్తయ్యే విద్యుత్ చెరి సగం పంచుకునేలా 2015–16 సంవత్సరానికి మాత్రమే ఒప్పుకున్నాం. ఇకపై అంగీకరించం. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512.04, తెలంగాణ వాటా 298.96 టీఎంసీలు. ఇదే నిష్ఫత్తిలో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో వాటా ఇవ్వాలి. ఈ ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే జలవిద్యుత్‌లో 66 శాతం వాటా మాకే దక్కుతుంది. జాతీయ జలవిధానం ప్రకారం తొలి ప్రాధాన్యం తాగునీటికే. తరువాత సాగునీటికి ప్రాధాన్యం. చివరి ప్రాధాన్యం జలవిద్యుదుత్పత్తికి అది కూడా సాగునీటి అవసరాలున్నప్పుడే చేపట్టాలి. కనీస నీటిమట్టం దాటకుండానే డెడ్‌స్టోరేజీలోనే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోంది. పెరిగిన జల విద్యుత్తు థర్మల్ విద్యుదుత్పత్తి, సరఫరాను తెలంగాణ ఇటీవల గణనీయంగా తగ్గించింది. ప్రత్యామ్నాయంగా జలవిద్యుత్ ఉత్పత్తి, సరఫరాను భారీగా పెంచింది. తెలంగాణ 9357.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని కలిగి ఉండగా కేవలం 6274 మెగావాట్ల థర్మల్ విద్యుత్ మాత్రమే జూలై 6న రాష్ట్రానికి సరఫరా అయింది. శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జునసాగర్, ఎగువ, దిగువ జూరాల, పులిచింతల తదితర జల విద్యుత్ కేంద్రాలు కలిపి తెలంగాణ జెన్కో మొత్తం 2441.8 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండగా జూలై 9న 751.1 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యంతో పోల్చితే 80 – 85 శాతం విద్యుత్‌ను రాష్ట్రాల డిస్కంలు కొనుగోలు చేయాలని విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు పేర్కొంటాయి. అంతకు మించి తక్కువగా విద్యుత్‌ను కొనుగోలు చేస్తే విద్యుదుత్పత్తి కంపెనీలకు ఫిక్స్డ్ చార్జీలను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. వదులుకున్న విద్యుత్‌కు యూనిట్‌కు రూపాయి వరకు పెనాల్టీలు ఉంటాయి. ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం ఉండగా, కనీసం 80 శాతం అంటే 800 మెగావాట్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంది. గత మంగళవారం కేవలం 97 మెగావాట్లను కొనుగోలు చేసింది. వదులుకున్న 703 మెగావాట్ల(16.8 మిలియన్ యూనిట్లు) విద్యుత్‌కు పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్‌కు రూ.2.75 ఫిక్స్డ్ చార్జీ చొప్పున 16.8 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు పెనాల్టీలు చెల్లించాల్సి రానుంది. బచావత్ కేటాయింపులు కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేంద్రం కేడబ్ల్యూడీటీ–1 ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976 మే 27న తుది తీర్పు ఇచ్చింది. కృష్ణా జలాల పంపిణీకి బచావత్ ‘ఫస్ట్ ఇన్ యూజ్.. ఫస్ట్ ఇన్ రైట్(మొదటి నీటిని వాడుకున్న ప్రాజెక్టులకే ప్రథమ హక్కు)ను మూలసూత్రంగా పాటించింది. కృష్ణా డెల్టాకు 1854 నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తున్నారు. బేసిన్ పరిధిలోని మూడు రాష్ట్రాల్లో 1969 నాటికి పూర్తయిన ప్రాజెక్టుల్లో అత్యంత పురాతనమైనది. దాంతో.. కృష్ణా డెల్టా నుంచే నీటి పంపిణీని ప్రారంభించిన కేడబ్ల్యూడీటీ–1 ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు చివరగా కేటాయింపులు చేసింది. ► కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు.. పునరుత్పత్తి కింద 70 టీఎంసీలు వెరసి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని లెక్కగట్టిన కేడబ్ల్యూడీటీ–1 మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 నాటికి పూర్తయిన, 1976 నాటికి నిర్మాణంలోనూ, ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసింది. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలు, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీలను కేటాయించింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. పునఃపంపిణీ చేసిన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలిన 30 టీఎంసీల్లో బీమా ఎత్తిపోతల పథకానికి 20, పులిచింతలకు 9 టీఎంసీలను కేటాయిస్తూ ఏప్రిల్ 16, 1996న ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేడబ్ల్యూడీటీ–1 పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణతో మిగిలిన ఎనిమిది టీఎంసీలను కలిపి మొత్తం 19 టీఎంసీలను ఎస్సార్బీసీకి కేటాయిస్తూ జూలై 4, 1994లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే కేడబ్ల్యూడీటీ–1 ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం పునఃపంపిణీ ద్వారా రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కాయి. ఆ మేరకు మూడు ప్రాంతాలు కృష్ణా జలాలను వినియోగించుకున్నాయి. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇలా... కృష్ణా జలాల పునఃపంపిణీకి ఏప్రిల్, 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పునే ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేస్తూ 2016 అక్టోబర్ 19న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య అందుబాటులో ఉన్న 163 టీఎంసీల్లో మహారాష్ట్రకు 46, కర్ణాటకకు 68, ఆంధ్రప్రదేశ్‌కు 49 టీఎంసీలను కేటాయించింది. 65 శాతం లభ్యత ఎగువన 285 టీఎంసీల మిగులు జలాల్లో మహారాష్ట్రకు 35, కర్ణాటకకు 105, ఆంధ్రపద్రేశ్‌కు 145 టీఎంసీలను కేటాయించింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే మహారాష్ట్రకు 81, కర్ణాటకకు 173, ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను అదనంగా కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 75 – 65 శాతం మధ్య లభ్యతగా ఉన్న జలాల్లో కేటాయించిన 49 టీఎంసీల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో క్యారీ ఓవర్ కింద 30 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టు(కే–7) ప్రాంతంలో 9, ఆర్డీఎస్ కుడి కాలువకు 4, సహజ ప్రవాహాలు కింద 6 టీఎంసీలు కేటాయించింది. 145 టీఎంసీల మిగులు జలాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో క్యారీ ఓవర్ కింద 120, తెలుగుగంగకు 25 టీఎంసీలను కేటాయించింది. అయితే ఈ తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు నుంచి ఉపసంహరించుకుంది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారిస్తుండటంతో బ్రిజేశ్ తీర్పును కేంద్రం ఇప్పటిదాకా నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ బచావత్ తీర్పే అమల్లో ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు వీలుగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగించడంతో గత ఐదేళ్లుగా కసరత్తు చేస్తోంది. కేంద్రం తాత్కాలిక సర్దుబాటు.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయని నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా బచావత్ చేసిన కేటాయింపులను పరిగణలోకి తీసుకుని జూన్ 19, 2015న ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై కేంద్ర జలవనరుల శాఖ నాటి అదనపు కార్యదర్శి అమర్జీత్సింగ్ సమక్షంలో ఏపీ జలవనరుల శాఖ నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంతకాలు చేశారు. తాత్కాలిక సర్దుబాటును కృష్ణా బోర్డు తీర్మానం మేరకు ఏటా పొడిగిస్తున్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ అదనంగా కేటాయించిన జలాలు కేడబ్ల్యూడీటీ–1 చేసిన కేటాయింపులు 811 టీఎంసీలకు అదనంగా 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. ఇందులో తెలుగుగంగకు 25, జూరాలకు 9, ఆర్డీఎస్ కుడి కాలువకు నాలుగు.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో క్యారీ ఓవర్ స్టోరేజీ కింద 150 టీఎంసీలు, పర్యావరణ ప్రవాహాలు కింద 6 టీఎంసీలు కేటాయించింది. విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం ప్రకటించిన ఆరు ప్రాజెక్టులకు అవసరమైన జలాలు టీఎంసీల్లో కృష్ణా జలాల్లో వాటా తెలంగాణ కృష్ణా జలాల్లో మాకున్న 299 టీఎంసీల వాటా మరింత పెరగాలి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సరిదిద్దాలి. ఇందులో భాగంగానే కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ట్రిబ్యునల్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి తెలంగాణకు నీటి హక్కులు దక్కేలా చూడాలి. ►కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరీవాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. ►పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా తెలంగాణకు కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాలి. ►ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలోగా ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానాన్ని పక్కనపెట్టి ఇకపై ఉమ్మడి రాష్ట్రానికి చేసిన వాటాల్లోంచి సగం వాటా నీటిని వినియోగించుకుంటాం. ►ఏపీ, తెలంగాణ మధ్య ఇప్పటివరకు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలి. ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956 సెక్షన్ 6(2) ప్రకారం నదీ జలాలను పంపిణీ చేస్తూ ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సమానం. దాన్ని పునఃసమీక్షించడానికి అవకాశం లేదని చట్టం చెబుతోంది. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసిన 2,130 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లకపోవడానికి ఇదే కారణం. మొత్తంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిన బచావత్ మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను కొనసాగిస్తూనే బ్రిజేశ్ ట్రిబ్యునల్ అదనంగా 448 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ కేటాయించిన 194 టీఎంసీలను మాత్రమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. బ్రిజే‹శ్ ట్రిబ్యునలే తెలుగుగంగకు 25, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు కేటాయించింది. మిగిలిన 165 టీఎంసీల్లో.. విభజన చట్టం ప్రకారం ఏపీకి చెందిన హంద్రీ–నీవాకు 40, గాలేరు–నగరికి 38, వెలిగొండకు 43.5 టీఎంసీలు దక్కుతాయి. తెలంగాణకు చెందిన నెట్టెంపాడుకు 22, కల్వకుర్తికి 25 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేసినా ఆంధ్రప్రదేశ్ వాటా 512.04 టీఎంసీల నుంచి 662.54 టీఎంసీలకు పెరుగుతుందే తప్ప తగ్గదు. పోతిరెడ్డిపాడుపై.. తెలంగాణ పోతిరెడ్డిపాడును ఏమాత్రం గుర్తించం. చెన్నైకి తాగునీటినందించేందుకు బచావత్ అవార్డులో 15 టీఎంసీలను కేటాయించగా ఏనాడూ అంతమేరకు అందించలేదు. శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ)కు 19 టీఎంసీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పునఃకేటాయింపులు చేసింది. వీటిని కూడా జూలై–అక్టోబర్ వరకే తరలించాల్సి ఉంది. రెండింటికి కలిపి 34 టీఎంసీలను తరలించాల్సి ఉండగా వందల టీఎంసీలను తరలిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో లైనింగ్ చేయని కాలువను నిర్మించి రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు కృష్ణాజలాల్ని తరలించారు. దీనిపై ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఉమ్మడి ఏపీ పాలకులు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. దీనికి అదనంగా కరెంటు ఉత్పత్తి ద్వారా దిగువకు 5 వేల క్యూసెక్కుల జలాలను విడుదలచేసే పవర్ ఛానెల్ కూడా చేపట్టారు. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు 1500 క్యూసెక్కుల లైనింగ్ కాలువను నిర్మించాల్సి ఉండగా.. 60,500 క్యూసెక్కులు (11,500+44,000+5000) లైనింగ్ చేయని కాలువను నిర్మించారు. ఇది అక్రమం. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో 881 అడుగుల కంటే ఎగువన నీటి మట్టం ఉంటేనే ప్రస్తుత డిజైన్ మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. కృష్ణా బేసిన్లో అతివృష్టి, అనావృష్టి వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. దీనివల్ల శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. వరద వచ్చినప్పుడు ఒకేసారి భారీ స్థాయిలో వస్తోంది. వరదను ఒడిసి పట్టేలా కాలువల సామర్థ్యం లేకపోవడంలో వందలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. వరద నీటిని ఒడిసి పట్టి చట్టబద్ధంగా నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులను 35 నుంచి 40 రోజుల్లో నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాలువలను విస్తరించే పనులు చేపట్టాం. సముద్రంలో కలిసే వరద జలాలను మళ్లించి కరువు ప్రాంతాన్ని సుభిక్షం చేయడం తప్పుకాదు. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి, తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిందే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఎస్సార్బీసీకి, తెలుగుగంగకు కేంద్ర జలసంఘం అనుమతి ఉంది. ఎస్సార్బీసీకి బచావత్, తెలుగుగంగకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ కింద నీటి కేటాయింపులు ఉన్నాయి. గాలేరు–నగరిని విభజన చట్టం ద్వారా కేంద్రం అధికారికంగా గుర్తించింది. ఈ ప్రాజెక్టుల ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని సరఫరా చేస్తాం. అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను గుర్తించబోమని తెలంగాణ సర్కార్ ప్రకటించడంలో అర్థం లేదు. బేసిన్లలో నీటి వినియోగం తెలంగాణ సహజ న్యాయ సూత్రాల ప్రకారం బేసిన్ తాగు, సాగు అవసరాలు తీరాకే నీటిని ఇతర బేసిన్‌కు తరలించాలని స్పష్టంగా ఉన్నా ఏపీ మాత్రం కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు తరలిస్తోంది. 367 టీఎంసీలను పెన్నా, ఇతర బేసిన్లకు తరలిస్తున్నారు. ►శ్రీశైలం నుంచి తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలిగొండ ద్వారా ఇతర బేసిన్లకు నీటిని తరలిస్తున్నారు. ►1977 అక్టోబర్ 28న కుదిరిన ఒప్పందం ప్రకారం చెన్నై తాగునీటి సరఫరాకుగాను 15 టీఎంసీలను తరలించేందుకు 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న లైనింగ్ కాలువ నిర్మించాలి. ఈ కాల్వ ద్వారా కేవలం చెన్నై తాగునీటికే నీటిని సరఫరాచేయాలి. కానీ ఒప్పందానికి విరుద్ధంగా 11,150 క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించారు. అనంతరం 55,150 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. ఈ విషయాన్ని బ్రిజేశ్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లలేదు. ►ఒప్పందం ప్రకారం 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండాల్సిన ఈ కాల్వ ద్వారా ఏకంగా రోజుకు ఎనిమిది టీఎంసీల నీళ్లు ఇతర బేసిన్లకు తరలిపోతాయి. ఇక పెన్నా బేసిన్లో నిల్వ కోసం 185 టీఎంసీలతో రిజర్వాయర్లు కట్టారు. ఇందులో వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 16.950 టీఎంసీలు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్ సామర్థ్యం 17.735 టీఎంసీలు, సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 77.988 టీఎంసీలు, కండలేరు సామర్థ్యం 68 టీఎంసీలు, కడపజిల్లా కోసమని మైదుకూరు, దువ్వూరు మండలాల్లో 4.577 టీఎంసీల సామర్థ్యంతో ఉప రిజర్వాయర్లు (ఎస్ఆర్–1, 2)నిర్మించారు. ఇందులో కండలేరు మినహా మిగిలిన రిజర్వాయర్లన్నీ పెన్నా బేసిన్‌లోనివే. ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేస్తూ 1863లో జలరవాణా కోసం డచ్ సంస్థ కేసీ(కర్నూల్–కడప) కెనాల్‌ను తవ్వింది. సర్ ఆర్ధర్ కాటన్ నివేదిక ఆధారంగా కేసీ కెనాల్‌ను 1933లో నీటిపారుదల ప్రాజెక్టుగా బ్రిటీష్ సర్కార్ మార్చింది. ఈ కెనాల్ కింద 2,65,628 ఎకరాలకు నీళ్లందించడానికి బచావత్ 39.90 టీఎంసీలను కేటాయించింది. ఫిబ్రవరి 15, 1976న జరిగిన ఒప్పందం మేరకు తెలుగుగంగ చేపట్టాం. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 25 టీఎంసీలు కేటాయించింది. విభజన చట్టం ద్వారా గాలేరు–నగరిని కేంద్రం అధికారిక ప్రాజెక్టుగా గుర్తించింది. కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు మళ్లించడం అక్రమమని తెలంగాణ సర్కార్ ఆరోపించడంలో అర్థం లేదు. ►తెలంగాణ సీఎం కేసీఆరే ‘బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. నదీ జలాలను మళ్లించి రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తాం.. దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి సహకరిస్తాం’ అని ప్రకటించారు. ►నదుల అనుసంధానంతో సముద్రం పాలవుతోన్న జలాలను మళ్లించి దుర్భిక్షాన్ని తరిమికొట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 27, 2012న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు కేంద్రం అనుసంధానాన్ని చేపట్టింది. ఈ అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్రానికి పూర్వమే చేపట్టిన కేసీ కెనాల్.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేపట్టిన తెలుగగంగే స్ఫూర్తి అని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పేర్కొంది. ప్రాజెక్టులపై.. తెలంగాణ కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో పాలనా అనుమతులు జారీ చేయడం అసమంజసం. ఈ ప్రాజెక్టును ఒప్పుకోం. ఈ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేవు, కేంద్ర జల సంఘం అనుమతులు సైతం లేవు. గతంలో కేంద్ర జల సంఘం ద్వారా నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు ఈఏసీ పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు. ►గ్రీన్ ట్రిబ్యునల్ సైతం నిర్మాణ పనులు కొనసాగించవద్దని చెప్పినా వినడం లేదు. ఇది కోర్టు ధిక్కరణే. ►బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకుండానే ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులను ఏపీ చేపడుతోంది. ఇది విభజన చట్టానికి విరుధ్దం. ►పాలమూరు ఎత్తిపోతలపై సమగ్ర అధ్యయన నివేదిక కోసం 2013 ఆగస్టు 8న జీవో 72 ఇచ్చారు. 2014 ఏప్రిల్ 22న అప్పటి ప్రధాని సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టును రీ డిజైన్ చేశాం. ఇది పాత ప్రాజెక్టే. ►డిండి ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. 2010 డిసెంబర్ 10న ప్రధాని కార్యాలయం సైతం డిండిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకొనేందుకు ప్రతిపాదన కోరింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని రీ డిజైన్ చేశాం. ►తుమ్మిళ్ల ఎత్తిపోతలను సైతం తుంగభద్రలో మా వాటాను వినియోగించుకునేలా చేపట్టాం. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువలను అక్రమ ప్రాజెక్టులగా అభివర్ణించడం, పనులను ఆపాలని తెలంగాణ సర్కార్ కోరడం అర్థరహితం. ►తెలుగుగంగ, ఎస్సార్బీసీ, తెలుగగంగ, కేసీ కెనాల్ శ్రీశైలం కుడి గట్టు కాలువలకు 111 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. మాకు దక్కిన 512 టీఎంసీలను సమర్థంగా వినియోగించుకుని ఆయకట్టును స్థిరీకరణకే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. ►శ్రీశైలంలో 796 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 4 టీఎంసీలు.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి ద్వారా 2.4 టీఎంసీలు, 825 అడుగుల నుంచి సామర్థ్యం పెంచిన ఎస్సెల్బీసీ ద్వారా 0.5 చొప్పున 2.9 వెరసి.. 6.9 టీఎంసీలను తరలించడం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కులు తరలించడానికి అవకాశం ఉంటుంది. 854 అడుగులోల నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువల నుంచి 7 వేలు క్యూసెక్కులు తీసుకెళ్లవచ్చు. 848 అడుగులకు నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలకు నీళ్లు చేరవు. ►శ్రీశైలం నుంచి తెలంగాణ సర్కార్ ఎడాపెడా తోడేస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందడం లేదు. నీటి కేటాయింపులు ఉన్న ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడానికి, చెన్నైకి తాగునీటిని అందించడానికే సీమ ఎత్తిపోతల చేపట్టాం. ఆర్డీఎస్ కుడి కాలువకు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికే కుడి కాలువ పనులు చేపట్టాం. ►కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, భక్తరామదాస ఎత్తిపోతల, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్సెల్బీసీసహా 24 ప్రాజెక్టులను తక్షణమే నిలిపేయాలి. నీటి కేటాయింపులపై తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా బేసిన్లో 68.5 శాతం పరీవాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 36.9 శాతమే ఉన్నాయి. అదే ఏపీకి 31.5శాతం పరీవాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 367 టీఎంసీలు ఏపీ బేసిన్ బయటే వాడుకుంటోంది. కృష్ణా పరీవాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణకు 37.11 లక్షల హెక్టార్లు ఉండగా ఏపీకి కేవలం 16.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. అయినా ఏపీకి కేటాయింపులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జనాభా పరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2 కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో కేవలం 78.29 లక్షలు(28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్నా తెలంగాణకు కేటాయింపులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ పరీవాహక ప్రాంతం ఆధారంగా నదీ జలాలను ట్రిబ్యునల్ పంపిణీ చేయదు. ఒప్పందాలు, వినియోగం ఆధారంగా నీటి కేటాయింపులు చేస్తుంది. ట్రిబ్యునల్ ఏర్పాటయ్యేనాటికి పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకు లభ్యత ఆధారంగా కేటాయింపులు చేస్తుంది. బచావత్ ఏర్పాటయ్యేనాటికి అంటే 1969 నాటికే ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలవినియోగం ఉండేది. దాంతో ఆ ప్రాజెక్టులకు బచావత్ నీటి కేటాయింపులు చేసింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలు కేటాయించింది. ఎక్కడా పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ పరీవాహక ప్రాంతాన్నే పరిగణనలోకి తీసుకుంటే అత్యధిక పరీవాహక ప్రాంతం ఉన్న కర్ణాటకకు 734 కేటాయించి.. తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను కేటాయించేది కాదు. మళ్లింపు జలాల్లో వాటా తెలంగాణ 1976 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణాలో నీటి హక్కులు సంక్రమిస్తాయి. కృష్ణా నీటిలో దక్కే 80 టీఎంసీలకుగానూ 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే. బచావత్ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అంటే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి పట్టిసీమ ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈ లెక్కన మొత్తంగా తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, నాగార్జునసాగర్‌కు ఎగువన ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీలను అదనంగా వినియోగించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఇందులో 45 టీఎంసీలు తమకే దక్కుతాయని తెలంగాణ సర్కార్ వాదిస్తుండటం అన్యాయం. నాగార్జునసాగర్‌కు ఎగువన ఆంధ్రపదేశ్‌కు కూడా ఆ జలాలు దక్కుతాయన్న వాస్తవం తెలుసుకోవాలి. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6.43, ఎస్సారెస్పీ ద్వారా మున్నేరు, మూసీ సబ్ బేసిన్లకు 68.40, దేవాదుల ద్వారా 24.650, కాళేశ్వరం ద్వారా 83.190, వరద కాలువ ద్వారా 28.395 వెరసి 211.45 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తోంది. ఈ జలాలకుగానూ కృష్ణా జలాల్లో 211.45 టీఎంసీలను ఏపీకి అదనపు వాటాగా ఇవ్వాలి. తాగునీటిలో 20 శాతం మాత్రమే లెక్క తెలంగాణ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే వినియోగ కోటా కింద పరిగణించాలని 2016లో కృష్ణా బోర్డును కోరాం. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోంది. తాగునీటి కోసం కేటాయించిన మొత్తం జలాల్లో 80 శాతం తిరిగి నదిలోకే వస్తాయి. తాగునీటి కేటాయింపులను కేవలం 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ సైతం తేల్చిచెప్పింది. దీని ప్రకారం కృష్ణా జలాల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించిన 16 టీఎంసీల్లో కేవలం 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. తాగునీటి కోసం తరలించే జలాల్లో 20 శాతం తాగునీటికి వెళ్తాయి. మిగిలిన 80 శాతం నీరు మురుగునీటి కాలువల ద్వారా తెలంగాణలోని చెరువులు, చిన్నతరహా ప్రాజెక్టులకే చేరుతాయి. ఆ నీటితో తెలంగాణలో పంటలు కూడా పండించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు తాగునీటి కోసం తరలించే కృష్ణా జలాల్లో 20 శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదన ఏమాత్రం సబబు కాదు. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తెలంగాణ కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నాలకు మేం వ్యతిరేకం. ఇప్పటికి జరిగిన రెండు అపెక్స్ కౌన్సిల్ భేటీల్లోనూ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్¯ 85(1) ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక... కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలి. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగాకే నియంత్రణపై ముందుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ బ్రిజేశ్ తీర్పును కేంద్రం నోటిఫై చేసేదాకా కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ వాదించడం అసంబద్ధం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా జలాలను బచావత్ కేటాయించింది. కేంద్రం తక్షణమే బోర్డు పరిధిని నోటిఫై చేయాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డు పరిధిలోకి తెచ్చి వాటిపై ఆధారపడిన సాగు, తాగునీటి ప్రాజెక్టులతోపాటూ విద్యుత్కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తెచ్చి రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలి. ఇతర బేసిన్లకు కుదరదు.. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని బచావత్ చెప్పింది. విద్యుత్ అవసరాలకు మినహా వేరే అవసరాలకు ఒక్క బొట్టు కూడా వాడొద్దు అని చెప్పింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ కూడా ఇదే చెప్పింది. విద్యుదుత్పత్తిని ప్రాజెక్టుల్లోని ఏ మట్టం నుంచైనా చేపట్టవచ్చు. తెలంగాణ అవసరాలు పట్టించుకోకుండా పక్క బేసిన్లకు నీటిని తరలిస్తామంటే కుదరదు. – రంగారెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కొత్తగా కోరడం లేదు కృష్ణా జలాల్లో నీటి వాటాలు పెంచాలని కొత్తగా అడగడం లేదు. బేసిన్ అవసరాలు తీరాక వరద జలాలు తరలించుకుంటే ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. పోలవరానికి సీడబ్ల్యూసీ అధికారిక అనుమతి వచ్చిన వెంటనే సాగర్ ఎగువన ఉన్న తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలి’ – శ్యాం ప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కేటాయింపులు పెరగాల్సిందే కృష్ణా జలాల్లో తెలంగాణకు మొదటినుంచీ అన్యాయం జరిగింది. కేవలం 13శాతం పరీవాహకం ఉన్న ఆంధ్రా ప్రాంతం 45శాతం నీటిని అంటే 367 టీఎంసీలను వినియోగిస్తోంది. నిజానికి ఆంధ్రా ప్రాంతానికి ఉన్న అర్హత 106 టీఎంసీలు మాత్రమే. గతం నుంచి నీటిని అనుభవిస్తున్నామని సాకుగా చెబుతూ దానిని హక్కుగా చూపరాదు. – దొంతు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ పునఃపంపిణీ చట్టవిరుద్ధం ట్రిబ్యునల్ ఒక్క సారి నదీ జలాలను పంపిణీ చేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత పునఃసమీక్షించడానికి వీల్లేదు. కృష్ణాలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ కేటాయించిన 2130 టీఎంసీలను బ్రిజేశ్ ట్రిబ్యునల్ పునఃపంపిణీ చేయకపోవడానికి కారణమదే. సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ కోరడం చట్టవిరుద్ధం. – డి.రామకృష్ణ, రిటైర్డు సీఈ సాగునీటి అవసరాలకే.. ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీశైలం, సాగర్, పులిచింతల నిర్వహణ ప్రోటోకాల్స్ రూపొందించారు. శ్రీశైలంలో మట్టం 834 అడుగులు దాటాకే సాగర్, కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలి. 2014 నుంచి నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటి నుంచే కృష్ణా బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ఖాళీ చేస్తోంది. – ఎం.వెంకటేశ్వరరావు, రిటైర్డు ఈఎన్సీ రాయలసీమ ఎత్తిపోతలే శరణ్యం శ్రీశైలంలో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలు, అక్రమంగా చేపట్టిన పాలమూరు, డిండి, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ ద్వారా 800 అడుగుల నుంచే రోజుకు 2.9 టీఎంసీల చొప్పున మొత్తం 6.9 టీఎంసీలు తరలిస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. దీన్ని అధిగమించాలంటే 800 అడుగుల నుంచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువకు ఎత్తిపోయడం మినహా మార్గం లేదు. – నారాయణరెడ్డి, ఈఎన్సీ -
వరదే.. వరమయ్యింది
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లో పదేళ్ల అనం తరం విస్తారంగా కురిసిన వర్షాలతో పోటెత్తిన వరదలు రాష్ట్రానికి కొత్త ఊపిరిలూదాయి. ఆగస్టు తొలివారం నుంచి విరామం లేకుండా కొనసాగిన వరదలు ప్రాజెక్టుల కింది తాగు, సాగు అవసరాలకు వరంగా మారాయి. బేసిన్లో కురుస్తున్న వర్షాలతో పెరిగిన ప్రవాహాల మాదిరే, రాష్ట్ర వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఆగస్టు నుంచి మూడు నెలల వ్యవధిలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద 100 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 340 టీఎంసీల లభ్యత జలాలుండగా, ప్రాజెక్టుల్లో స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుం డటం రాష్ట్రానికి వరంగా మారింది. ‘పాలమూరు’కు ప్రాణం.. జూరాల, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు ఆగస్టు నుంచి ఉధృతంగా కొనసాగుతూ వచ్చాయి. 2009– 10 తర్వాత ఆ స్థాయిలో వరదలు కొనసాగడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు 6 సార్లు, సాగర్ గేట్లు 7 సార్లు ఎత్తాల్సి వచ్చింది. ఇప్పటివరకు జూరాలకు 1,348 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 1,650 టీఎంసీలు రాగా, సాగర్‌కు 1,145 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో తెలంగాణలో 100 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. గత కొన్నేళ్లతో పోలిస్తే గరిష్ట నీటి వినియో గం జరిగింది. పాలమూరు జిల్లాలో జూరాలపై ఆధారపడ్డ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమాలతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద గతంలో ఎన్నడూలేని రీతిలో 53 టీఎంసీల మేర నీటి విని యోగం జరిగింది. నెట్టెంపాడు కిందే 16 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. వీటి ద్వారా 952 చెరువులను నింపారు. గతేడాది ఇదే సమయానికి ఈ పథకాలు, జూరాల కింద వినియోగం 20 టీఎంసీలను దాటలేదు. గత ఏడాదంతా కలిపి అన్ని ప్రాజెక్టుల కింద వినియోగం 75 టీఎంసీలు మాత్రమే ఉంది. ప్రస్తుతం జూరాలకు 1.38 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండటంతో దానిపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాలకు నీటి వినియోగం జరుగుతూనే ఉంది. మరో పది రోజులపాటు వరద ఇదే రీతిన కొనసాగే అవకాశాల నేపథ్యంలో మరిన్ని చెరువులు నింపనున్నారు. సాగర్ ఎడమ కాల్వ కింద తాగు, సాగునీటి అవసరాలకు ఇప్పటికే 24 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఏఎంఆర్పీ కింద 13 టీఎంసీలు, జలమండలి కింది 7 టీఎంసీల మేర వినియోగం జరిగింది. కనీస నీటి మట్టం 834 అడుగుల కు ఎగువన శ్రీశైలంలో 160 టీఎంసీలు, సాగర్‌లో 510 అడుగులకు పైన 180 టీఎంసీలు కలిపి 340 టీఎంసీల లభ్యత ఉంది. ఈ వినియోగం వచ్చే ఏడాది జూన్ వరకు జరిగినా, గతేడాది మొత్తం జరిగిన వినియోగం 207 టీఎంసీల మార్కును దాటనుంది. బాబ్లీ గేట్ల మూసివేత బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 14 గేట్లను మూసి వేశారు. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో మంగళవారం ఎస్సారెస్పీ వరద గేట్లను మూసి వేశారు. -
శ్రీశైలానికి గో‘దారి’..!
సాక్షి, హైదరాబాద్: ఏటా వృథాగా సము ద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రణాళికలో మరో కీలక ముందడుగు పడనుంది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహకానికి సాగు, తాగు నీటిని అందించేలా గోదావరి నీటిని తరలించే బృహత్తర కార్యాచరణ రూపుదిద్దుకోనుంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుక్రవారం జరగునుంది. గోదావరి వరద నీటికి అడ్డుకట్ట వేసి వాటిని శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించి సంయుక్తంగా ఈ నీటిని సద్వినియోగం చేసుకునే అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ వేదికగా కీలక చర్చలు జరుపనున్నారు. ఈ భేటీ అంశాలకు అనుగుణంగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్లు వివిధ ప్రతిపాదనలు, నివేదికలను సిధ్దం చేశారు. కృష్ణా అవసరాలకు గోదావరే దిక్కు! తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరే ప్రధాన నీటి వనరుగా ఉంది. గోదావరి నదీ జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి 1,486 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా ఇందులో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. అయితే ఇందులో ఇప్పటికే శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉండగా, మరో 520 టీఎంసీల నీటి వినియోగానికి వీలుగా తెలంగాణ వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. అయినప్పటికీ ఏటా వేల టీఎంసీల్లో నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. 1990 నుంచి సముద్రంలో కలిసిన గోదావరి జలాలను పరిశీలిస్తే.. 1990లో ఏకంగా 7,094 టీఎంసీల నీరు ఒక్క ఏడాదిలో సముద్రంలోకి వెళ్లింది. గడిచిన పదేళ్లలో చూసినా.. 2010–11లో 4,053 టీఎంసీలు, 2013–14లో 5,827 టీఎంసీలు, గతేడాది 2,446 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. సరాసరిన ఏటా 3,500 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఇక కృష్ణా బేసిన్లో నీటి ప్రవాహాలు క్రమంగా తగ్గుతున్నాయి. 1990–91 ఏడాదిలో 1,046 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లగా, 2014–15లో 73టీఎంసీలు, 2015–16లో 9టీఎంసీలు, 2016–17లో 55టీఎంసీలు, 2017–18లో సున్నా, గతేడాది 39టీఎంసీల నీరు మాత్రమే వృథాగా వెళ్లింది. ఎగువన ప్రాజెక్టులతోనే సమస్య గోదావరి, కృష్ణ నదుల ప్రవాహంలో మనకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు విచ్చలవిడిగా ప్రాజెక్టులు చేపట్టడం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం కారణంగా దిగువకు నీటి ప్రవాహాలే కరువయ్యాయి. ఒకవేళ కృష్ణకు వరదలు వచ్చినా ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర వంటి ప్రాజెక్టులు నిండి దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లకు నీరు రావాలంటే ఆగస్టు, సెప్టెంబర్ పడుతోంది. అప్పటికే ఖరీఫ్ కాలం గడిచిపోతుండటంతో నీటికష్టాలు తప్పడం లేదు. దీంతో తమకున్న వాటాను ఏపీ (511 టీఎంసీలు), తెలంగాణ (299టీఎంసీలు) వాడుకునే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. ఈ దిశగానే గోదావరి నీటిని శ్రీశైలం, సాగర్లకు తరలించే ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల వద్ద ఈ తరలింపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిధ్దంగా ఉన్నాయి. తుపాకులగూడెం–సాగర్, ఇచ్చంపల్లి–సాగర్, అకినేపల్లి–సాగర్, దుమ్ముగూడెం–సాగర్ టెయిల్‌పాండ్ వంటి ప్రతిపాదనలు ఉండగా, ఇప్పుడు పోలవరం నుంచి శ్రీశైలానికి నీటిని తరలించే అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఈ అన్ని ప్రతిపాదనలపై సీఎంల భేటీలో చర్చించనున్నారు. ఈ ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించాక కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎస్ వద్ద ముందస్తు చర్చలు కాగా.. శుక్రవారం నాటి సీఎంల భేటీలో చర్చకు వచ్చే అంశాలు, వాటికి సంబంధించిన వివరణలపై తెలంగాణ అధికారులు, ఇంజనీర్లు గురువారం ముందస్తు కసరత్తు భేటీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో ఈఎన్సీ మురళీధర్, అంతరాష్ట్ర జల విభాగపు సీఈ నరసింహారావు, హైడ్రాలజీ సీఈ శంకర్ నాయక్‌లు సమావేశమై.. గోదావరిలో జలాల లభ్యత, ఇంద్రావతి, ప్రాణహిత, శబరి నదుల్లో నీటి ప్రవాహాలు, లభ్యత, వాటి కింద వినియోగం, సముద్రంలో కలుస్తున్న నీరు, వీటిపై ఇరు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, నిల్వ చేసేలా నిర్మించిన రిజర్వాయర్లు వంటి అంశాలపై అందులో చర్చించారు. గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ ఇచ్చిన ఇచ్ఛంపల్లి–సాగర్, ఇచ్చంపల్లి–పులిచింతల అనుసంధానంతోపాటు, అకినేపల్లి మీదుగా సాగర్‌కు గోదావరి జలాలను తరలించేలా సిద్ధంచేసిన ప్రతిపాదనలపైనా చర్చ జరిగినట్లుగా తెలిసింది. పోలవరం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశాలు, గతంలో వచ్చిన ప్రతిపాదనలపైనా అధ్యయనం చేశారు. ఇక ఏపీ జల వనరుల వ్యవహారాల ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సైతం సీఎస్ జోషితో సమావేశమై అజెండా అంశాలపై చర్చించారు. -
అభివృద్ధి మంత్రం.. ఎన్నికల కుతంత్రం..
సాక్షి, అమరావతి బ్యూరో: సాగర్ కుడికాలువలో పుష్కలంగా నీరుంది. ఆరుతడి పంటలకే కాదు మాగాణికి కూడా నీరిస్తాం. వరి సాగు చేసుకోండి. ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం. ఇదీ సెప్టెంబర్ 27న నాగార్జున సాగర్‌లో జలహారతి సభలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ. కట్ చేస్తే.. సీఎం హామీని నమ్మిన రైతులు మెట్ట పంటలు పీకేసి మాగాణి సాగు చేపట్టారు. నీరిస్తామన్న చంద్రబాబు.. హామీని గాలికొదిలేశారు. అధికారులు వారబందీ అంటూ నీటి విడుదలకు వంతులు వేశారు. ఎదగాల్సిన మొక్కలు నీరందక వాలిపోతుంటే గుండె బరువెక్కిన రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు నకరికల్లు వద్ద పెన్నా–గోదావరి నదుల అనుసంధానానికి సీఎం చంద్రబాబు వస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ఎన్నికల ముందు కొబ్బరికాయ కొడుతున్నారు. మాగాణి పంటలకే నీరివ్వలేని బాబు.. ఈ ఎత్తిపోతల.. ఉత్తికోతలేనని రైతులు మండిపడుతున్నారు. ఈ అభివృద్ధి మంత్రమంతా.. ఎన్నికల కుతంత్రమేనని స్పష్టం చేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడికాలువ రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉంది. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపంతో నీరు పుష్కలంగా ఉన్నా, మాగాణి పంటలు సాగవ్వలేదు. ఈ ఏడాది జలహారతి కార్యక్రమంలో భాగంగా ఏ పంటలు సాగు చేసుకున్నా నీరు ఇస్తామని సీఎం నారా చంద్రబాబు ప్రకటించారు. సీఎం మాటలు నమ్మిన రైతులు సాగు చేసిన కంది, పత్తి పంటలను దున్ని మాగాణి వేశారు. తీరా పంటలు సాగు చేశాక నీటి లభ్యత లేదని వారబందీ విధానం ప్రవేశ పెట్టారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. పంటలు కాపాడుకునేందుకు అన్నదాతలు కాలువల వెంబడి నిద్రాహారాలు మాని ఆయిల్ ఇంజన్లతో నానా తంటాలు పడుతున్నారు. సీఎం మాటలు నమ్మి పూర్తిగా మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల.. ఉత్తికోతలే.. గోదావరి అనుసంధానంలో భాగంగా నకరికల్లు వద్ద రూ.6200 కోట్ల అంచనాలతో ఎత్తిపోతల పథకానికి సీఎం సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పంటలకు నీళ్లిస్తామని ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి.. ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాగర్ కుడికాలువలో నీరున్నా పంటలకు అందించడం చేతగాని ప్రభుత్వం.. ఎన్నికల వేళ శంకుస్థాపన చేస్తున్న ఈ ప్రాజెక్టు గాలిలో దీపమేనని ఎద్దేవా చేస్తున్నారు. పంటలకు సాగు నీటి విషయమై ముఖ్యమంత్రిని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకీ దుస్థితి... నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో సాగు, తాగునీటి అవసరాల కోసం 136 టీఎంసీల నీరు అవసరమని కృష్ణా నది యజమాన్య బోర్డుకు అధికారులు నివేదించారు. అయితే కృష్ణా బోర్డు మాత్రం కేవలం 91 టీఎంసీల నీటిని కేటాయింంచింది. ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుపై ఒత్తిడితెచ్చి, అవసరమైన నీటి కేటాయింపులు సాధించుకోవడంలో విఫలమైంది. గత ఏడాది మాగాణి పంటలకు నీరు ఇవ్వకపోయినా 89 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించటం గమనార్హం. ఈ ఏడాది మాగాణి పంటలకు నీరిస్తామని చెప్పినప్పటికీ కేటాయింపుల్లో గత ఏడాదితో పోల్చితే అదనంగా కేవలం 2 టీఎంసీలు మాత్రమే ఇచ్చారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలో కాలువలకు నీరు అవసరం లేకున్నా పుష్కలంగా విడుదల చేశారు. కేటాయించిన వాటాలో నీటి వాటా కరిగిపోవటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి వినియోగంపై కోత విధించారు. ప్రస్తుతం వారబందీ విధానంలో పంట పొలాలకు నీరిస్తున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు కేటాయించిన నీటిలో ఇప్పటి వరకు సాగు, తాగునీటి అవసరాల వినియోగానికిపోను కేవలం 17 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న మెట్ట, మాగాణి పంటలను కాపాడుకోవాలంటే మార్చి వరకు నీరివ్వాలి. 17 టీఎంసీల నీరు డిసెంబర్ 20వ తేదీ వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పంటలు గట్టెక్కాలంటే అదనంగా 40 టీఎంసీలు కావాలి. దీని గురించి పట్టించుకోని ప్రభుత్వం..తాజాగా వేల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం ప్రారంభించడం రైతులపై కపట ప్రేమేనని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి ఎండుతున్న పంటలు చివరి ఆయకట్టు ప్రాంతాలైన వినుకొండ, తాడికొండ, పెదకూరపాడు, చిలకలూరిపేట, ప్రత్తిపాడు నియోజక వర్గాల్లో మాగాణి, మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం అక్టోబరు 25వ తేదీ నుంచి కొత్తగా పంటలు సాగు చేయొద్దని ప్రకటించింది. నవంబరు ఒకటో తేదీ నుంచి వారబందీ విధానాన్ని ప్రవేశ పెట్టింది. తొమ్మిది రోజులపాటు పూర్తిగా (9000ల క్యూసెక్కులు) నీరు కాలువలకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ప్రకారం తొమ్మిది రోజుల్లో అయకట్టుకు నీరు అందివ్వలేకపోతున్నారు. దీంతో పంటతలకు నీరందక జీవం కోల్పోతున్నాయి. -
206 టీఎంసీలు అవసరం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్లో లభ్యత జలాల కేటాయింపులు మళ్లీ చేపట్టాలని, పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా తెలంగాణకు కోటా పెంచాలని విన్నవిస్తూ వస్తున్న తెలంగాణ.. ప్రస్తుతం మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగు అవసరాలు, పారిశ్రామిక అవసరాలు కలిపి రాష్ట్రానికి మొత్తం గా 936.58 టీఎంసీలు అవసరమని పేర్కొన్న తెలంగాణ.. అందులో 206 టీఎంసీలు తాము భవిష్యత్తులో చేపట్టాలని భావిస్తున్న కొత్త ప్రాజెక్టులకు అవసరమని ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. వీటి ద్వారా కొత్తగా 23,37,570 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రణాళిక తమవద్ద ఉందని స్పష్టంచేసింది. జూరాల వరద కాల్వ కిందే ఏకంగా 100 టీఎంసీలతో 4.57 లక్షల హెక్టార్లకు సాగునీరు ఇస్తామని అందులో తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపిణీకి గాను బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో భాగంగా తెలంగాణ తన అఫిడవిట్‌ను సమర్పించింది. ఇందులో కొన్ని కీలకాంశాలను పేర్కొంది. తమకు మొత్తంగా 936.58 టీఎంసీల అవసరాన్ని పేర్కొన్న తెలంగాణ ఇందులో గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీళ్లు తిరిగి 80శాతం వివిధ రూపాల్లో బేసిన్లోకే చేరుతున్నందున తమ నీటి వినియోగాన్ని 771.47 టీఎంసీలుగా చూపాలని కోరింది. ఏడు ప్రాజెక్టులు.. 9.34 లక్షల హెక్టార్లు.. నిర్మాణం పూర్తయినా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయినా కృష్ణా బేసిన్లో ఇంకా చాలా ఆయకట్టుకు నీరందలేని పరిస్థితులు ఉన్నాయని, ఈ దృష్ట్యా తమకు నీటి కేటాయింపులు పెంచితే కొత్తగా 9.34 లక్షల హెక్టార్లలో సాగునీటిని ఇచ్చేలా 7 కొత్త ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది. ఖమ్మం జిల్లాలో మున్నేరు ద్వారా 4 టీఎంసీలతో 12,950 హెక్టార్లు, వరంగల్ జిల్లాలో 2 టీఎంసీలతో 5వేల హెక్టార్లు, మున్నేరు నదిపై బ్యారేజీల ద్వారా మరో 5 టీఎంసీలతో 20,235 హెక్టార్లు సాగులోకి వచ్చేలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది. ఇక కోయిల్‌కొండ–గండేడు ఎత్తిపోతల ద్వారా 50 టీఎంసీలతో 2,28,686 హెక్టార్లు, రేలంపాడు ఎత్తిపోతలతో 10.50 టీఎంసీతో 48 వేల హెక్టార్లు, ఎస్ఎల్బీసీ విస్తరణతో 35 టీఎంసీలతో 1,61,473 హెక్టార్లు, జూరాల వరద కాల్వతో 100 టీఎంసీల నీటితో 4,57,684 ఎకరాలకు నీరిచ్చేలా తమ భవిష్యత్ ప్రణాళిక ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా 206.50 టీఎంసీల నీటితో 9.34 లక్షల హెక్టార్ల సాగుభూమికి నీటిని అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా నీటి కేటాయింపులు చేయాలని విన్నవించింది. వీటిపై ట్రిబ్యునల్ బుధవారం నుంచి 3 రోజుల పాటు వాదనలు జరగనున్నాయి. -
16 లేదా 17న సమావేశం పెట్టండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల కింద రబీ అవసరాలకు నీటి కేటాయింపులు, ఇప్పటి వరకు జరిగిన వినియోగం, టెలిమెట్రీ పరికరాల బిగింపు, ప్రాజెక్టుల వర్కింగ్ మ్యాన్యువల్ వంటి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 16 లేదా 17న బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం బోర్డుకు లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఆశాజనకంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయని, ఈ దృష్ట్యా రబీ ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు వీలుగా సమావేశం ఏర్పాటుచేయాలని అందులో కోరారు. ఇప్పటికే ప్రభుత్వం తన సాగు, తాగు నీటి అవసరాల కోసం 122 టీఎంసీలు కోరిన విషయం తెలిసిందే. దీంతో పాటే మొదటి, రెండో దశ టెలీమెట్రీ స్టేషన్లను నిర్ధారించడం, పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని తీసుకొని తక్కువ చూపిన లెక్కలను సవరించడం, తమ అభిప్రాయానికి అనుగుణంగా వర్కింగ్ మాన్యువల్‌ను ఖరారు చేయడం వంటి అంశాలను ఎజెండాలో చేర్చాలని కోరింది. వీటితోపాటు బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పు ప్రకారం గృహాలకు పురపాలక సంఘాల్లో తాగునీటికి విడుదల చేసే నీటిలో 20 శాతాన్ని మాత్రమే లెక్కల్లోకి తీసుకోవడం, గోదావరి నీటి మళ్లింపులో వాటా, హైదరాబాద్‌కు వాడే నీటిని ఉమ్మడి కేటాయింపుల్లోంచి తీసుకోవడం, చిన్ననీటి వనరుల కింద వాస్తవ వినియోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎజెండాలో చేర్చాలని కోరింది. అయితే ఏపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఇండెంట్ సమర్పించలేదు. ఈ నేపథ్యంలో 16 లేదా 17న పెట్టాలని కోరుతున్న బోర్డు సమావేశంపై ఏపీ ఎలా స్పందిస్తుందన్నది సందేహంగా మారింది. వారు ఒప్పుకున్న పక్షంలోనే దీపావళికి ముందు సమావేశం జరుగనుంది. లేనిపక్షంలో పండుగ అనంతరమే సమావేశం ఉండనుంది. -
మున్నేరు, శివభాష్యంలపై పరిశీలన
► తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో రంగంలోకి కేంద్ర జల సంఘం ► రాష్ట్ర వాదనలు వినిపించిన స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మున్నేరు, శివభాష్యం సాగర్ ప్రాజెక్టులపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాల పరిశీలనకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రంగంలోకి దిగింది. సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలో శివభాష్యం సాగర్ రిజర్వా యర్, కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీల నిర్మాణం చేపట్టింది. ఈ అంశమై నీటి పారు దల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషితో సోమ వారం ప్రత్యేకంగా భేటీ అయిన సీడబ్ల్యూసీ అధికారులు రాష్ట్ర వాదనను రికార్డు చేశారు. ముమ్మాటికీ అక్రమమే.. కృష్ణా జలాలపై బచావత్ అవార్డు ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల మేర కేటా యించగా, అందులో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీల మేర నీటిని వినియోగించు కుంటున్నాయి. ఈ నీటినే ఆధారం చేసుకునే ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారు. బచావత్ అవార్డు కేటాయించిన 811 టీఎంసీల విని యోగంలో ఎక్కడా పేర్కొనకున్నా శివ భాష్యం సాగర్ ప్రాజెక్టును ఏపీ చేపట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని కానీ, చేపట్టే అవకాశం ఉందని కానీ కనీసం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సైతం పేర్కొన లేదు. బచావత్ అవార్డు ప్రకారం కర్నూలు జిల్లాకు మైనర్ ఇరిగేషన్ కింద 6.95 టీఎంసీ ల మేర కేటాయింపులు ఉన్నాయని, ఈ నీటి ని తీసుకుంటూనే ఈ ప్రాజెక్టు చేపడుతు న్నామని చెబుతూ ఏపీ దీన్ని ప్రారంభిస్తోంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి అర్జీ పెట్టుకుంది. కానీ, తెలంగాణ వ్యతిరేకించడంతో సీడబ్ల్యూసీ అధికారులు శని, ఆదివారాల్లో ప్రాజెక్టు ప్రాం తంలో పర్యటించారు. ప్రాజెక్టు అక్రమమని జోషి స్పష్టం చేసినట్లుగా తెలిసింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 85(సి) నిబంధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు నుంచి అనుమతులు తీసుకో వాల్సి ఉన్నా, అలా జరగలేదని, ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం ఆర్థిక సాయానికి అను మతివ్వరాదని తెలంగాణ కోరినట్లుగా తెలి సింది. మున్నేరు నిర్మాణం వల్ల తెలంగాణ లో ముంపు ఉన్నా, ఏపీ తన డీపీఆర్‌లో ముంపు ను ప్రస్తావించలేదని సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లింది. అన్ని పరిశీలించాకే వీటిపై తుది నిర్ణయం చేస్తామని సీడబ్ల్యూసీ అధికారులు వెల్లడించినట్లుగా తెలిసింది. -
11న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
- తెలంగాణ, ఏపీ నీటి అవసరాలపై చర్చ - పోతిరెడ్డిపాడు టెలిమెట్రీపైనా అభిప్రాయాల సేకరణ - ‘ప్రాజెక్టుల నియంత్రణ’పై అభిప్రాయాలు చెప్పాలంటూ లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల పంపకాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 11న భేటీ కానుంది. ఈ మేరకు మంగళవారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ ఇరు రాష్ట్రాలకు లేఖ ద్వారా సమాచారం అందించారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లి నీటిని పంచాలన్న డిమాండ్లతో పాటు టెలిమెట్రీ పరికరాలు అమర్చే అంశాన్ని భేటీ ప్రధాన ఎజెండాగా చేర్చారు. శ్రీశైలం నీటి విడుదల కోసం.. గతంలో బోర్డు సమక్షంలో ఇరు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్‌లో 502 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల వరకు నీటిని తీసుకోవచ్చు. కానీ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ సాగర్‌లో 501 అడుగుల మట్టం వరకు కూడా నీటిని తీసుకుంది. అంతకన్నా దిగువన నీటిని తీసుకునే అవకాశం లేకపోవడంతో... శ్రీశైలం నుంచి సాగర్‌కు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీని కోరింది. శ్రీశైలం నీటిమట్టం ఇప్పటికే 775 అడుగుల వద్దకు చేరడంతో.. అంతకన్నా దిగువన నీటిని విడుదల చేసేందుకు ఏపీ ససేమిరా అంటోంది. దీనిపై లేఖల ద్వారా తేలే అవకాశం లేకపోవడంతో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. టెలిమెట్రీ వివాదంపైనా.. కృష్ణా బేసిన్లో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపైనా త్రిసభ్య కమిటీ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తెలంగాణ ప్రతిపాదించగా.. దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ పాయింట్‌కు మార్చాలని బోర్డు నిర్ణయించింది. కానీ దానిపై తెలంగాణ అభ్యంతరం చెప్పడంతో.. 600 మీటర్ల వద్ద పాయింట్‌కే ఓకే చేప్పింది. అయితే ఆ పాయింట్ వద్ద టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో.. ముందుగా 12.26 పాయింట్ వద్ద ఏర్పాటు చేద్దామని సూచించింది. భేటీలో దీనిపై ఇరు రాష్ట్రాలు అభిప్రాయం చెప్పే అవకాశముంది. ఇక ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలో తెలపాలంటూ బోర్డు ఇరు రాష్ట్రాలకు మరో లేఖ రాసింది. నేటి నుంచి బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ కృష్ణా జలాల వివాదానికి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ బుధవారం నుంచి రెండ్రోజుల పాటు విచారణ జరపనుంది. ఇప్పటికే ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పుపై ఇరు రాష్ట్రాలు తమ వివరణలు ఇచ్చాయి. ఏ లెక్కన చూసినా కృష్ణాలో తమకు కేటాయింపులు పెరగా లని తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్లో మొత్తంగా ఏపీకి 155 టీఎంసీల నీటి వాటా సరిపోతుందని.. ఆ మేరకు వారికి ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల వాటాలో కోత పెట్టాలని కోరింది. సాగర్ కుడి కాల్వ కింద ఏపీకి 140 టీఎంసీల కేటాయింపులు ఉండగా.. వాస్తవ అవసరాలు 75.57 టీఎంసీలు మాత్రమేనని స్పష్టం చేసింది. దీనితోపాటు తుంగభద్ర లోలెవల్ కెనాల్, హై లెవల్ కెనాల్ల కింద అవసరాలకు మించి కేటాయింపులున్నాయని, వాటిని తగ్గించాలని కోరింది. మొత్తంగా ఈ అంశాలపై మరోమారు ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించనున్నాయి. -
కర్ణాటక ప్రాజెక్టులతో రాష్ట్రానికి నష్టమే!
శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు ► రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కోర్టుల్లో కొట్లాడుతున్నామని వెల్లడి ► కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్, ఎస్సారెస్పీకి నీళ్లిస్తామని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లో ఎగువన కర్ణాటక కడుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టులవల్ల దిగువ రాష్ట్రమైన తెలంగాణకు నష్టం జరుగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఎగువన తమ వాటా నీటినే వినియోగిస్తున్నామంటూ, కర్ణాటక ఇష్టారీతిన ప్రాజెక్టులు కడుతోందని, దేనికింద ఎంత నీటిని వినియోగిస్తున్నది స్పష్టంగా తెలియడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కోర్టుల్లో కొట్లాడు తున్నామని, కేంద్ర జలసంఘం, కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని అన్నారు. అయితే కృష్ణా జలాలపై తుది తీర్పు గెజిట్ అయితే కృష్ణానదీ నిర్ణయ అమలు బోర్డు ఏర్పాటు జరుగుతుందని, అప్పుడే ఎగువ రాష్ట్రాల నీటి వినియోగంపై నియంత్రణ సాధ్యపడుతుందని తెలిపారు. ఈ అంశంపై గురువారం శాసన మండలిలలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అప్పర్ కృష్ణాలో కర్ణాటకకు 150 టీఎంసీల కేటాయింపులున్నాయని, అక్కడ చేపట్టిన ఆధునీకరణతో మిగిలిన 21 టీఎంసీలతో ఐదు ఎత్తిపోతల పథకాలు చేపట్టిందన్నారు. అయితే ఈ నీటి వినియోగంపై వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉందన్నారు. ఇక బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పుతో దిగువ రాష్ట్రాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా దీనిపై కోర్టులు, కేంద్రం ముందు కొట్లాడుతున్నామని వెల్లడించారు. అయితే దీనిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మరింత లోతుగా చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ, మండలి చైర్మన్ అనుమతిస్తే ఒక రోజు కృష్ణాజలాలపై పూర్తి స్థాయిలో చర్చిద్దామని అన్నారు. నిజాంసాగర్, ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్, ఎస్సారెస్పీలకు నీటి కరువు ఏర్పడిన సమయంలో కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు సభ్యుడు భూపతిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్‌కు నీళ్లిచ్చి అక్కడి రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని, ఇక వరద కాల్వ ద్వారా కేవలం 30 మీటర్ల లిఫ్టుతో ఎస్సారెస్పీకి నీటిని రివర్సబుల్ పంపింగ్ చేస్తామన్నారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే కేబినెట్ ఆమోదానికి పంపిస్తామన్నారు. నిజాంసాగర్ ఆధునీకరణ పనులకు రూ.954 కోట్లు కేటాయించామని తెలిపారు. కనీస వేతనాలు ఎక్కడ? రాములు నాయక్ హైదరాబాద్‌లోని చాలా పరిశ్రమల్లో ఇప్పటికీ కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. స్త్రీ, పురుష వేతనాల్లోనూ తేడాలుం టున్నాయని తెలిపారు. దీనిపై కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందిస్తూ, కనీస వేతనాలు అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అమలు చేయని యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈత వనాలు అభివృద్ధి చేయండి: షబ్బీర్ అలీ రాష్ట్రంలో ప్రత్యేక ప్రాంతాల్లో ఈత వనాలను అభివృద్ధి చేయాలని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రభుత్వానికి సూచించారు. చాలా చోట్ల ప్రైవేటు పట్టాదారులు ఈత చెట్లను నరికివేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో గీత కార్మికుల ఉపాధికి గండి పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇక చాలా సొసైటీలకు లెసెన్సుల జారీ విషయంలో జాప్యం జరుగు తోందని మరో సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీనిపై ఎక్సైజ్ మంత్రి పద్మారావు స్పందిస్తూ, రిజిస్టర్ చేసుకున్న అన్ని సొసైటీలకు లైసెన్సులు జారీ చేస్తామన్నారు. -
వారం రోజుల్లో చెప్పండి
♦ కృష్ణా ప్రాజెక్టుల పరిధిపై ♦ 10వ తేదీ వరకు బోర్డు డెడ్‌లైన్ ♦ లేదంటే బోర్డు మాన్యువల్‌ను ఆమోదిస్తున్నట్లుగా ♦ పరిగణిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై అభిప్రాయం చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా నదీయాజమాన్య బోర్డు వారం రోజులు గడువు పెట్టింది. ఈ నెల 10వ తేదీలోగా రాష్ట్రం తన అభిప్రాయం చెప్పాలని సూచించింది. గడువులోగా అభిప్రాయం చెప్పకపోతే తాము తయారు చేసిన మాన్యువల్‌ను రాష్ట్రం అంగీకరిస్తున్నట్లుగా పరిగణించి, ఆ ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెల 27న ఇరు రాష్ట్రాలతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మినిట్స్‌ను గురువారం తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. దీన్లో ప్రధానంగా ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని ప్రస్తావించింది. ఆ సమావేశంలో ప్రాజెక్టుల నిర్వహణపై రూపొందించిన మాన్యువల్‌ను ఇరు రాష్ట్రాలకు అందించింది. దాని ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయి. హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లు కూడా బోర్డు నియంత్రణలో ఉంటాయి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు, అందుకనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా ఈ మాన్యువల్‌ను బోర్డు రూపొందించింది. అయితే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే యత్నాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదీగాక బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎవరి వాటా ఎంత, వినియోగం ఎలా ఉండాలో చెప్పాకే బోర్డు నియంత్రణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని చెబుతోంది. ఈ అంశాల్ని పేర్కొంటూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు గతంలోనే కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖలు రాశారు. అదలా ఉండగానే.. అభిప్రాయం చెప్పాలంటూ బోర్డు డెడ్‌లైన్ పెట్టడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘సుప్రీం’ దృష్టికి కృష్ణా బేసిన్ దుస్థితి
♦ నీటి కష్టాలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ♦ కోర్టు దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై కసరత్తు ♦ సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్‌తో అధికారుల భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సగానికి పైగా జనాభాకు తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే కృష్ణా నది బేసిన్లో ప్రస్తుత ఏడాదిలో నెలకొన్న కరువు పరిస్థితులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మున్ముందు కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగితే తెలంగాణ ఎడారిగా మారే అవకాశముందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించాలని ప్రభుత్వం నిశ్చయానికి వచ్చినట్లు తెలిసింది. వచ్చిన నీటిని వచ్చినట్లు కర్ణాటక, మహారాష్ట్రలు ఎప్పటికప్పుడు ఒడిసిపట్టుకొని, వాడేసుకుంటూ పోతే దిగువన ఉన్న రాష్ట్రాలకు నీటి రాక ఎట్లాగో, లోటు వర్షపాతం ఉన్న సంవత్సరాల్లో దిగువ రాష్ట్రాలు గుక్కెడు నీటి కోసం ఎక్కడికి వెళ్లాలో పరిష్కారం సూచించాలని ఎగువ రాష్ట్రాలను ప్రశ్నించేం దు కు సిద్ధమైంది. ఈ నెల 13న మరోమారు కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో కేసు పూర్వాపరాలపై పూర్తి అధ్యయనం చేసేందుకు సుప్రీంలో రాష్ట్రం తరఫు న్యాయవాది వైద్యనాథన్ శనివారం నీటిపారుదల అధికారులు, అంతర్రాష్ట్ర నదీ నిర్వహణ బోర్డు అధికారులు, రాష్ట్ర న్యాయవాదులతో సమావేశమయ్యారు. సుప్రీంలో వినిపించాల్సిన వాదనలపై వీరు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా కృష్ణా జలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలంటూ గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకి కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై ఎలాంటి వాదనలు వినిపించాలన్న దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. నీరు తక్కువ ఉన్న ఏడాదుల్లో ఏ ప్రాజెక్టు నుంచి ఎంతనీరు, ఎవరు ఎవరికి విడుదల చేయాలన్న నిర్ధేశాలను బచావత్ కానీ, బ్రజేశ్ ట్రిబ్యునల్ కానీ చెప్పలేదన్న అంశాలపై చర్చించారు. కరువు పరిస్థితుల్లో తెలంగాణకు తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నీటిని విడుదల చేయాలని, దిగువ రాష్ట్రం ఏపీకి మిగిలిన మూడు రాష్ట్రాలు విడుదల చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. నీటి లోటు పరిస్థితుల్లో ఏ ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు? అన్న దానిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని, కనుక ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు సమీక్షించాలంటే విచారణలో కర్ణాటక, మహారాష్ట్రలు ఉండాల్సిందే అన్న వాదన వినిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. మిగులు జలాల పంపకంలో అన్యాయం.. వీటితో పాటే బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబులిటీ మీద నీటి లభ్యతను లెక్కవేసి మిగులు జలాలను దిగువ రాష్ట్రం ఏపీ వాడుకునే వెసులుబాటు కల్పించగా, బ్రజేశ్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబులిటీ ఆధారంగా నీటి లభ్యతను లెక్కించి మిగులు జలాలను పంచిం దని, దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు లబ్ధి చేకూరగా, దిగువ రాష్ట్రాలు నష్టపోతున్నాయన్న విషయాన్ని మరోమారు కోర్టు దృష్టికి తేవాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితులే ముందు, ముందు కూడా ఎదురైతే సాగర్ కింద ఆయకట్టుకు నీరివ్వలేని గడ్డు పరిస్థితులు నెలకొంటాయని, ఉన్న కాస్త నీటిని తాగు అవసరాల కోసం నిత్యం గుంజులాడుకోవాల్సి ఉంటుందని. రెండు రాష్ట్రాలకే వివాదాన్ని పరిమితం చేస్తే నీటి యుద్ధాలు మరింత తీవ్రం కాక తప్పదని.. దీనిని సుప్రీంకు అర్థమయ్యేలా వివరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలకే వాదనలు పరిమితం చేస్తే ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన మిగులు జలాలపై ప్రశ్నించే అవకాశం తెలుగు రాష్ట్రాలకు దక్కదని, అదే జరిగితే తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ తదితర మిగులు జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందన్న అంశాలను కూడా వివరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.