సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లో పదేళ్ల అనం తరం విస్తారంగా కురిసిన వర్షాలతో పోటెత్తిన వరదలు రాష్ట్రానికి కొత్త ఊపిరిలూదాయి. ఆగస్టు తొలివారం నుంచి విరామం లేకుండా కొనసాగిన వరదలు ప్రాజెక్టుల కింది తాగు, సాగు అవసరాలకు వరంగా మారాయి. బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో పెరిగిన ప్రవాహాల మాదిరే, రాష్ట్ర వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఆగస్టు నుంచి మూడు నెలల వ్యవధిలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద 100 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 340 టీఎంసీల లభ్యత జలాలుండగా, ప్రాజెక్టుల్లో స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుం డటం రాష్ట్రానికి వరంగా మారింది.
‘పాలమూరు’కు ప్రాణం..
జూరాల, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు ఆగస్టు నుంచి ఉధృతంగా కొనసాగుతూ వచ్చాయి. 2009– 10 తర్వాత ఆ స్థాయిలో వరదలు కొనసాగడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు 6 సార్లు, సాగర్ గేట్లు 7 సార్లు ఎత్తాల్సి వచ్చింది. ఇప్పటివరకు జూరాలకు 1,348 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 1,650 టీఎంసీలు రాగా, సాగర్‌కు 1,145 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో తెలంగాణలో 100 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. గత కొన్నేళ్లతో పోలిస్తే గరిష్ట నీటి వినియో గం జరిగింది. పాలమూరు జిల్లాలో జూరాలపై ఆధారపడ్డ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమాలతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద గతంలో ఎన్నడూలేని రీతిలో 53 టీఎంసీల మేర నీటి విని యోగం జరిగింది. నెట్టెంపాడు కిందే 16 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.
వీటి ద్వారా 952 చెరువులను నింపారు. గతేడాది ఇదే సమయానికి ఈ పథకాలు, జూరాల కింద వినియోగం 20 టీఎంసీలను దాటలేదు. గత ఏడాదంతా కలిపి అన్ని ప్రాజెక్టుల కింద వినియోగం 75 టీఎంసీలు మాత్రమే ఉంది. ప్రస్తుతం జూరాలకు 1.38 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండటంతో దానిపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాలకు నీటి వినియోగం జరుగుతూనే ఉంది. మరో పది రోజులపాటు వరద ఇదే రీతిన కొనసాగే అవకాశాల నేపథ్యంలో మరిన్ని చెరువులు నింపనున్నారు. సాగర్ ఎడమ కాల్వ కింద తాగు, సాగునీటి అవసరాలకు ఇప్పటికే 24 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఏఎంఆర్‌పీ కింద 13 టీఎంసీలు, జలమండలి కింది 7 టీఎంసీల మేర వినియోగం జరిగింది. కనీస నీటి మట్టం 834 అడుగుల కు ఎగువన శ్రీశైలంలో 160 టీఎంసీలు, సాగర్‌లో 510 అడుగులకు పైన 180 టీఎంసీలు కలిపి 340 టీఎంసీల లభ్యత ఉంది. ఈ వినియోగం వచ్చే ఏడాది జూన్ వరకు జరిగినా, గతేడాది మొత్తం జరిగిన వినియోగం 207 టీఎంసీల మార్కును దాటనుంది.
బాబ్లీ గేట్ల మూసివేత
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 14 గేట్లను మూసి వేశారు. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో మంగళవారం ఎస్సారెస్పీ వరద గేట్లను మూసి వేశారు.
వరదే.. వరమయ్యింది
Published Wed, Oct 30 2019 3:21 AM | Last Updated on Wed, Oct 30 2019 3:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment