కర్ణాటక ప్రాజెక్టులతో రాష్ట్రానికి నష్టమే!
శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు
► రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కోర్టుల్లో కొట్లాడుతున్నామని వెల్లడి
► కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్, ఎస్సారెస్పీకి నీళ్లిస్తామని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లో ఎగువన కర్ణాటక కడుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టులవల్ల దిగువ రాష్ట్రమైన తెలంగాణకు నష్టం జరుగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఎగువన తమ వాటా నీటినే వినియోగిస్తున్నామంటూ, కర్ణాటక ఇష్టారీతిన ప్రాజెక్టులు కడుతోందని, దేనికింద ఎంత నీటిని వినియోగిస్తున్నది స్పష్టంగా తెలియడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కోర్టుల్లో కొట్లాడు తున్నామని, కేంద్ర జలసంఘం, కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని అన్నారు. అయితే కృష్ణా జలాలపై తుది తీర్పు గెజిట్ అయితే కృష్ణానదీ నిర్ణయ అమలు బోర్డు ఏర్పాటు జరుగుతుందని, అప్పుడే ఎగువ రాష్ట్రాల నీటి వినియోగంపై నియంత్రణ సాధ్యపడుతుందని తెలిపారు. ఈ అంశంపై గురువారం శాసన మండలిలలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
అప్పర్ కృష్ణాలో కర్ణాటకకు 150 టీఎంసీల కేటాయింపులున్నాయని, అక్కడ చేపట్టిన ఆధునీకరణతో మిగిలిన 21 టీఎంసీలతో ఐదు ఎత్తిపోతల పథకాలు చేపట్టిందన్నారు. అయితే ఈ నీటి వినియోగంపై వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉందన్నారు. ఇక బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పుతో దిగువ రాష్ట్రాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా దీనిపై కోర్టులు, కేంద్రం ముందు కొట్లాడుతున్నామని వెల్లడించారు. అయితే దీనిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మరింత లోతుగా చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ, మండలి చైర్మన్ అనుమతిస్తే ఒక రోజు కృష్ణాజలాలపై పూర్తి స్థాయిలో చర్చిద్దామని అన్నారు.
నిజాంసాగర్, ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు
నిజాంసాగర్, ఎస్సారెస్పీలకు నీటి కరువు ఏర్పడిన సమయంలో కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు సభ్యుడు భూపతిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్‌కు నీళ్లిచ్చి అక్కడి రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని, ఇక వరద కాల్వ ద్వారా కేవలం 30 మీటర్ల లిఫ్టుతో ఎస్సారెస్పీకి నీటిని రివర్సబుల్ పంపింగ్ చేస్తామన్నారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే కేబినెట్ ఆమోదానికి పంపిస్తామన్నారు. నిజాంసాగర్ ఆధునీకరణ పనులకు రూ.954 కోట్లు కేటాయించామని తెలిపారు.
కనీస వేతనాలు ఎక్కడ? రాములు నాయక్
హైదరాబాద్‌లోని చాలా పరిశ్రమల్లో ఇప్పటికీ కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. స్త్రీ, పురుష వేతనాల్లోనూ తేడాలుం టున్నాయని తెలిపారు. దీనిపై కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందిస్తూ, కనీస వేతనాలు అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అమలు చేయని యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.
ఈత వనాలు అభివృద్ధి చేయండి: షబ్బీర్ అలీ
రాష్ట్రంలో ప్రత్యేక ప్రాంతాల్లో ఈత వనాలను అభివృద్ధి చేయాలని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రభుత్వానికి సూచించారు. చాలా చోట్ల ప్రైవేటు పట్టాదారులు ఈత చెట్లను నరికివేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో గీత కార్మికుల ఉపాధికి గండి పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇక చాలా సొసైటీలకు లెసెన్సుల జారీ విషయంలో జాప్యం జరుగు తోందని మరో సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీనిపై ఎక్సైజ్ మంత్రి పద్మారావు స్పందిస్తూ, రిజిస్టర్ చేసుకున్న అన్ని సొసైటీలకు లైసెన్సులు జారీ చేస్తామన్నారు.