కారంపూడి మండలంలో దెబ్బతిన్న పత్తి పంట
సాక్షి, అమరావతి బ్యూరో: సాగర్ కుడికాలువలో పుష్కలంగా నీరుంది. ఆరుతడి పంటలకే కాదు మాగాణికి కూడా నీరిస్తాం. వరి సాగు చేసుకోండి. ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం. ఇదీ సెప్టెంబర్ 27న నాగార్జున సాగర్‌లో జలహారతి సభలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ.
కట్ చేస్తే..
సీఎం హామీని నమ్మిన రైతులు మెట్ట పంటలు పీకేసి మాగాణి సాగు చేపట్టారు. నీరిస్తామన్న చంద్రబాబు.. హామీని గాలికొదిలేశారు. అధికారులు వారబందీ అంటూ నీటి విడుదలకు వంతులు వేశారు. ఎదగాల్సిన మొక్కలు నీరందక వాలిపోతుంటే గుండె బరువెక్కిన రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నేడు నకరికల్లు వద్ద పెన్నా–గోదావరి నదుల అనుసంధానానికి సీఎం చంద్రబాబు వస్తున్నారు.
వేల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ఎన్నికల ముందు కొబ్బరికాయ కొడుతున్నారు. మాగాణి పంటలకే నీరివ్వలేని బాబు.. ఈ ఎత్తిపోతల.. ఉత్తికోతలేనని రైతులు మండిపడుతున్నారు. ఈ అభివృద్ధి మంత్రమంతా.. ఎన్నికల కుతంత్రమేనని స్పష్టం చేస్తున్నారు.
నాగార్జున సాగర్ కుడికాలువ రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉంది. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపంతో నీరు పుష్కలంగా ఉన్నా, మాగాణి పంటలు సాగవ్వలేదు. ఈ ఏడాది జలహారతి కార్యక్రమంలో భాగంగా ఏ పంటలు సాగు చేసుకున్నా నీరు ఇస్తామని సీఎం నారా చంద్రబాబు ప్రకటించారు. సీఎం మాటలు నమ్మిన రైతులు సాగు చేసిన కంది, పత్తి పంటలను దున్ని మాగాణి వేశారు.
తీరా పంటలు సాగు చేశాక నీటి లభ్యత లేదని వారబందీ విధానం ప్రవేశ పెట్టారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. పంటలు కాపాడుకునేందుకు అన్నదాతలు కాలువల వెంబడి నిద్రాహారాలు మాని ఆయిల్ ఇంజన్‌లతో నానా తంటాలు పడుతున్నారు. సీఎం మాటలు నమ్మి పూర్తిగా మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తిపోతల.. ఉత్తికోతలే..
గోదావరి అనుసంధానంలో భాగంగా నకరికల్లు వద్ద రూ.6200 కోట్ల అంచనాలతో ఎత్తిపోతల పథకానికి సీఎం సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పంటలకు నీళ్లిస్తామని ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి.. ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
సాగర్ కుడికాలువలో నీరున్నా పంటలకు అందించడం చేతగాని ప్రభుత్వం.. ఎన్నికల వేళ శంకుస్థాపన చేస్తున్న ఈ ప్రాజెక్టు గాలిలో దీపమేనని ఎద్దేవా చేస్తున్నారు. పంటలకు సాగు నీటి విషయమై ముఖ్యమంత్రిని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎందుకీ దుస్థితి...
నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో సాగు, తాగునీటి అవసరాల కోసం 136 టీఎంసీల నీరు అవసరమని కృష్ణా నది యజమాన్య బోర్డుకు అధికారులు నివేదించారు. అయితే కృష్ణా బోర్డు మాత్రం కేవలం 91 టీఎంసీల నీటిని కేటాయింంచింది. ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుపై ఒత్తిడితెచ్చి, అవసరమైన నీటి కేటాయింపులు సాధించుకోవడంలో విఫలమైంది.
గత ఏడాది మాగాణి పంటలకు నీరు ఇవ్వకపోయినా 89 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించటం గమనార్హం. ఈ ఏడాది మాగాణి పంటలకు నీరిస్తామని చెప్పినప్పటికీ కేటాయింపుల్లో గత ఏడాదితో పోల్చితే అదనంగా కేవలం 2 టీఎంసీలు మాత్రమే ఇచ్చారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలో కాలువలకు నీరు అవసరం లేకున్నా పుష్కలంగా విడుదల చేశారు.
కేటాయించిన వాటాలో నీటి వాటా కరిగిపోవటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి వినియోగంపై కోత విధించారు. ప్రస్తుతం వారబందీ విధానంలో పంట పొలాలకు నీరిస్తున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు కేటాయించిన నీటిలో ఇప్పటి వరకు సాగు, తాగునీటి అవసరాల వినియోగానికిపోను కేవలం 17 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న మెట్ట, మాగాణి పంటలను కాపాడుకోవాలంటే మార్చి వరకు నీరివ్వాలి.
17 టీఎంసీల నీరు డిసెంబర్ 20వ తేదీ వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పంటలు గట్టెక్కాలంటే అదనంగా 40 టీఎంసీలు కావాలి. దీని గురించి పట్టించుకోని ప్రభుత్వం..తాజాగా వేల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం ప్రారంభించడం రైతులపై కపట ప్రేమేనని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి
ఎండుతున్న పంటలు
చివరి ఆయకట్టు ప్రాంతాలైన వినుకొండ, తాడికొండ, పెదకూరపాడు, చిలకలూరిపేట, ప్రత్తిపాడు నియోజక వర్గాల్లో మాగాణి, మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం అక్టోబరు 25వ తేదీ నుంచి కొత్తగా పంటలు సాగు చేయొద్దని ప్రకటించింది.
నవంబరు ఒకటో తేదీ నుంచి వారబందీ విధానాన్ని ప్రవేశ పెట్టింది. తొమ్మిది రోజులపాటు పూర్తిగా (9000ల క్యూసెక్కులు) నీరు కాలువలకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ప్రకారం తొమ్మిది రోజుల్లో అయకట్టుకు నీరు అందివ్వలేకపోతున్నారు. దీంతో పంటతలకు నీరందక జీవం కోల్పోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment