11న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
- తెలంగాణ, ఏపీ నీటి అవసరాలపై చర్చ
- పోతిరెడ్డిపాడు టెలిమెట్రీపైనా అభిప్రాయాల సేకరణ
- ‘ప్రాజెక్టుల నియంత్రణ’పై అభిప్రాయాలు చెప్పాలంటూ లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల పంపకాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 11న భేటీ కానుంది. ఈ మేరకు మంగళవారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ ఇరు రాష్ట్రాలకు లేఖ ద్వారా సమాచారం అందించారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లి నీటిని పంచాలన్న డిమాండ్లతో పాటు టెలిమెట్రీ పరికరాలు అమర్చే అంశాన్ని భేటీ ప్రధాన ఎజెండాగా చేర్చారు.
శ్రీశైలం నీటి విడుదల కోసం..
గతంలో బోర్డు సమక్షంలో ఇరు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్‌లో 502 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల వరకు నీటిని తీసుకోవచ్చు. కానీ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ సాగర్‌లో 501 అడుగుల మట్టం వరకు కూడా నీటిని తీసుకుంది. అంతకన్నా దిగువన నీటిని తీసుకునే అవకాశం లేకపోవడంతో... శ్రీశైలం నుంచి సాగర్‌కు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీని కోరింది. శ్రీశైలం నీటిమట్టం ఇప్పటికే 775 అడుగుల వద్దకు చేరడంతో.. అంతకన్నా దిగువన నీటిని విడుదల చేసేందుకు ఏపీ ససేమిరా అంటోంది. దీనిపై లేఖల ద్వారా తేలే అవకాశం లేకపోవడంతో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది.
టెలిమెట్రీ వివాదంపైనా..
కృష్ణా బేసిన్‌లో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపైనా త్రిసభ్య కమిటీ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తెలంగాణ ప్రతిపాదించగా.. దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ పాయింట్‌కు మార్చాలని బోర్డు నిర్ణయించింది. కానీ దానిపై తెలంగాణ అభ్యంతరం చెప్పడంతో.. 600 మీటర్ల వద్ద పాయింట్‌కే ఓకే చేప్పింది. అయితే ఆ పాయింట్ వద్ద టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో.. ముందుగా 12.26 పాయింట్ వద్ద ఏర్పాటు చేద్దామని సూచించింది. భేటీలో దీనిపై ఇరు రాష్ట్రాలు అభిప్రాయం చెప్పే అవకాశముంది. ఇక ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలో తెలపాలంటూ బోర్డు ఇరు రాష్ట్రాలకు మరో లేఖ రాసింది.
నేటి నుంచి బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ
కృష్ణా జలాల వివాదానికి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ బుధవారం నుంచి రెండ్రోజుల పాటు విచారణ జరపనుంది. ఇప్పటికే ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పుపై ఇరు రాష్ట్రాలు తమ వివరణలు ఇచ్చాయి. ఏ లెక్కన చూసినా కృష్ణాలో తమకు కేటాయింపులు పెరగా లని తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్‌లో మొత్తంగా ఏపీకి 155 టీఎంసీల నీటి వాటా సరిపోతుందని.. ఆ మేరకు వారికి ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల వాటాలో కోత పెట్టాలని కోరింది. సాగర్ కుడి కాల్వ కింద ఏపీకి 140 టీఎంసీల కేటాయింపులు ఉండగా.. వాస్తవ అవసరాలు 75.57 టీఎంసీలు మాత్రమేనని స్పష్టం చేసింది. దీనితోపాటు తుంగభద్ర లోలెవల్ కెనాల్, హై లెవల్ కెనాల్‌ల కింద అవసరాలకు మించి కేటాయింపులున్నాయని, వాటిని తగ్గించాలని కోరింది. మొత్తంగా ఈ అంశాలపై మరోమారు ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించనున్నాయి.