‘కృష్ణా’పై తాడో పేడో..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం నుంచి సుప్రీంకోర్టులో తుది వాదనలు జరుగనున్నాయి. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని.. దానిని కొట్టివేసి, నీటిని 4 రాష్ట్రాల మధ్య తిరిగి పంపిణీ చేయాలని ఇరు రాష్ట్రాలు గట్టిగా వాదించేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలోని కృష్ణా బేసిన్ మొత్తం నీటి కరువు కారణంగా ఎదుర్కొంటున్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురానుంది.
కృష్ణా జలాల వివాదంలో ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్‌లపై బుధవారం నుంచి సుప్రీం లో విచారణ జరుగనుంది. బ్రిజేష్ తీర్పును త్వరగా అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్రలు కోరుతుండగా.. 4 రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంపకాలు చేయాలని తెలంగాణ కోరుతోంది. అసలు నీరు తక్కువగా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు నుంచి ఎంతనీరు, ఎవరు ఎవరికి విడుదల చేయాలన్నదానిపై నిర్దేశాలను స్పష్టంగా తెలపాలని టీ సర్కారు తన పిటిషన్‌లోనే విజ్ఞప్తి చేసింది. తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని విన్నవించింది. దీనిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని.. కనుక ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు సమీక్షించాలని కోరింది.
నష్టాన్ని పూడ్చాలి..: నీటి లభ్యతను అం చనా వేయడానికి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీ పద్ధతి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు అనుమతించడం వంటి కారణాలతో ఇప్పటికే 130 టీఎంసీల వరకు నీటిని కోల్పోతున్నామని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో కోర్టుకు తెలిపింది. మిగులు జలాలు సైతం 150 టీఎంసీల మేర ఏపీకి కేటాయించగా.. తెలంగాణకు 77 టీఎంసీలే కేటాయించారని పేర్కొంది. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్‌ల ముందు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించే వెసులుబాటు కలగని దృష్ట్యా.. తమ కు ఇప్పుడు అవకాశం కల్పించాలని సుప్రీంను కోరింది.
గతంలోనే కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపులకై విజ్ఞప్తి చేసినా, ట్రిబ్యునల్ పట్టించుకోని దృష్ట్యా... ఇప్పుడు పునఃసమీక్ష చేయాలని అభ్యర్థించనుంది. స్థూలంగా మిగులు జలాలు, నికర జలాలు కలుపుకొని మొత్తంగా మరో 400 టీఎంసీల మేర కేటాయింపులు కోరేలా అధికారులు వాదనలు సిద్ధం చేశారు.