T government
-
టీ సర్కారు కంపెనీ 'కాకతీయ ఫుడ్స్'
హైదరాబాద్: 'కాకతీయ ఫుడ్స్' బ్రాండ్‌తో తెలంగాణ ప్రభుత్వం పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను విక్రయించాలని నిర్ణయించింది. దేశ విదేశాలకు సేంద్రీయ పండ్లు, కూరగాయలు ఎగుమతి చేయాలని... అలాగే కల్తీ లేని కారం, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలను ఔట్లెట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ విధివిధానాలను ఖరారు చేస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఉద్యానాభివృద్ధి సంస్థ పేరుతో కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తులు పండిస్తే... రైతులకు లాభసాటిగా చేసేందుకు ఆ ఉత్పత్తులకు అవసరమైన ప్రాసెసింగ్, మార్కెటింగ్ బాధ్యత ఉద్యానాభివృద్ధి సంస్థ చేపడుతుంది. ఈ రెండూ సమన్వయంతో ముందుకు సాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆహార పదార్థాల్లో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుండటంతో ఏం తినాలన్నా భయపడాల్సి వస్తోందని.. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అందుకోసం ఆయన ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
గ్రూప్-2 ఇంటర్వ్యూలు రద్దు!
టీసర్కార్‌కు కేంద్రం ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మినహా అన్ని గ్రూప్స్ (గ్రూప్-2, 3, 4) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల (డీవోపీటీ) శాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. డీవోపీటీ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కోతన్ రాసిన లేఖ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందింది. స్వాతంత్య్రదిన వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూనియర్ లెవల్ అధికారి పోస్టులకు ఇంటర్వ్యూలను నిలిపివేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ లెవల్ పోస్టులకు ఎక్కడైనా ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటే నిలిపివేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని డీవోపీటీ తన లేఖలో పేర్కొంది. అవినీతిని నిరోధించేందుకు, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు, నిరుపేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఇబ్బందులను దూరం చేసేందుకే ఈ చర్యను చేపట్టాల్సిందిగా ప్రధాని ఆదేశించారని తెలిపింది. మెరిట్ ఆధారంగానే ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రధాని స్పష్టం చేశారని వివరించింది. జూనియర్ లెవల్ ఆఫీసర్ పోస్టులను గుర్తించి వాటి భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని తొలగించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 స్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటే రద్దు చేయాలని.. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది. గ్రూప్-2కు రద్దు చేయాల్సిందే: ప్రస్తుతం రాష్ట్రంలో గ్రూప్-3, గ్రూప్-4, నాన్‌గెజిటెడ్ పోస్టులకు ఇంటర్వ్యూలు లేవు. గ్రూప్-1, గ్రూప్-2, గెజిటెడ్ అధికారి పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూల విధానం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండగా, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను కొనసాగించి, ఇంటర్వ్యూ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. గ్రూప్-2లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3గా మార్చింది, వీటికి ఇంటర్వ్యూలు లేవు. అయితే తాజాగా కేంద్ర ఆదేశాల నేపథ్యంలో గ్రూప్-2 పోస్టులకు కూడా ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాల్సి ఉంది. ప్రస్తుతం గ్రూప్-2లో నాలుగు పేపర్లకు (ఒక్కోటి 150 మార్కుల చొప్పున) 600 మార్కులు, మరో 75 మార్కులకు ఇంటర్వ్యూ లు ఉండేలా ఇటీవలే పరీక్షల విధానాన్ని ప్రకటించిం ది. కానీ కేంద్ర ఆదేశాల నేపథ్యంలో ఇంటర్వ్యూలను రద్దు చేసి... 600 మార్కులకు రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ వర్గాలు దీనిపై తమకు సమాచారం అందలేదని పేర్కొన్నాయి. -
‘కృష్ణా’పై తాడో పేడో..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం నుంచి సుప్రీంకోర్టులో తుది వాదనలు జరుగనున్నాయి. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని.. దానిని కొట్టివేసి, నీటిని 4 రాష్ట్రాల మధ్య తిరిగి పంపిణీ చేయాలని ఇరు రాష్ట్రాలు గట్టిగా వాదించేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలోని కృష్ణా బేసిన్ మొత్తం నీటి కరువు కారణంగా ఎదుర్కొంటున్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురానుంది. కృష్ణా జలాల వివాదంలో ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై బుధవారం నుంచి సుప్రీం లో విచారణ జరుగనుంది. బ్రిజేష్ తీర్పును త్వరగా అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్రలు కోరుతుండగా.. 4 రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంపకాలు చేయాలని తెలంగాణ కోరుతోంది. అసలు నీరు తక్కువగా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు నుంచి ఎంతనీరు, ఎవరు ఎవరికి విడుదల చేయాలన్నదానిపై నిర్దేశాలను స్పష్టంగా తెలపాలని టీ సర్కారు తన పిటిషన్లోనే విజ్ఞప్తి చేసింది. తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని విన్నవించింది. దీనిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని.. కనుక ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు సమీక్షించాలని కోరింది. నష్టాన్ని పూడ్చాలి..: నీటి లభ్యతను అం చనా వేయడానికి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీ పద్ధతి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు అనుమతించడం వంటి కారణాలతో ఇప్పటికే 130 టీఎంసీల వరకు నీటిని కోల్పోతున్నామని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో కోర్టుకు తెలిపింది. మిగులు జలాలు సైతం 150 టీఎంసీల మేర ఏపీకి కేటాయించగా.. తెలంగాణకు 77 టీఎంసీలే కేటాయించారని పేర్కొంది. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ల ముందు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించే వెసులుబాటు కలగని దృష్ట్యా.. తమ కు ఇప్పుడు అవకాశం కల్పించాలని సుప్రీంను కోరింది. గతంలోనే కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపులకై విజ్ఞప్తి చేసినా, ట్రిబ్యునల్ పట్టించుకోని దృష్ట్యా... ఇప్పుడు పునఃసమీక్ష చేయాలని అభ్యర్థించనుంది. స్థూలంగా మిగులు జలాలు, నికర జలాలు కలుపుకొని మొత్తంగా మరో 400 టీఎంసీల మేర కేటాయింపులు కోరేలా అధికారులు వాదనలు సిద్ధం చేశారు. -
షెడ్యూల్ 10 సంస్థలన్నీ తెలంగాణవే..
-
షెడ్యూల్ 10 సంస్థలన్నీ తెలంగాణవే అంటున్న టీ సర్కారు
ఆంధ్రా ఉద్యోగుల్ని రిలీవ్ చేసేందుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో గల సంస్థలపై వివాదం రాజుకుంది. ఉన్నత విద్యా మండలి తెలంగాణకే చెందుతుందని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో పదో షెడ్యూల్లోని రాజధానిలో గల సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. విభజన చట్టంలో రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి ఏడాదిలోగా ఇరు రాష్ట్రాలు 10వ షెడ్యూల్లో సంస్థల నుంచి సేవలు పొందేందుకు ఒప్పందాలు చేసుకోవాలని ఉంది. ఏడాది గడిచిపోయినా సంస్థల విషయంలో ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీంతో 10వ షెడ్యూల్లో రాజధానిలో గల సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆ సంస్థల్లో రాజధానిలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జాతీయ నిర్మాణ సంస్థ (న్యాక్)లో గల ఆంధ్రాకు చెందిన అధికారులందరినీ ఏపీకి బదిలీ చేసింది. మరిన్ని సంస్థల్లో ఉన్న వారినీ రిలీవ్ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ సర్కారు రిలీవ్ చేసినా, తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చినా ఆ సమాచారాన్ని రాష్ట్ర పునర్విభజన విభాగానికి తెలియజేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కోరింది. సచివాలయంలోని ఎల్ బ్లాక్ కింద ఫ్లోర్లో గల రాష్ట్ర పునర్విభజన విభాగానికి ఆ సమాచారాన్ని పోస్టు ద్వారా గానీ లేదా secretarysrap@gmail.com మెయిల్ ద్వారా తెలియజేయాల్సిందిగా ఆ విభాగం కార్యదర్శి ఎల్. ప్రేమచంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. -
ఏ రాష్ట్రానికీ కానివారైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు
10 రోజుల జీతాన్నే చెల్లించనున్న టీ సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీవైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ కానివారయ్యారు. జూన్ నెలకు సంబంధించిన జీత భత్యాలను ఏ రాష్ట్రం నుంచి పొందాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 1,251 మంది ఏపీ ఉద్యోగులను ఈ నెల 9, 10 తేదీల్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగులు ఈ నెలలో పనిచేసిన 10 రోజుల కాలానికి సంబంధించిన జీతభత్యాలను మాత్రమే జూలై నెలలో చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. రిలీవ్ ఆర్డర్లు జారీ చేయకముందే ఏపీ ఉద్యోగులు కోర్టుకు వెళ్లడం వల్ల మళ్లీ వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం సైతం ఈ ఉద్యోగులను విధుల్లో తీసుకోవడంలో విముఖత చూపింది. తెలంగాణ విద్యుత్ సంస్థల విభజన మార్గదర్శకాలు, రిలీవ్ ఉత్తర్వులను హైకోర్టు సింగిల్‌బెంచ్ నిలుపుదల చేసింది. ఈ నిర్ణయంపై డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. మళ్లీ ఈ అంశంపై హైకోర్టులో ఓ నిర్ణయం వెల్లడైతేనే ఏపీ ఉద్యోగుల భవితవ్యం తేలే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడం, దానిపై ఏపీ ఉద్యోగులు, ప్రభుత్వం కౌంటర్ వేయడం, నిర్ణయం వచ్చే సరికి ఏపీ ఉద్యోగులు జూలై నెల జీతాన్ని సైతం కోల్పోయే ప్రమాదముంది. -
ట్యాపింగ్‌పై కేంద్రానికి ఏపీ ఫిర్యాదు?
హోం శాఖ కార్యదర్శితో సీఎస్ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో భేటీ అయ్యారు. టీ సర్కార్ ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సెక్షన్ -8 ను అమలు చేయాలని, గవర్నర్‌కు అధికారాలివ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రజాప్రతినిధుల స్వేచ్ఛకు భంగం కలిగేలా టీ సర్కా ర్ వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనికి గోయల్ హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య ఉన్నట్టు ఫిర్యాదులు, నివేదికలేవీ? సెక్షన్-8ను ఎందుకు అమలు చేయాలి? అని ప్రశ్నించినట్టు సమాచారం. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలపైనా సీఎస్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు టెలికం కమిషన్ చైర్మన్, కార్యదర్శి రాకేష్ గర్గ్‌లతో భేటీ అయిన సీఎస్.. ట్యాపింగ్‌పై ఆధారాల్ని అందజేసినట్టు సమాచారం. విలేకరులపై సుజనా అసహనం ‘వాట్ ఏసీబీ..? తెలంగాణ, ఆంధ్రాలో ఏం సమస్య ఉంది? నాకు తెలియదు’ అంటూ కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి విలేకరులపై అసహనం వ్యక్తం చేశారు. నగరంలో గురువారం ఉదయం ‘వాతావరణ మార్పు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సు సందర్భంగా ఓటుకు కోట్లు కేసు, ఏసీబీ దర్యాప్తుకు సంబంధించి సుజనా చౌదరిపై విలేకరులు ప్రశ్నించగా జవాబు చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేశారు. -
కొమురం భీం వారసుడికి రూ.10 లక్షలు
హైదరాబాద్: ఆదిలాబాద్ గిరిజన ఉద్యమకారుడు కొమురం భీం వారసుడు సోనేరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. గతేడాది అక్టోబరులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో కొమురం భీం వర్ధంతి కార్యక్రమానికి హజరై ఈ మేరకు హామీ ఇచ్చారు. అక్కడ ఆ గిరిజన వీరుడి స్మారక మ్యూజియంతోపాటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు రూ.25 కోట్ల మేర ప్రత్యేక ప్రాజెక్టును కూడా ప్రకటించారు. ఈ నిర్మాణానికి సంబంధించి రూ.18.75 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధుల నుంచి సోనేరావు కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాల్సిందిగా ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
మళ్లీ పెళ్లి చేసుకోలేదని సర్టిఫికెట్ ఇస్తేనే వితంతు పింఛన్
సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుకు జీవో సాక్షి, హైదరాబాద్: వితంతువులు పింఛను పొందాలంటే ఇకపై ప్రతియేటా వారు తాము మళ్లీ వివాహం చేసుకోలేదని సర్టిఫికెట్‌ను సమర్పించాలి. భర్త మరణం, పునర్వివాహం గురించి గ్రామకార్యదర్శులు ధ్రువీకరించినా సరిపోతుంది. 18 ఏళ్ల పైబడిన, 45ఏళ్లలోపు వితంతువులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం జారీ చేసిన జీవోలో పేర్కొంది. సామాజిక భద్రతా పింఛన్ల పథకానికి ‘ఆసరా’ పేరును ఖరారు చేంది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, హెచ్ఐవీ-ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పింఛను అర్హత విధివిధానాలను జీవోలో పేర్కొంది. పింఛన్ పొందాలంటే: 65 ఏళ్లు దాటిన వారే వృద్ధాప్య పింఛనుకు అర్హులు. వయసును నిర్ధారించే ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ధ్రువపత్రం లేనట్లయితే వారి పిల్లల వయసును బట్టి వెరిఫికేషన్ అధికారి నిర్ణయిస్తారు. అవసరమైతే వయసు నిర్ధారణ కోసం మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తారు. 50 ఏళ్లు దాటిన చేనేత పనివారూ పింఛన్‌కు అర్హులు. 50 ఏళ్లు దాటిన గీత కార్మికులు తప్పనిసరిగా గీత కార్మికుల సహకార సంఘంలో సభ్యుడిగా నమోదై ఉండాలి. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు పింఛన్లు పొందేందుకు మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. వికలాంగులకు వయసుతో నిమిత్తం లేదు. 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారే పింఛన్‌కు అర్హులు. చెవిటి వారైతే 51శాతం వైకల్యం ఉండాలి. వీరికి పింఛను రాదు: మూడెకరాల కంటే ఎక్కువ తరి, 7.5ఎకరాల కన్నా ఎక్కువ మెట్ట భూమి ఉన్న వాళ్లు అర్హులు కాదు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, కాంట్రాక్టు, ఔట్ సోర్పింగ్ కింద తమ పిల్లలు పనిచేస్తున్నా పింఛన్ పొందేందుకు అనర్హులే. ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, పెట్రోలు బంకులు, రిగ్ఓనర్లు, దుకాణాల యజమానులు అనర్హులు.ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులకు పింఛన్ రాదు. కారు, హెవీ మోటార్ వెహికల్స్ ఉన్న వారు కూడా అనర్హులే. వీరిని పరిగణనలోకి తీసుకుంటారు.. ఆదివాసీలు, సంపాదనాపరులు లేని కుటుంబ మహిళలు, వికలాంగులున్న కుటుంబాలు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, రిక్షా కార్మికులు, పేపర్లు ఏరుకునే వారు.. తదితర కేటగిరీ వారు, ఇల్లులేని వితంతువులు, సామాజిక మద్ధతు లేని వారు పింఛన్ పొందేందుకు అర్హులే. పింఛన్ కోసం సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి గ్రామ పంచాయితీ/మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే, అధికారులు పరిశీలించి పింఛన మంజూరకు సిఫార్సు చేస్తారు. షెడ్యూలు ఇలా: ప్రతినెల 1నుంచి 7వ తేదీవరకు పింఛన్లు పంపిణీ చేస్తారు. 9న పింఛనుదారు సంతకం ఉన్న అక్విటెన్స్ ఎంపీడీవోలకు పంపాలి. పంపిణీ కాని పింఛను సొమ్మును అదేరోజున స్టేట్నోడల్ ఖాతాకు జమ చేయాలి. 16నుంచి 21వరకు తర్వాత నెలకు అక్విటెన్స్ల జనరేషన్ చేయాలి. 22, 23 తేదీల్లో కలెక్టరు నుంచి అనుమతి ఉత్తర్వులు, అదే రోజున డీఆర్డీఏ పీడీలకు నిధుల బదిలీ, 23,24 తేదీల్లో నిధుల బదిలీకి సెర్ప్ అనుమతి, 25నపింఛన్ల పంపిణీ ఏజన్సీలకు నిధుల బదిలీ జరిగేలా షెడ్యూలును రూపొందించారు.