టీసర్కార్‌కు కేంద్రం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మినహా అన్ని గ్రూప్స్ (గ్రూప్-2, 3, 4) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల (డీవోపీటీ) శాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. డీవోపీటీ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కోతన్ రాసిన లేఖ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందింది. స్వాతంత్య్రదిన వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూనియర్ లెవల్ అధికారి పోస్టులకు ఇంటర్వ్యూలను నిలిపివేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జూనియర్ లెవల్ పోస్టులకు ఎక్కడైనా ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటే నిలిపివేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని డీవోపీటీ తన లేఖలో పేర్కొంది. అవినీతిని నిరోధించేందుకు, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు, నిరుపేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఇబ్బందులను దూరం చేసేందుకే ఈ చర్యను చేపట్టాల్సిందిగా ప్రధాని ఆదేశించారని తెలిపింది.
మెరిట్ ఆధారంగానే ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రధాని స్పష్టం చేశారని వివరించింది. జూనియర్ లెవల్ ఆఫీసర్ పోస్టులను గుర్తించి వాటి భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని తొలగించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 స్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటే రద్దు చేయాలని.. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది.
గ్రూప్-2కు రద్దు చేయాల్సిందే: ప్రస్తుతం రాష్ట్రంలో గ్రూప్-3, గ్రూప్-4, నాన్‌గెజిటెడ్ పోస్టులకు ఇంటర్వ్యూలు లేవు. గ్రూప్-1, గ్రూప్-2, గెజిటెడ్ అధికారి పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూల విధానం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండగా, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను కొనసాగించి, ఇంటర్వ్యూ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది.
గ్రూప్-2లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3గా మార్చింది, వీటికి ఇంటర్వ్యూలు లేవు. అయితే తాజాగా కేంద్ర ఆదేశాల నేపథ్యంలో గ్రూప్-2 పోస్టులకు కూడా ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాల్సి ఉంది. ప్రస్తుతం గ్రూప్-2లో నాలుగు పేపర్లకు (ఒక్కోటి 150 మార్కుల చొప్పున) 600 మార్కులు, మరో 75 మార్కులకు ఇంటర్వ్యూ లు ఉండేలా ఇటీవలే పరీక్షల విధానాన్ని ప్రకటించిం ది. కానీ కేంద్ర ఆదేశాల నేపథ్యంలో ఇంటర్వ్యూలను రద్దు చేసి... 600 మార్కులకు రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీఎస్‌పీఎస్సీ వర్గాలు దీనిపై తమకు సమాచారం అందలేదని పేర్కొన్నాయి.
గ్రూప్-2 ఇంటర్వ్యూలు రద్దు!
Published Tue, Sep 15 2015 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement