సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ’’. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు జపిస్తున్న మంత్రం ఇదే. తమకు అధికారం కట్టబెడితే ఫలానా గడువులోగా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామంటున్నాయి. ఇప్పటికే ఆయాపార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాయి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు పరిమిత సంఖ్యలోనే ఉన్నా, వాటిని సాధించేందుకు కసరత్తు చేస్తున్న అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్‌లో ఉద్యోగాల కోసం వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 25 లక్షలు. ఇక తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌ఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) పరిధిలో రిజిస్ట్రేషన్లు కలుపుకుంటే అభ్యర్థుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విభాగంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్. దీంతో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు నమోదు చేసుకున్న వారే కావడంతో ఎన్నికల్లో వీరి తీర్పు కీలకం కానుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
ఒక్కో సెగ్మెంట్‌లో 21 వేలకు పైమాటే..
రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఒక్కో నియోజకవర్గంలో సగటున 21 వేల మంది ఉద్యోగాలర్థులున్నట్లు అంచనా. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో స్పష్టత ఇస్తే వారి ఓట్లన్నీ పడతాయనే భావనతో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రచారస్త్రంగా మలుచుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ కేలండర్‌ను ప్రకటించి ముమ్మరంగా ప్రచారం చేస్తోంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే 1.63 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మిగిలిన ఖాళీల భర్తీకోసం మరోసారి అధికారంలోకి రాగానే జాబ్ కేలండర్ ప్రకటిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఇక బీజేపీ సైతం ఉద్యోగ ఖాళీల భర్తీ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చింది.
దీనితోపాటు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ, సీపీఎం, బీఎస్పీ సైతం మేనిఫెస్టోలో ప్రభుత్వ కొలువుల అంశాలను ప్రస్తావించాయి. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. దీంతో ఈ దఫా వీరంతా ఎవరికి ఓటేస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment