ఆంధ్రా ఉద్యోగుల్ని రిలీవ్ చేసేందుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో గల సంస్థలపై వివాదం రాజుకుంది. ఉన్నత విద్యా మండలి తెలంగాణకే చెందుతుందని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో పదో షెడ్యూల్‌లోని రాజధానిలో గల సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. విభజన చట్టంలో రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి ఏడాదిలోగా ఇరు రాష్ట్రాలు 10వ షెడ్యూల్‌లో సంస్థల నుంచి సేవలు పొందేందుకు ఒప్పందాలు చేసుకోవాలని ఉంది.
ఏడాది గడిచిపోయినా సంస్థల విషయంలో ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీంతో 10వ షెడ్యూల్‌లో రాజధానిలో గల సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆ సంస్థల్లో రాజధానిలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జాతీయ నిర్మాణ సంస్థ (న్యాక్)లో గల ఆంధ్రాకు చెందిన అధికారులందరినీ ఏపీకి బదిలీ చేసింది. మరిన్ని సంస్థల్లో ఉన్న వారినీ రిలీవ్ చేసేందుకు చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో ఆయా సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ సర్కారు రిలీవ్ చేసినా, తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చినా ఆ సమాచారాన్ని రాష్ట్ర పునర్విభజన విభాగానికి తెలియజేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కోరింది. సచివాలయంలోని ఎల్ బ్లాక్ కింద ఫ్లోర్‌లో గల రాష్ట్ర పునర్విభజన విభాగానికి ఆ సమాచారాన్ని పోస్టు ద్వారా గానీ లేదా secretarysrap@gmail.com మెయిల్ ద్వారా తెలియజేయాల్సిందిగా ఆ విభాగం కార్యదర్శి ఎల్. ప్రేమచంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
షెడ్యూల్ 10 సంస్థలన్నీ తెలంగాణవే అంటున్న టీ సర్కారు
Published Sat, Jul 4 2015 3:54 AM | Last Updated on Sat, Jun 2 2018 7:11 PM
Advertisement