మళ్లీ పెళ్లి చేసుకోలేదని సర్టిఫికెట్ ఇస్తేనే వితంతు పింఛన్ | T government issues GO on Widows pension | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి చేసుకోలేదని సర్టిఫికెట్ ఇస్తేనే వితంతు పింఛన్

Published Thu, Nov 6 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

T government issues GO on Widows pension

 సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుకు జీవో
 
 సాక్షి, హైదరాబాద్: వితంతువులు పింఛను పొందాలంటే ఇకపై ప్రతియేటా వారు తాము మళ్లీ వివాహం చేసుకోలేదని సర్టిఫికెట్‌ను సమర్పించాలి. భర్త మరణం, పునర్వివాహం గురించి గ్రామకార్యదర్శులు ధ్రువీకరించినా సరిపోతుంది. 18 ఏళ్ల పైబడిన, 45ఏళ్లలోపు వితంతువులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం జారీ చేసిన జీవోలో పేర్కొంది. సామాజిక భద్రతా పింఛన్ల పథకానికి ‘ఆసరా’ పేరును ఖరారు చేంది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ-ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పింఛను అర్హత విధివిధానాలను జీవోలో పేర్కొంది.
 
 పింఛన్ పొందాలంటే: 65 ఏళ్లు దాటిన వారే వృద్ధాప్య పింఛనుకు అర్హులు. వయసును నిర్ధారించే ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ధ్రువపత్రం లేనట్లయితే వారి పిల్లల వయసును బట్టి వెరిఫికేషన్ అధికారి నిర్ణయిస్తారు. అవసరమైతే వయసు నిర్ధారణ కోసం మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తారు. 50 ఏళ్లు దాటిన చేనేత పనివారూ పింఛన్‌కు అర్హులు. 50 ఏళ్లు దాటిన గీత కార్మికులు తప్పనిసరిగా గీత కార్మికుల సహకార సంఘంలో సభ్యుడిగా నమోదై ఉండాలి. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు పింఛన్లు పొందేందుకు మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. వికలాంగులకు వయసుతో నిమిత్తం లేదు. 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారే పింఛన్‌కు అర్హులు. చెవిటి వారైతే 51శాతం వైకల్యం ఉండాలి.
 
 వీరికి పింఛను రాదు: మూడెకరాల కంటే ఎక్కువ తరి, 7.5ఎకరాల కన్నా ఎక్కువ మెట్ట భూమి ఉన్న వాళ్లు అర్హులు కాదు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, కాంట్రాక్టు, ఔట్ సోర్పింగ్ కింద తమ పిల్లలు పనిచేస్తున్నా పింఛన్ పొందేందుకు అనర్హులే. ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, పెట్రోలు బంకులు, రిగ్‌ఓనర్లు, దుకాణాల యజమానులు అనర్హులు.ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులకు పింఛన్ రాదు. కారు, హెవీ మోటార్ వెహికల్స్ ఉన్న వారు కూడా అనర్హులే.
 
 
 వీరిని పరిగణనలోకి తీసుకుంటారు..
 
 ఆదివాసీలు, సంపాదనాపరులు లేని కుటుంబ మహిళలు, వికలాంగులున్న కుటుంబాలు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, రిక్షా కార్మికులు, పేపర్లు ఏరుకునే వారు.. తదితర కేటగిరీ వారు, ఇల్లులేని వితంతువులు, సామాజిక మద్ధతు లేని వారు పింఛన్ పొందేందుకు అర్హులే. పింఛన్ కోసం సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి గ్రామ పంచాయితీ/మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే, అధికారులు పరిశీలించి పింఛన మంజూరకు సిఫార్సు చేస్తారు.
 
 షెడ్యూలు ఇలా: ప్రతినెల 1నుంచి 7వ తేదీవరకు పింఛన్లు పంపిణీ చేస్తారు. 9న పింఛనుదారు సంతకం ఉన్న అక్విటెన్స్ ఎంపీడీవోలకు పంపాలి. పంపిణీ కాని పింఛను సొమ్మును అదేరోజున స్టేట్‌నోడల్ ఖాతాకు జమ చేయాలి. 16నుంచి 21వరకు తర్వాత నెలకు అక్విటెన్స్‌ల జనరేషన్  చేయాలి. 22, 23 తేదీల్లో కలెక్టరు నుంచి అనుమతి ఉత్తర్వులు, అదే రోజున డీఆర్‌డీఏ పీడీలకు నిధుల బదిలీ, 23,24 తేదీల్లో నిధుల బదిలీకి సెర్ప్ అనుమతి, 25నపింఛన్ల పంపిణీ ఏజన్సీలకు నిధుల బదిలీ జరిగేలా షెడ్యూలును రూపొందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement