న్యూఢిల్లీ: కరోనా ‘లాక్‌డౌన్’ నేపథ్యంలో వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు 3 నెలల పింఛను ముందుగానే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ సామాజిక చేయూత పథకం(ఎన్‌ఎస్‌ఏపీ) కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోని సుమారు 2.98 కోట్ల మంది పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ పింఛను పంపిణీ చేస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏప్రిల్ మొదటి వారంలో మూడు నెలల పింఛను మొత్తాన్ని ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఎన్‌ఎస్‌ఏపీ కింద 60–79 ఏళ్ల సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.200 చొప్పున, 80 ఆపైన వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. 79 ఏళ్ల వ రకు ఉన్న దివ్యాంగులకైతే రూ.300, 80 ఆపై వ యస్సు వారికి రూ.500, వితంతువులు 40–79 ఏళ్ల వారికి రూ.300, 80 ఆపై వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. దీంతోపాటు కరోనా ప్యాకేజీ కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదనంగా రెండు విడతల్లో కలిపి రూ.1,000 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment