Widows pension
-
వైఎస్సార్ పెన్షన్ కానుక.. అవ్వా తాతలకు పండగ
సాక్షి, అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం 62.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1590.50 కోట్లు విడుదల చేసింది. ఉదయం 8 గంటల వరకు 31.84 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. చదవండి: ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు సూర్యోదయానికి ముందే.. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా అయిదో తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తోంది. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వీళ్లు ఎవ్వరూ ఇంటి గడప దాటకుండానే పింఛన్లు అందుకుంటున్నారు. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి ₹1,590.50 కోట్లు పంపిణీ చేస్తోంది. గత ఏడేళ్లలో ప్రతి సెప్టెంబర్ నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఖర్చు చేసిన మొత్తం వివరాలివి... సంవత్సరం పంపిణీ చేసిన మొత్తం సెప్టెంబర్ 2022 ₹1,590.50 కోట్లు సెప్టెంబర్ 2021 ₹1,397 కోట్లు సెప్టెంబర్ 2020 ₹1,429 కోట్లు సెప్టెంబర్ 2019 ₹1,235 కోట్లు సెప్టెంబర్ 2018 ₹477 కోట్లు సెప్టెంబర్ 2017 ₹418 కోట్లు సెప్టెంబర్ 2016 ₹396 కోట్లు సెప్టెంబర్ 2015 ₹405 కోట్లు -
Hyderabad: మహిళ పట్ల ఆర్ఐ అసభ్య ప్రవర్తన..ఒంటరిగా రా ఇస్తాననడంతో
సాక్షి, హైదరాబాద్: మంజూరైన వితంతు పింఛన్ కార్డును ఇవ్వాలని ఆర్ఐని అడగగా జాప్యం చేస్తూ ఒంటరిగా రా ఇస్తానని చెప్పడంతో ఈ విషయాన్ని సదరు మహిళ బంధువులకు చెప్పడంతో వారొచ్చి ఆర్ఐని తహసీల్దార్ సమక్షంలోనే చితకబాదిన ఘటన కలకలం రేపింది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌లో ఉంటున్న మైనార్టీ మహిళ(28), వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. తనకు మంజూరైన కార్డు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆర్ఐ విజయ్‌నాయక్‌ను అడిగింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదని, రోజు ఇబ్బంది పెటొద్దు ప్రేమతో అడిగి తీసుకోవాలంటూ ఆర్ఐ నాలుగైదు రోజులుగా ఇదే సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మరోసారి సదరు మహిళ ఫించన్ కార్డు కోసం కార్యాలయానికి వచ్చి విజయ్‌నాయక్‌ను కార్డు అడిగింది. మళ్లీ అతడు అదే సమాధానం ఇచ్చాడని కుటుంబ సభ్యులతో పాటు బస్తీ వాసులకు తెలిపింది. కాసేపటి తర్వాత కార్యాలయానికి వచ్చిన వారు తహసీల్దార్ అయ్యప్ప సమక్షంలోనే విజయ్‌నాయక్‌పై దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన తహసీల్దార్‌ను సైతం నెట్టివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది. ఫించన్ మంజూరైంది ఇంకా కార్డు రాలేదని రాగానే ఇస్తానన్నాను.. తప్ప ఒంటరిగా రా అనలేదని ఆర్ఐ విజయ్‌నాయక్ చెప్పుకొచ్చారు. కార్డు ఇవ్వడం ఆలస్యమైనందుకే బంధువులు, స్థానికులతో వచ్చి తనపై దాడి చేశారని ఆర్ఐ పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఇరువురు గాంధీనగర్ పోలీస్ పరస్పర ఫిర్యాదు చేసినట్లు సీఐ మోహన్‌రావు తెలిపారు. -
ముందుగానే 3 నెలల పింఛను
న్యూఢిల్లీ: కరోనా ‘లాక్డౌన్’ నేపథ్యంలో వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు 3 నెలల పింఛను ముందుగానే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ సామాజిక చేయూత పథకం(ఎన్ఎస్ఏపీ) కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోని సుమారు 2.98 కోట్ల మంది పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ పింఛను పంపిణీ చేస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏప్రిల్ మొదటి వారంలో మూడు నెలల పింఛను మొత్తాన్ని ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఎన్ఎస్ఏపీ కింద 60–79 ఏళ్ల సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.200 చొప్పున, 80 ఆపైన వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. 79 ఏళ్ల వ రకు ఉన్న దివ్యాంగులకైతే రూ.300, 80 ఆపై వ యస్సు వారికి రూ.500, వితంతువులు 40–79 ఏళ్ల వారికి రూ.300, 80 ఆపై వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. దీంతోపాటు కరోనా ప్యాకేజీ కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదనంగా రెండు విడతల్లో కలిపి రూ.1,000 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
పల్లెల్లో పచ్చ చిచ్చు..
సాక్షి, అమరావతి : పట్టుగొమ్మల్లాంటి పల్లెలను పచ్చ నాగులు చెరబట్టాయి..జన్మభూమి కమిటీల పేరిట బుసలు కొట్టాయి..ప్రతి పనికి, పథకానికి పైసలడుగుతూరాజకీయం చేశాయి.. కాళ్లు లేవన్నా కనికరించలేదు..ఇల్లు లేదన్నా దయ చూపలేదు..ముసలోళ్లమయ్యా.. ఆదుకోమన్నా వారి మనసు కరగలేదు..తమవారైతే మాత్రం అనర్హులైనా లబ్ధి చేకూర్చాయి..స్వచ్ఛమైన పల్లె మనుషుల మధ్య చిచ్చురేపి సొంత జేబులు నింపుకొని దర్జా ఒలకబోస్తున్నాయి.. అసలైన భారత దేశం పల్లెల్లోనే ఉందన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. అలాంటి గ్రామ సీమల్లో విద్వేషాగ్ని రగిల్చాయి జన్మభూమి కమిటీలు. వీటి పేరిట విభేదాలను రెచ్చగొట్టి, పల్లెలను చీల్చి సంక్షేమానికి తూట్లు పొడిచింది చంద్రబాబు సర్కారు. రాజ్యాంగం ప్రకారం సర్పంచులు తదితర స్థానిక ప్రజాప్రతినిధులకు దక్కిన అధికారాలకు కత్తెర వేసి నచ్చినట్లు పాలన సాగేలా పక్కదారి పట్టించారు. ఈ ఐదేళ్ల పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలతో పేదలు, వృద్ధులు, బలహీన వర్గాలకు పలు ప్రయోజనాలు దూరమయ్యాయి. తమ పార్టీ కాకుంటే వివక్ష చూపుతూ, నచ్చినవారికి అర్హత లేకున్నా లబ్ధి చేకూరుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మరోవైపు జన్మభూమి కమిటీ సభ్యులు ప్రభుత్వ పథకాలను అడ్డుగా పెట్టుకుని లక్షలాది రూపాయిలు అక్రమంగా సంపాదించారు. ఈ నాలుగేళ్లలోనే లక్షాధికారులైన టీడీపీ నాయకులు పల్లెల్లో లెక్కలేనంత మంది ఉన్నారు. అంతా ‘పచ్చ’పాతమే ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అంటూ గత ఆరు నెలల్లో ఢిల్లీలో చంద్రబాబు తెగ హడావుడి చేశారు. అయితే, రాష్ట్రంలో మాత్రం... గ్రామాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పంచాయతీల అధికారాలను తొక్కిపెట్టారు. ఓవైపు సర్పంచుల అధికారాలను హరిస్తూ, మరోవైపు జన్మభూమి కమిటీలంటూ రాజ్యాంగేతర శక్తులను సృష్టించారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు సంక్రమించిన అధికారాలను హరించారు. పూర్తిగా టీడీపీ కార్యకర్తలు, నేతలతో నిండిపోయిన ఈ కమిటీలు గత ఐదేళ్లలో తమదే రాజ్యం అన్నట్లు చెలరేగిపోయాయి. పేదలు ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నా వీటి దయాదాక్షిణ్యం ఉంటేనే లబ్ధిదారుల ఎంపిక జరిగేది. రేషన్ కార్డు, ఇల్లు, ఇళ్ల స్థలాలు, మంచినీటి కనెక్షన్, పింఛన్ ఇలా ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఎవరు లంచమిస్తే వారిని లబ్ధిదారు జాబితాలో చేర్చాలని సిఫార్సు చేశారు. ఆ కమిటీలు సిఫార్సు చేసినవారి పేర్లనే జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపేవారు. చిత్రమేమంటే... పథకాల కోసం సొంత పార్టీకి చెందినవారూ లంచమిచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇతర పార్టీల్లోని అర్హులకు మొండిచేయి గ్రామాల్లో ఎవరు ఏ పార్టీకి చెందినవారో సులువుగానే తెలిసిపోతుంది. దీంతో ఇతర పార్టీల వారిలో అర్హులున్నా రేషన్ కార్డు, పింఛన్, ఇళ్లు మంజూరు చేయలేదు. గ్రామ సర్పంచ్ల అధికారాలను జన్మభూమి కమిటీలకు అప్పగించడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్లు వేయాలన్నా, వీధి లైట్లు మార్చాలన్నా జన్మభూమి కమిటీలు చెబితేనే సాధ్యమయ్యేది. ఏ రోడ్డు వేయాలో, ఏది వేయకూడదో అవే నిర్ణయిస్తాయి. ఇళ్ల మంజూరుకు ఒక్కోచోట రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ముడుపులు తీసుకున్నారు. పంచాయతీల నిధులు మళ్లింపు గ్రామ సమస్యలపై ప్రజలెన్నుకున్న సర్పంచి ఆధ్వర్యంలోని పంచాయతీ నిర్ణయం తీసుకుని పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తోంది. చంద్రబాబు సర్కారు ఆ నిధుల ఖర్చుపై ఆంక్షలు పెట్టి, వాటిని ఇష్టానుసారం మళ్లించింది. గ్రామ పంచాయతీలకిచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు వాటి సూచనల మేరకు ఖర్చు చేయాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను చంద్రన్న బాటకు మళ్లించారు. పంచాయతీలకు ఏటా కేంద్రం రూ.1,400 కోట్లపైనే నిధులిచ్చినా వీటిలో మూడో వంతు దారి మళ్లాయి. ఉపాధి హామీలో భాగంగా గ్రామంలో చేపట్టే పనులు పంచాయతీ తీర్మానం మేరకు జరగాలి. కానీ, జన్మభూమి కమిటీలు సూచించే వాటినే ఇందులో చేపట్టారు. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణకు 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుపెట్టాలి. అయితే, గోదావరి, కృష్ణా పుష్కరాల కోసం గ్రామ పంచాయతీలకు చెందిన రూ.54 కోట్లను మళ్లించారు. ఒకే ఊరు..భిన్న న్యాయం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కూర్మాయిగ్రామానికి చెందిన చిన్న నారాయణమ్మ, రాధమ్మ ఇద్దరూ వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ జాబితా సంబంధిత జిల్లా మంత్రి కార్యాలయం నుంచి గ్రామ జన్మభూమి కమిటీకి చేరింది. చిన్న నారాయణమ్మ వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు. దీంతో ఆమెకు పొలం లేకున్నా.. ఐదెకరాలు ఉందంటూ ఆమె పింఛనుకు అనర్హురాలంటూ జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడ్డారు. రాధమ్మ కుటుంబం టీడీపీకి అనుకూలం కావడంతో ఐదెకరాల పొలం ఉన్నప్పటికీ జన్మభూమి కమిటీ సభ్యులు ఆమెను పింఛనుకు అర్హురాలిగా సిఫార్సు చేశారు. రాధమ్మకు ఇప్పుడు పింఛను వస్తోంది. టీడీపీకి ఓటేస్తామంటేనే ఇళ్లిస్తానన్నారు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ నా కుమారుడు పిసిని రామునాయుడు రెండుసార్లు దరఖాస్తు చేశాడు. జన్మభూమి కమిటీ సభ్యులు మొదట మాకు ఇల్లు తప్పకుండా వస్తుందని చెప్పారు. తర్వాత మాట మార్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని, అలాగైతేనే ఇల్లు మంజూరు చేస్తామని షరతు విధించారు. దానికి మేం ససేమిరా అంగీకరించలేదు. దీంతో మాకు ఇల్లు రాలేదు. చివరకు మీరివ్వక పోతే పోనీ... వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కట్టుకుంటాం అని తేల్చి చెప్పాం. –పిసిని సత్యం, గొల్లలపాలెం ఆత్మహత్యాయత్నం చేసినా... మేం దివ్యాంగులం. పింఛను కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లు తిరిగితిరిగి విసిగిపోయాం. గ్రామస్తులంతా మమ్మల్ని చూసి జాలిపడేవారు. జన్మభూమి కమిటీలు మాత్రం మానవత్వం లేకుండా ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులమంటూ నరకం చూపాయి. పేదలు, అర్హులకు అందాల్సిన పథకాలకు ఆ కమిటీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం ఏమిటనే ఆవేదనతో మా బాధను చాటేందుకు ఎంపీడీవో కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాం. స్థానికులు స్పందించి కాపాడారు. అయినా జన్మభూమి కమిటీల ఒత్తిడితో మాకు పింఛను మంజూరు చేయలేదు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసినా స్పందన కరవైంది. చివరికి నాలుగు నెలల క్రితం పింఛను వచ్చింది. – ఐతిరెడ్డి శ్రీను, వియ్యపు సోమునాయుడు, పెదపూడి కాళ్లు చచ్చుబడినా కనికరం చూపలేదు నాకు 70 ఏళ్లపైనే ఉంటాయి. నిరుపేద కుటుంబం. పక్షవాతంతో రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. దివ్యాంగుడినని చెప్పే ‘సదరం’ ధ్రువపత్రం కూడా ఉంది. దీనిని చూపుతూ పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నా. అయితే, గ్రామ జన్మభూమి కమిటీ ఏ మాత్రం పట్టించుకోలేదు. వారు ఆమోదం తెలిపితేనే దరఖాస్తు ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. చివరకు నా దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యాయి. ఇప్పటికీ పింఛన్ రావడం లేదు. – తుమ్మటి కృష్ణమూర్తి, ఎం.అగ్రహారం -
మళ్లీ పెళ్లి చేసుకోలేదని సర్టిఫికెట్ ఇస్తేనే వితంతు పింఛన్
సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుకు జీవో సాక్షి, హైదరాబాద్: వితంతువులు పింఛను పొందాలంటే ఇకపై ప్రతియేటా వారు తాము మళ్లీ వివాహం చేసుకోలేదని సర్టిఫికెట్‌ను సమర్పించాలి. భర్త మరణం, పునర్వివాహం గురించి గ్రామకార్యదర్శులు ధ్రువీకరించినా సరిపోతుంది. 18 ఏళ్ల పైబడిన, 45ఏళ్లలోపు వితంతువులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం జారీ చేసిన జీవోలో పేర్కొంది. సామాజిక భద్రతా పింఛన్ల పథకానికి ‘ఆసరా’ పేరును ఖరారు చేంది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, హెచ్ఐవీ-ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పింఛను అర్హత విధివిధానాలను జీవోలో పేర్కొంది. పింఛన్ పొందాలంటే: 65 ఏళ్లు దాటిన వారే వృద్ధాప్య పింఛనుకు అర్హులు. వయసును నిర్ధారించే ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ధ్రువపత్రం లేనట్లయితే వారి పిల్లల వయసును బట్టి వెరిఫికేషన్ అధికారి నిర్ణయిస్తారు. అవసరమైతే వయసు నిర్ధారణ కోసం మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తారు. 50 ఏళ్లు దాటిన చేనేత పనివారూ పింఛన్‌కు అర్హులు. 50 ఏళ్లు దాటిన గీత కార్మికులు తప్పనిసరిగా గీత కార్మికుల సహకార సంఘంలో సభ్యుడిగా నమోదై ఉండాలి. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు పింఛన్లు పొందేందుకు మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. వికలాంగులకు వయసుతో నిమిత్తం లేదు. 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారే పింఛన్‌కు అర్హులు. చెవిటి వారైతే 51శాతం వైకల్యం ఉండాలి. వీరికి పింఛను రాదు: మూడెకరాల కంటే ఎక్కువ తరి, 7.5ఎకరాల కన్నా ఎక్కువ మెట్ట భూమి ఉన్న వాళ్లు అర్హులు కాదు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, కాంట్రాక్టు, ఔట్ సోర్పింగ్ కింద తమ పిల్లలు పనిచేస్తున్నా పింఛన్ పొందేందుకు అనర్హులే. ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, పెట్రోలు బంకులు, రిగ్ఓనర్లు, దుకాణాల యజమానులు అనర్హులు.ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులకు పింఛన్ రాదు. కారు, హెవీ మోటార్ వెహికల్స్ ఉన్న వారు కూడా అనర్హులే. వీరిని పరిగణనలోకి తీసుకుంటారు.. ఆదివాసీలు, సంపాదనాపరులు లేని కుటుంబ మహిళలు, వికలాంగులున్న కుటుంబాలు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, రిక్షా కార్మికులు, పేపర్లు ఏరుకునే వారు.. తదితర కేటగిరీ వారు, ఇల్లులేని వితంతువులు, సామాజిక మద్ధతు లేని వారు పింఛన్ పొందేందుకు అర్హులే. పింఛన్ కోసం సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి గ్రామ పంచాయితీ/మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే, అధికారులు పరిశీలించి పింఛన మంజూరకు సిఫార్సు చేస్తారు. షెడ్యూలు ఇలా: ప్రతినెల 1నుంచి 7వ తేదీవరకు పింఛన్లు పంపిణీ చేస్తారు. 9న పింఛనుదారు సంతకం ఉన్న అక్విటెన్స్ ఎంపీడీవోలకు పంపాలి. పంపిణీ కాని పింఛను సొమ్మును అదేరోజున స్టేట్నోడల్ ఖాతాకు జమ చేయాలి. 16నుంచి 21వరకు తర్వాత నెలకు అక్విటెన్స్ల జనరేషన్ చేయాలి. 22, 23 తేదీల్లో కలెక్టరు నుంచి అనుమతి ఉత్తర్వులు, అదే రోజున డీఆర్డీఏ పీడీలకు నిధుల బదిలీ, 23,24 తేదీల్లో నిధుల బదిలీకి సెర్ప్ అనుమతి, 25నపింఛన్ల పంపిణీ ఏజన్సీలకు నిధుల బదిలీ జరిగేలా షెడ్యూలును రూపొందించారు.