సాక్షి, హైదరాబాద్: మంజూరైన వితంతు పింఛన్ కార్డును ఇవ్వాలని ఆర్‌ఐని అడగగా జాప్యం చేస్తూ ఒంటరిగా రా ఇస్తానని చెప్పడంతో ఈ విషయాన్ని సదరు మహిళ బంధువులకు చెప్పడంతో వారొచ్చి ఆర్‌ఐని తహసీల్దార్ సమక్షంలోనే చితకబాదిన ఘటన కలకలం రేపింది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌లో ఉంటున్న మైనార్టీ మహిళ(28), వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. తనకు మంజూరైన కార్డు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆర్‌ఐ విజయ్‌నాయక్‌ను అడిగింది.
ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదని, రోజు ఇబ్బంది పెటొద్దు ప్రేమతో అడిగి తీసుకోవాలంటూ ఆర్‌ఐ నాలుగైదు రోజులుగా ఇదే సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మరోసారి సదరు మహిళ ఫించన్ కార్డు కోసం కార్యాలయానికి వచ్చి విజయ్‌నాయక్‌ను కార్డు అడిగింది. మళ్లీ అతడు అదే సమాధానం ఇచ్చాడని కుటుంబ సభ్యులతో పాటు బస్తీ వాసులకు తెలిపింది. కాసేపటి తర్వాత కార్యాలయానికి వచ్చిన వారు తహసీల్దార్ అయ్యప్ప సమక్షంలోనే విజయ్‌నాయక్‌పై దాడి చేశారు.
ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన తహసీల్దార్‌ను సైతం నెట్టివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది. ఫించన్ మంజూరైంది ఇంకా కార్డు రాలేదని రాగానే ఇస్తానన్నాను.. తప్ప ఒంటరిగా రా అనలేదని ఆర్‌ఐ విజయ్‌నాయక్ చెప్పుకొచ్చారు. కార్డు ఇవ్వడం ఆలస్యమైనందుకే బంధువులు, స్థానికులతో వచ్చి తనపై దాడి చేశారని ఆర్‌ఐ పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఇరువురు గాంధీనగర్ పోలీస్ పరస్పర ఫిర్యాదు చేసినట్లు సీఐ మోహన్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment