సాక్షి, అమరావతి : పట్టుగొమ్మల్లాంటి పల్లెలను పచ్చ నాగులు చెరబట్టాయి..జన్మభూమి కమిటీల పేరిట బుసలు కొట్టాయి..ప్రతి పనికి, పథకానికి పైసలడుగుతూరాజకీయం చేశాయి.. కాళ్లు లేవన్నా కనికరించలేదు..ఇల్లు లేదన్నా దయ చూపలేదు..ముసలోళ్లమయ్యా.. ఆదుకోమన్నా వారి మనసు కరగలేదు..తమవారైతే మాత్రం అనర్హులైనా లబ్ధి చేకూర్చాయి..స్వచ్ఛమైన పల్లె మనుషుల మధ్య చిచ్చురేపి సొంత జేబులు నింపుకొని దర్జా ఒలకబోస్తున్నాయి..
అసలైన భారత దేశం పల్లెల్లోనే ఉందన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. అలాంటి గ్రామ సీమల్లో విద్వేషాగ్ని రగిల్చాయి జన్మభూమి కమిటీలు. వీటి పేరిట విభేదాలను రెచ్చగొట్టి, పల్లెలను చీల్చి సంక్షేమానికి తూట్లు పొడిచింది చంద్రబాబు సర్కారు. రాజ్యాంగం ప్రకారం సర్పంచులు తదితర స్థానిక ప్రజాప్రతినిధులకు దక్కిన అధికారాలకు కత్తెర వేసి నచ్చినట్లు పాలన సాగేలా పక్కదారి పట్టించారు. ఈ ఐదేళ్ల పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలతో పేదలు, వృద్ధులు, బలహీన వర్గాలకు పలు ప్రయోజనాలు దూరమయ్యాయి.
తమ పార్టీ కాకుంటే వివక్ష చూపుతూ, నచ్చినవారికి అర్హత లేకున్నా లబ్ధి చేకూరుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మరోవైపు జన్మభూమి కమిటీ సభ్యులు ప్రభుత్వ పథకాలను అడ్డుగా పెట్టుకుని లక్షలాది రూపాయిలు అక్రమంగా సంపాదించారు. ఈ నాలుగేళ్లలోనే లక్షాధికారులైన టీడీపీ నాయకులు పల్లెల్లో లెక్కలేనంత మంది ఉన్నారు.
అంతా ‘పచ్చ’పాతమే
ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అంటూ గత ఆరు నెలల్లో ఢిల్లీలో చంద్రబాబు తెగ హడావుడి చేశారు. అయితే, రాష్ట్రంలో మాత్రం... గ్రామాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పంచాయతీల అధికారాలను తొక్కిపెట్టారు. ఓవైపు సర్పంచుల అధికారాలను హరిస్తూ, మరోవైపు జన్మభూమి కమిటీలంటూ రాజ్యాంగేతర శక్తులను సృష్టించారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు సంక్రమించిన అధికారాలను హరించారు. పూర్తిగా టీడీపీ కార్యకర్తలు, నేతలతో నిండిపోయిన ఈ కమిటీలు గత ఐదేళ్లలో తమదే రాజ్యం అన్నట్లు చెలరేగిపోయాయి.
పేదలు ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నా వీటి దయాదాక్షిణ్యం ఉంటేనే లబ్ధిదారుల ఎంపిక జరిగేది. రేషన్ కార్డు, ఇల్లు, ఇళ్ల స్థలాలు, మంచినీటి కనెక్షన్, పింఛన్ ఇలా ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఎవరు లంచమిస్తే వారిని లబ్ధిదారు జాబితాలో చేర్చాలని సిఫార్సు చేశారు. ఆ కమిటీలు సిఫార్సు చేసినవారి పేర్లనే జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపేవారు. చిత్రమేమంటే... పథకాల కోసం సొంత పార్టీకి చెందినవారూ లంచమిచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఇతర పార్టీల్లోని అర్హులకు మొండిచేయి
గ్రామాల్లో ఎవరు ఏ పార్టీకి చెందినవారో సులువుగానే తెలిసిపోతుంది. దీంతో ఇతర పార్టీల వారిలో అర్హులున్నా రేషన్ కార్డు, పింఛన్, ఇళ్లు మంజూరు చేయలేదు. గ్రామ సర్పంచ్‌ల అధికారాలను జన్మభూమి కమిటీలకు అప్పగించడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్లు వేయాలన్నా, వీధి లైట్లు మార్చాలన్నా జన్మభూమి కమిటీలు చెబితేనే సాధ్యమయ్యేది. ఏ రోడ్డు వేయాలో, ఏది వేయకూడదో అవే నిర్ణయిస్తాయి. ఇళ్ల మంజూరుకు ఒక్కోచోట రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ముడుపులు తీసుకున్నారు.
పంచాయతీల నిధులు మళ్లింపు
గ్రామ సమస్యలపై ప్రజలెన్నుకున్న సర్పంచి ఆధ్వర్యంలోని పంచాయతీ నిర్ణయం తీసుకుని పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తోంది. చంద్రబాబు సర్కారు ఆ నిధుల ఖర్చుపై ఆంక్షలు పెట్టి, వాటిని ఇష్టానుసారం మళ్లించింది. గ్రామ పంచాయతీలకిచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు వాటి సూచనల మేరకు ఖర్చు చేయాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను చంద్రన్న బాటకు మళ్లించారు.
పంచాయతీలకు ఏటా కేంద్రం రూ.1,400 కోట్లపైనే నిధులిచ్చినా వీటిలో మూడో వంతు దారి మళ్లాయి. ఉపాధి హామీలో భాగంగా గ్రామంలో చేపట్టే పనులు పంచాయతీ తీర్మానం మేరకు జరగాలి. కానీ, జన్మభూమి కమిటీలు సూచించే వాటినే ఇందులో చేపట్టారు. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణకు 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుపెట్టాలి. అయితే, గోదావరి, కృష్ణా పుష్కరాల కోసం గ్రామ పంచాయతీలకు చెందిన రూ.54 కోట్లను మళ్లించారు.
ఒకే ఊరు..భిన్న న్యాయం
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కూర్మాయిగ్రామానికి చెందిన చిన్న నారాయణమ్మ, రాధమ్మ ఇద్దరూ వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ జాబితా సంబంధిత జిల్లా మంత్రి కార్యాలయం నుంచి గ్రామ జన్మభూమి కమిటీకి చేరింది.
చిన్న నారాయణమ్మ వైఎస్సార్‌సీపీ సానుభూతి పరురాలు. దీంతో ఆమెకు పొలం లేకున్నా.. ఐదెకరాలు ఉందంటూ ఆమె పింఛనుకు అనర్హురాలంటూ జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడ్డారు. రాధమ్మ కుటుంబం టీడీపీకి అనుకూలం కావడంతో ఐదెకరాల పొలం ఉన్నప్పటికీ జన్మభూమి కమిటీ సభ్యులు ఆమెను పింఛనుకు అర్హురాలిగా సిఫార్సు చేశారు. రాధమ్మకు ఇప్పుడు పింఛను వస్తోంది.
టీడీపీకి ఓటేస్తామంటేనే ఇళ్లిస్తానన్నారు
ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ నా కుమారుడు పిసిని రామునాయుడు రెండుసార్లు దరఖాస్తు చేశాడు. జన్మభూమి కమిటీ సభ్యులు మొదట మాకు ఇల్లు తప్పకుండా వస్తుందని చెప్పారు. తర్వాత మాట మార్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని, అలాగైతేనే ఇల్లు మంజూరు చేస్తామని షరతు విధించారు. దానికి మేం ససేమిరా అంగీకరించలేదు. దీంతో మాకు ఇల్లు రాలేదు. చివరకు మీరివ్వక పోతే పోనీ... వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కట్టుకుంటాం అని తేల్చి చెప్పాం.
–పిసిని సత్యం, గొల్లలపాలెం
ఆత్మహత్యాయత్నం చేసినా...
మేం దివ్యాంగులం. పింఛను కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లు తిరిగితిరిగి విసిగిపోయాం. గ్రామస్తులంతా మమ్మల్ని చూసి జాలిపడేవారు. జన్మభూమి కమిటీలు మాత్రం మానవత్వం లేకుండా ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులమంటూ నరకం చూపాయి. పేదలు, అర్హులకు అందాల్సిన పథకాలకు ఆ కమిటీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం ఏమిటనే ఆవేదనతో మా బాధను చాటేందుకు ఎంపీడీవో కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాం. స్థానికులు స్పందించి కాపాడారు. అయినా జన్మభూమి కమిటీల ఒత్తిడితో మాకు పింఛను మంజూరు చేయలేదు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసినా స్పందన కరవైంది. చివరికి నాలుగు నెలల క్రితం పింఛను వచ్చింది.
– ఐతిరెడ్డి శ్రీను, వియ్యపు సోమునాయుడు, పెదపూడి
కాళ్లు చచ్చుబడినా కనికరం చూపలేదు
నాకు 70 ఏళ్లపైనే ఉంటాయి. నిరుపేద కుటుంబం. పక్షవాతంతో రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. దివ్యాంగుడినని చెప్పే ‘సదరం’ ధ్రువపత్రం కూడా ఉంది. దీనిని చూపుతూ పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నా. అయితే, గ్రామ జన్మభూమి కమిటీ ఏ మాత్రం పట్టించుకోలేదు. వారు ఆమోదం తెలిపితేనే దరఖాస్తు ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. చివరకు నా దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యాయి. ఇప్పటికీ పింఛన్ రావడం లేదు.
– తుమ్మటి కృష్ణమూర్తి, ఎం.అగ్రహారం
Comments
Please login to add a commentAdd a comment