మంత్రులా.. అవినీతి జలగలా..! | Chandrababu And Co Is Competing In Looting Crores In Name Of Development For Five Years | Sakshi
Sakshi News home page

అమాత్యులా.. అవినీతి జలగలా..!

Published Sat, Apr 6 2019 8:06 AM | Last Updated on Sat, Apr 6 2019 10:04 AM

Chandrababu And Co Is Competing In  Looting Crores In Name Of Development For Five Years - Sakshi

సాక్షి, అమరావతి : ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాశమే హద్దుగా అవినీతికి పాల్పడుతుంటే.. మంత్రివర్గ సహచరులు నిజాయితీగా ఉంటారా? అస్సలు ఉండరు.. ఉండలేరు! అక్రమార్జనలో చంద్రబాబుతోనే పోటీపడ్డారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న  నానుడిని  బాగా ఒంటబట్టించుకున్న మంత్రులు..నిబంధనలను ఉల్లంఘించి భారీఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. 

ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ ప్రజాధనాన్ని కోట్లల్లో దోచుకుంటున్నారు. అస్మదీయులకు ప్రజాధనాన్ని, ఆస్తులను దోచిపెట్టి.. కమీషన్‌లు దండుకున్నారు. సుపుత్రుడు మంత్రి లోకేష్‌ అక్రమార్జనకు అంతేలేకుండా పోయింది. జలవనరుల శాఖ మంత్రిని చూసి జలగే సిగ్గుపడుతోంది. సీనియర్‌ మంత్రి యనమల అవినీతిలోని తన సీనియార్టీని నిలబెట్టుకున్నారు.

మంత్రి నారాయణ.. అవినీతి అనకొండగా మారిపోయారు. మంత్రి ప్రత్తిపాటి అక్రమార్జనలో తానుసైతంఘానాపాటిగాదూసుకుపోతున్నారు. మంత్రి గంటాను  జనం ‘భూ చోరుడు’ని పిలుస్తున్నారంటే... ఆయన భూ దోపిడి అమరావతి నుంచి వైజాగ్‌ దాకా ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.  ఇక కేఈ, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి.. తమదైన శైలిలో దోపిడీ పర్వానికి తెరదీశారు.  

1. లోకేష్‌.. అక్రమార్జనలో తండ్రిని మించిన ఘనుడు

ఆరంగేట్రం చేసిన కొద్ది రోజులకే అంటే ఏప్రిల్‌ 2, 2017న తనయుడు లోకేష్‌ను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఏకంగా మూడు శాఖలు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలను అప్పగించారు. తండ్రి దన్నుతో అధికారాన్ని అడ్డంపెట్టుకుని లోకేశ్‌ అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటు పేరుతో తక్కువ ధరకే అత్యంత విలువైన భూములను కేటాయించి.. వాటిలో వాటాలతో, కమీషన్‌ల రూపంలో భారీగా వసూలు చేసుకున్నారు. 

  • ‘ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌’ ఇన్‌స్టిట్యూట్‌ ప్రధాన కార్యాలయం శాన్‌ఫ్రాన్సిస్కోలో కేవలం 10ఎకరాలలో ఉంది. విశాఖలోని మధురవాడలో సర్వే నెంబర్‌ 409లో 40 ఎకరాలను ఆ సంస్థకు కేటాయించాలని లోకేశ్‌ చేసిన ప్రతిపాదనను ఎస్‌ఐపీసీ(స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ) తిరస్కరించింది.. కేవలం పది ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందని అప్పటి సీఎస్‌ దినేష్‌ తేల్చి చెప్పారు. కానీ ఫ్రాంక్లిన్‌ సంస్థలో తన సన్నిహితుడుని వాటాదారుగా చేసిన లోకేష్‌.. ఎకరం రూ.10.16కోట్లు పలికే భూమిని..  రూ.32.50 లక్షల చొప్పున కేటాయించి.. రూ.400 కోట్లకుపైగా ఆ సంస్థకు లబ్ధి చేకూర్చి.. తానూ ప్రయోజనం పొందారు.  
  • విశాఖలోని మధురావడలో సర్వే నెంబర్‌ 409లోని 50 ఎకరాలను తన మిత్రుడికి చెందిన ఈ–సెంట్రిక్‌ సొల్యూషన్స్‌ సంస్థకు కేటాయించేలా చక్రం తిప్పారు. ఎకరా రూ.7.26 కోట్లు పలికే భూమిని రూ.50 లక్షల చొప్పున కేటాయించి.. రూ.338 కోట్లు లబ్ధి చేకూర్చి.. కమీషన్‌లు తీసుకున్నారు. 
  • తిరుపతికి సమీపంలో వికృతమల వద్ద ఏర్పాటు చేసిన ఈఎంసీ(ఎలక్ట్రానిక్‌ మ్యానుపాక్చరింగ్‌ క్లస్టర్స్‌)లోనూ 200 ఎకరాలను తక్కువ ధరలకే స్నేహితులకు కేటాయించి.. రూ.400 కోట్లకుపైగా లబ్ధి పొందారు.  
  • అధికారాంతమున రూ.15,700 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పనులకు టెండర్లు పిలిచారు. ఒక్కో జిల్లాను ఒక యూనిట్‌గా ఈ టెండర్లు నిర్వహించారు. అంతకు ముందే నాలుగు కాంట్రాక్టు సంస్థలు మేఘా, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ, ఐహెచ్‌పీలకు 13 జిల్లాల పనులు పంచేసి.. సగటున 4.9 శాతం ఎక్సెస్‌కు కట్టబెట్టి రూ.785 కోట్లకుపైగా కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. 
  • గ్రామీణ రహదారులు అభివృద్ధి చేసే పనులకు రూ.4,200 కోట్లను ఏఐఐబీ (ఆసియా మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంకు) సమకూర్చింది. వీటికి నిర్వహించిన టెండర్లలోనూ.. ఐదు కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కు అయి.. సగటున 4.5 శాతం అధిక ధరలకు పనులు అప్పగించి రూ.210 కోట్లకుపైగా కాజేశారు. 
  • ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును బినామీ వేమూరు రవికుమార్‌ ప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టి రూ.రెండువేల కోట్లకుపైగా దోచుకున్నారు. కేవలం రూ.300 కోట్లతో ప్రారంభమైన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4234 కోట్లకు చేరడం వెనుక ఆంతర్యమిదే. 

2. యనమల.. ప్రతి పనికో రేటు

టీడీపీలో సీనియర్‌ నేత అయిన యనమల రామకృష్ణుడు ఐదేళ్లుగా ఆర్థిక శాఖ.. శాసనసభ వ్యవహారాల శాఖలను నిర్వహిస్తున్నారు. అక్రమార్జనలోనూ మిగతా మంత్రులను మించిపోయారు. తన వియ్యంకుడు, మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌కు చెందిన పీఎస్‌కే కనష్ట్రక్షన్‌కు వేలాది కోట్ల రూపాయాల విలువైన పనులను సబ్‌ కాంట్రాక్టు కింద ఇప్పించి.. కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. పోలవరం ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల విలువైన పనులను వియ్యంకుడికి నామినేషన్‌పై కట్టబెట్టేశారు. వియ్యంకుడికి మద్యం తయారు చేసే డిస్టిలరీకి లైసెన్సు ఇచ్చేలా చక్రం తిప్పి.. భారీగా  ప్రయోజనం పొందారు.  

3. నారాయణ.. దోపిడీ బినామీ 

చంద్రబాబు బినామీల్లో పొంగూరు నారాయణ అత్యంత ప్రధానమైన వారు. 2014 వరకూ తెరవెనుక రాజకీయాలు చేసే నారాయణ.. ఎమ్మెల్సీగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనకు ఏరికోరి పురపాలక శాఖను చంద్రబాబు కట్టబెట్టారు. రాజధాని ప్రాంతం ఎంపికలో కీలక భూమిక పోషించిన నారాయణ.. తక్కువ ధరకే బినామీల పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేసి దోచుకున్నారు.

మున్సిపాల్టీలు.. కార్పొరేషన్‌లలో అమృత్‌ పథకం కింద చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి భారీ ఎత్తున కమీషన్‌లు తీసుకున్నారు. తాత్కాలిక సచివాలయం, శాసనసభ, మండలి భవనాల పనులు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి, చదరపు అడుగు రూ.2,500లతో పూర్తయ్యే పనులకు రూ.19 వేలు చొప్పున బిల్లులు చెల్లించి భారీగా ముడుపులు పిండేశారు.

రహదారులు, భవనాల కోసం రూ.39వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి.. ఐదు సంస్థలకు ఆ పనులను 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టి రూ.1500 కోట్లకుపైగా కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. చివరకు అన్నా క్యాంటీన్‌ల నిర్మాణంలోనూ అధికంగా బిల్లులు చెల్లించి ముడుపులు దండుకున్నారు. 

4. ప్రత్తిపాటి.. అక్రమార్జనలో ఘనాపాఠి

ప్రత్తిపాటి పుల్లారావు తొలి రెండున్నరేళ్లు వ్యవసాయ శాఖ..ఆ తర్వాత పౌరసరఫరాల శాఖను నిర్వహించారు. తన అనుచరుల ద్వారా తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేసి.. రైతులను దగా చేసి.. అదే రైతుల పేర్లతో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కంటే ఎక్కువ ధరకు అమ్మి రూ.200 కోట్లు దోచేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలోనూ ఇది వెల్లడైంది.

మార్కెటింగ్‌ శాఖకు చెందిన 22 మంది అధికారులను సస్పెండ్‌ చేసిన సర్కార్‌.. సూత్రధారి అయిన ప్రత్తిపాటిపై చర్యలు తీసుకోలేదు. విత్తన సంస్థలతో కుమ్మక్కైన ప్రత్తిపాటి.. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరల కంటే అధిక ధరకు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి.. రైతుల నోట్లో మట్టి కొట్టి రూ.250 కోట్లకుపైగా దోచేశారు. ఆ సొమ్ముతో రాజధానిలోనూ.. అగ్రిగోల్డ్‌ ఆస్తులు, భూములను తక్కువ ధరలకే కాజేశారు.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో ప్రత్తిపాటి.. తన భార్య ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ కొనుకొల్లు ఉదయదినకర్‌ నుంచి సర్వే నెంబర్లు 104/1, 104/3, 104/4, 105/5, 104/6, 103/2లలో మొత్తం ఆరు ఎకరాల 19 సెంట్లు సేల్‌డీడ్‌ నంబర్‌ 423/15 తో జనవరి 19, 2015న.. ప్రగడ విజయకుమార్‌ నుంచి సర్వే నెంబబర్‌ 104/1, 104/2, 104/3 లలో మరో2.61 ఎకరాలు ఏఫ్రిల్‌ 17, 2015న.. సర్వే నెంబర్‌ 104/4లో మరో 57 సెంట్లు సర్వే నెంబర్‌ 101/1లో 5.44 ఎకరాలు బండ శ్రీనివాసబాబు నుంచి కాజేసి.. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

ఈ భూమికి సంబంధించి భార్య ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ పేరుతో నెంబర్‌ 246275తో టైటిల్‌ డీడ్‌.. పట్టాదారు నకిలీ పాసుపుస్తకం మంత్రి జారీ చేయించారని ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజియన్‌ మాజీ చైర్మన్‌ మల్లాది శివన్నారాయణ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే రీతిలో అగ్రిగోల్డ్‌ ఆస్తులను భారీగా కొట్టేసినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక... సంక్రాంతి, రంజాన్, క్రిస్‌మస్‌ సందర్భాల్లో పేదలకు కానుకల పేరుతో నాసిరకం సరుకులను అధిక ధరలకు కొనుగోలు చేసి రూ.200 కోట్లకుపైగా దోచేశారు. 

5. దేవినేని.. అవినీతి జలగ

సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకోవాలన్న ముందస్తు ఎత్తుగడలో భాగంగా..తనకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమామహేశ్వరరావుకు జలవనరుల శాఖను చంద్రబాబు కట్టబెట్టారు. టెండర్ల విధానాన్ని నిర్వీర్యం చేసి.. ‘ఎంపిక’ చేసిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించడం ద్వారా చంద్రబాబు భారీగా కమీషన్‌లు దండుకున్నారు.

ఆ తర్వాత కాంట్రాక్టర్ల నుంచి మంత్రి దేవినేని కూడా కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. అంతటితో సరిపుచ్చుకోకుండా.. బినామీ కాంట్రాక్టర్లను ముందుపెట్టి.. నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించి భారీఎత్తున దోచుకున్నారు.  

  • మంత్రిగా దేవినేని బాధ్యతలు స్వీకరించిన తొలిరోజుల్లోనే.. కృష్ణా డెల్టా ఆధునికకీరణ పనుల్లో గుండేరు డ్రెయిన్‌ ఆధునికీకరణకు మంజూరు చేసిన రూ.137.8 కోట్లలో రూ.42.79 కోట్ల విలువైన పనులను కృష్ణా డెల్టా సీఈ ద్వారా రద్దు చేయించారు. వాటితో విజయవాడలో జలవనరుల శాఖ కార్యాలయం ఆవరణలో తన క్యాంపు కార్యాలయం, గ్రావెల్‌ పాత్‌ నిర్మాణ పనులను తన బినామీ అయిన సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించేశారు. క్యాంపు కార్యాలయంలో బెడ్‌ లాక్స్‌తో గ్రావెల్‌ పాత్‌(నడక దారి) నిర్మాణానికి మొదట్లో రూ.3,78,56,426లు అంచనా అవుతుందని కేడీఎస్‌ అధికారులు లెక్క కట్టారు. అదే ధరకు నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కానీ, ఆ తర్వాత నడక దారికి రూ.7,01,00,000 కోట్లు బిల్లులు దక్కించుకున్నారు. 
  • కృష్ణా పుష్కరాల పనుల్లో భాగంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువున, దిగువున రూ. 167.51 కోట్ల విలువైన ఘాట్ల నిర్మాణ పనులను బినామీ కాంట్రాక్టర్లు అయిన సూర్య, సోమా సంస్థలకు కట్టబెట్టి.. బిల్లులు చేసుకున్నారు.  
  •  పోలవరం ఎడమ కాలువలో ఒకటో ప్యాకేజీ మిగిలిపోయిన రూ.38.78కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.171.39 కోట్లకు పెంచేసి బినామీ అయిన సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టేసి.. రూ.132.61 కోట్ల మేర దోచుకున్నారు.  
  • ఏపీ నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలో 469 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులకు రూ.6934.49 కోట్లు ఖర్చు చేశారు. కానీ.. అధిక శాతం పనులు చేయకుండా చేసినట్లు చూపి కాంట్రాక్టర్లతో కలిసి ప్రజాధనాన్ని  దోచుకున్నారు.  
  • తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో 22 ఎత్తిపోతల పథకాల పనులను నాసిరకంగా చేసి రూ.35 కోట్లకుపైగా లూటీ చేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అవుకు సొరంగంలో మిగిలిపోయిన పనులను బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, ఉమా దోచుకుంటుండటాన్ని టీడీపీకే చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ జూలై 31, 2015న.. హైపవర్‌ కమిటీ సభ్యుడైన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌కు లేఖ రాయడం గమనార్హం.

6. అచ్చెన్న.. అచ్చెరువొందేలా దోపిడీ

కింజారపు అచ్చెన్నాయుడు తొలి రెండున్నరేళ్లు కార్మికశాఖను.. ఆ తర్వాత బీసీ సంక్షేమం, రవాణా, జౌళి శాఖలను నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రహదారులు దగ్గర నుంచి పాఠశాల భవనాల వరకూ.. నీరు–చెట్టు పథకం పనుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణం దాకా.. సింహభాగం పనులు తన సోదరుడు హరివరప్రసాద్‌కు చెందిన సురేష్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అనే సంస్థకు కాంట్రాక్టు దక్కేలా చేసి.. నాసిరకంగా పనులు చేసి వందల కోట్లు కాజేశారు. మంత్రి సోదరుడి సంస్థ చేసిన పనుల్లో నాణ్యత లేదంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సర్కార్‌కు నివేదికలు ఇచ్చినా వాటిని చంద్రబాబు తొక్కిపెట్టారు..  

  • ప్రభుత్వ పాఠశాలలు.. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫారంలు ఇచ్చేందుకు అవసరమైన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని సర్కార్‌ జారీ చేసిన ఆదేశాలను సాకుగా తీసుకున్నారు.  చేనేత సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు నాసిరకం వస్త్రాలను కొనుగోలు చేసేలా చక్రం తిప్పి భారీ ఎత్తున సొమ్ము చేసుకున్నారు. తద్వారా నేతన్నల కడుపు కొట్టారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణం, సరుకుల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడి ముడుపులు వసూలు చేసుకున్నారు.  

7. గంటా.. భూ చోరుడు

మానవనరుల శాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు బాధ్యతలు
చేపట్టినప్పటి నుంచే అధికారాన్ని అడ్డంపెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. 

  • విశాఖలో.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న భీమిలిలో తన తోడల్లుడు పరుచూరు భాస్కర్‌రావుతో కలిసి భారీ ఎత్తున భూములను కబ్జా చేశారు. విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వుడా)ను అడ్డం పెట్టుకుని పెందుర్తిలో బినామీ పేర్లతో తక్కువ ధరకే పేదల నుంచి 358.47 ఎకరాల అసైన్డు భూమి కాజేశారు. ఈ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ కింద వుడాకు ఇచ్చి రూ.644.4 కోట్లు సొమ్ము చేసుకోవడానికి ఎత్తు వేశారు. రైతులకు మాత్రం ఎకరాకు రూ.2నుంచి 12 లక్షలే ఇచ్చారు. ఈ వ్యవహారంలో రూ.604.4కోట్లకుపైగా దోచేసే ఎత్తును మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే బహిర్గతం చేయడం గమనార్హం.  
  • రాజధాని ప్రాంతంలోనూ పరుచూరు భాస్కర్‌రావును ముందు పెట్టి తక్కువ ధరలకు అసైన్డు, లంక భూములను భారీ ఎత్తున కొనుగోలు చేసి.. వాటిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏకు అప్పగించి భారీగా లబ్ధి పొందారు.  
  • చివరకు విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్స్‌లర్‌ల నియామకం నుంచి డీఈవో.. ఆర్‌జేడీలు, జేడీలు, ఉపాధ్యాయుల బదిలీల వరకూ భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకున్నారు. 
  •  పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను అధికారాంతమున రూ.4,800 కోట్లకు ఐదు శాతం ఎక్సెస్‌కు ఆరు సంస్థలను హైబ్రిడ్‌ యాన్యుటి పద్దతిలో కట్టబెట్టి రూ.500 కోట్లకుపైగా దోచేశారు. 

8. గుడిని, లింగాన్ని కేఈ మింగేశారు

టీడీపీలో అత్యంత సీనియర్‌ అయిన కేఈ కృష్ణమూర్తి చంద్రబాబు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి హోదాను దక్కించుకున్నారు. రెవెన్యూ.. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. అక్రమార్జనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ పరిధిలోని.. తుంగభద్ర నదిని తన తనయుడు కేఈ శ్యాంబాబుతో కబ్జా చేయించి.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి.. హైదరాబాద్‌కు తరలించి భారీ ఎత్తున దోచుకున్నారు. ఈ వ్యవహారంలో హైకోర్టు చీవాట్లు పెట్టినా కేఈ వెనక్కు తగ్గలేదు.  

  • తిరుపతికి సమీపంలో సుమారు రూ.160 కోట్ల విలువైన 16 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని.. అది చెరువు భూమి కాదని.. దాన్ని రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసి.. భారీ ఎత్తున కమీషన్‌లు వసూలు చేసుకున్నారు.  
  • అధికారాంతమున వివిధ దేవాలయాలకు చెందిన 30 వేల ఎకరాల భూములను కేవలం మూణ్నెల్లలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నంలో భారీగా ముడపులు వసూలు దండుకున్నారు.  
  • విశాఖపట్నంలో సంపత్‌ వినాయక స్వామి దేవాలయానికి ఏడాదికి రూ.2.50 కోట్ల చొప్పున హుండీ ద్వారా ఆదాయం వస్తుంది.. ఇదే ఆలయానికి రూ.వంద కోట్ల ఆస్తి ఉంది. ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ నుంచి తప్పించి, ఒక వ్యక్తికి అప్పగించి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకున్నారు. ఇదే పద్ధతిలో సుమారు 30 దేవాయాలను ప్రైవేటు వ్యక్తులకు స్వాధీనం చేసి.. భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకున్నారు. 

9. సోమిరెడ్డి.. కమీషన్‌ల మినిస్టర్‌

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు.. ఏప్రిల్‌ 2, 2017న మంత్రివర్గంలోకి తీసుకుని.. వ్యవసాయశాఖను అప్పగించారు. 

  • నెల్లూరు జిల్లా గూడురు ప్రాంతంలో సిలికా స్మగ్లర్లతో చేతులు కలిపిన సోమిరెడ్డి.. భారీగా సిలికాను కొల్లగొట్టి చెన్నై, బెంగుళూరుల్లోని గ్లాస్‌ ఇండస్ట్రీలకు విక్రయించి వందల కోట్లు కొల్లగొట్టారు. సాగునీటి పనుల దగ్గర నుంచి విద్యుదుత్పత్తి సంస్థల్లో పనుల వరకూ.. అన్నింటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి పర్శంటేజీలు దండుకున్నారు.  
  • ముత్తుకూరు వద్ద జెన్‌కో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ రెండో యూనిట్‌ విస్తరణ పనులలో యాష్‌ పాండ్‌ నిర్మాణ వ్యయాన్ని రూ.23 కోట్ల నుంచి రూ. 42 కోట్లకు పెంచేయించి కమీషన్‌లు దండుకున్నారు. విత్తన సరఫరా సంస్థలతో కుమ్మక్కై మార్కెట్‌లో ధర కంటే అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేశారు. వాటినే రైతులకు పంపిణీ చేసి.. రాయితీ నిధులను దక్కకుండా చేసి వందలాది కోట్ల రూపాయలను కమీషన్‌లుగా వసూలు చేసుకున్నారు.  

10. ఆదినారాయణరెడ్డి.. లంచావతారం 

చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి.. జమ్ములమడుగు నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. ఏప్రిల్‌ 2, 2017న ఆయన్ని చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకుని పశుసంవర్ధక, మార్కెటింగ్, సహకార శాఖలను కట్టబెట్టారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక మేరకు పత్తి కొనుగోళ్ల కుంభకోణానికి పాల్పడిన 45 మంది ఉద్యోగులను గతంలో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయగా.... మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే వారి నుంచి ముడుపులు తీసుకుని సస్పెన్షన్‌ ఎత్తివేశారు.

దళారీల ద్వారా కంది, పప్పుశనగ, వరి, పెసర, మినుములు వాటిని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి.. కనీస మద్దతు ధరకు కొన్నట్లు చూపి వందల కోట్లు దోచేశారు. పశువుల ఆస్పత్రులకు మందుల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement