janmabhumi committee
-
పల్లెల్లో పచ్చ చిచ్చు..
సాక్షి, అమరావతి : పట్టుగొమ్మల్లాంటి పల్లెలను పచ్చ నాగులు చెరబట్టాయి..జన్మభూమి కమిటీల పేరిట బుసలు కొట్టాయి..ప్రతి పనికి, పథకానికి పైసలడుగుతూరాజకీయం చేశాయి.. కాళ్లు లేవన్నా కనికరించలేదు..ఇల్లు లేదన్నా దయ చూపలేదు..ముసలోళ్లమయ్యా.. ఆదుకోమన్నా వారి మనసు కరగలేదు..తమవారైతే మాత్రం అనర్హులైనా లబ్ధి చేకూర్చాయి..స్వచ్ఛమైన పల్లె మనుషుల మధ్య చిచ్చురేపి సొంత జేబులు నింపుకొని దర్జా ఒలకబోస్తున్నాయి.. అసలైన భారత దేశం పల్లెల్లోనే ఉందన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. అలాంటి గ్రామ సీమల్లో విద్వేషాగ్ని రగిల్చాయి జన్మభూమి కమిటీలు. వీటి పేరిట విభేదాలను రెచ్చగొట్టి, పల్లెలను చీల్చి సంక్షేమానికి తూట్లు పొడిచింది చంద్రబాబు సర్కారు. రాజ్యాంగం ప్రకారం సర్పంచులు తదితర స్థానిక ప్రజాప్రతినిధులకు దక్కిన అధికారాలకు కత్తెర వేసి నచ్చినట్లు పాలన సాగేలా పక్కదారి పట్టించారు. ఈ ఐదేళ్ల పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలతో పేదలు, వృద్ధులు, బలహీన వర్గాలకు పలు ప్రయోజనాలు దూరమయ్యాయి. తమ పార్టీ కాకుంటే వివక్ష చూపుతూ, నచ్చినవారికి అర్హత లేకున్నా లబ్ధి చేకూరుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మరోవైపు జన్మభూమి కమిటీ సభ్యులు ప్రభుత్వ పథకాలను అడ్డుగా పెట్టుకుని లక్షలాది రూపాయిలు అక్రమంగా సంపాదించారు. ఈ నాలుగేళ్లలోనే లక్షాధికారులైన టీడీపీ నాయకులు పల్లెల్లో లెక్కలేనంత మంది ఉన్నారు. అంతా ‘పచ్చ’పాతమే ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అంటూ గత ఆరు నెలల్లో ఢిల్లీలో చంద్రబాబు తెగ హడావుడి చేశారు. అయితే, రాష్ట్రంలో మాత్రం... గ్రామాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పంచాయతీల అధికారాలను తొక్కిపెట్టారు. ఓవైపు సర్పంచుల అధికారాలను హరిస్తూ, మరోవైపు జన్మభూమి కమిటీలంటూ రాజ్యాంగేతర శక్తులను సృష్టించారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు సంక్రమించిన అధికారాలను హరించారు. పూర్తిగా టీడీపీ కార్యకర్తలు, నేతలతో నిండిపోయిన ఈ కమిటీలు గత ఐదేళ్లలో తమదే రాజ్యం అన్నట్లు చెలరేగిపోయాయి. పేదలు ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నా వీటి దయాదాక్షిణ్యం ఉంటేనే లబ్ధిదారుల ఎంపిక జరిగేది. రేషన్ కార్డు, ఇల్లు, ఇళ్ల స్థలాలు, మంచినీటి కనెక్షన్, పింఛన్ ఇలా ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఎవరు లంచమిస్తే వారిని లబ్ధిదారు జాబితాలో చేర్చాలని సిఫార్సు చేశారు. ఆ కమిటీలు సిఫార్సు చేసినవారి పేర్లనే జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపేవారు. చిత్రమేమంటే... పథకాల కోసం సొంత పార్టీకి చెందినవారూ లంచమిచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇతర పార్టీల్లోని అర్హులకు మొండిచేయి గ్రామాల్లో ఎవరు ఏ పార్టీకి చెందినవారో సులువుగానే తెలిసిపోతుంది. దీంతో ఇతర పార్టీల వారిలో అర్హులున్నా రేషన్ కార్డు, పింఛన్, ఇళ్లు మంజూరు చేయలేదు. గ్రామ సర్పంచ్ల అధికారాలను జన్మభూమి కమిటీలకు అప్పగించడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్లు వేయాలన్నా, వీధి లైట్లు మార్చాలన్నా జన్మభూమి కమిటీలు చెబితేనే సాధ్యమయ్యేది. ఏ రోడ్డు వేయాలో, ఏది వేయకూడదో అవే నిర్ణయిస్తాయి. ఇళ్ల మంజూరుకు ఒక్కోచోట రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ముడుపులు తీసుకున్నారు. పంచాయతీల నిధులు మళ్లింపు గ్రామ సమస్యలపై ప్రజలెన్నుకున్న సర్పంచి ఆధ్వర్యంలోని పంచాయతీ నిర్ణయం తీసుకుని పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తోంది. చంద్రబాబు సర్కారు ఆ నిధుల ఖర్చుపై ఆంక్షలు పెట్టి, వాటిని ఇష్టానుసారం మళ్లించింది. గ్రామ పంచాయతీలకిచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు వాటి సూచనల మేరకు ఖర్చు చేయాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను చంద్రన్న బాటకు మళ్లించారు. పంచాయతీలకు ఏటా కేంద్రం రూ.1,400 కోట్లపైనే నిధులిచ్చినా వీటిలో మూడో వంతు దారి మళ్లాయి. ఉపాధి హామీలో భాగంగా గ్రామంలో చేపట్టే పనులు పంచాయతీ తీర్మానం మేరకు జరగాలి. కానీ, జన్మభూమి కమిటీలు సూచించే వాటినే ఇందులో చేపట్టారు. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణకు 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుపెట్టాలి. అయితే, గోదావరి, కృష్ణా పుష్కరాల కోసం గ్రామ పంచాయతీలకు చెందిన రూ.54 కోట్లను మళ్లించారు. ఒకే ఊరు..భిన్న న్యాయం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కూర్మాయిగ్రామానికి చెందిన చిన్న నారాయణమ్మ, రాధమ్మ ఇద్దరూ వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ జాబితా సంబంధిత జిల్లా మంత్రి కార్యాలయం నుంచి గ్రామ జన్మభూమి కమిటీకి చేరింది. చిన్న నారాయణమ్మ వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు. దీంతో ఆమెకు పొలం లేకున్నా.. ఐదెకరాలు ఉందంటూ ఆమె పింఛనుకు అనర్హురాలంటూ జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడ్డారు. రాధమ్మ కుటుంబం టీడీపీకి అనుకూలం కావడంతో ఐదెకరాల పొలం ఉన్నప్పటికీ జన్మభూమి కమిటీ సభ్యులు ఆమెను పింఛనుకు అర్హురాలిగా సిఫార్సు చేశారు. రాధమ్మకు ఇప్పుడు పింఛను వస్తోంది. టీడీపీకి ఓటేస్తామంటేనే ఇళ్లిస్తానన్నారు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ నా కుమారుడు పిసిని రామునాయుడు రెండుసార్లు దరఖాస్తు చేశాడు. జన్మభూమి కమిటీ సభ్యులు మొదట మాకు ఇల్లు తప్పకుండా వస్తుందని చెప్పారు. తర్వాత మాట మార్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని, అలాగైతేనే ఇల్లు మంజూరు చేస్తామని షరతు విధించారు. దానికి మేం ససేమిరా అంగీకరించలేదు. దీంతో మాకు ఇల్లు రాలేదు. చివరకు మీరివ్వక పోతే పోనీ... వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కట్టుకుంటాం అని తేల్చి చెప్పాం. –పిసిని సత్యం, గొల్లలపాలెం ఆత్మహత్యాయత్నం చేసినా... మేం దివ్యాంగులం. పింఛను కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లు తిరిగితిరిగి విసిగిపోయాం. గ్రామస్తులంతా మమ్మల్ని చూసి జాలిపడేవారు. జన్మభూమి కమిటీలు మాత్రం మానవత్వం లేకుండా ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులమంటూ నరకం చూపాయి. పేదలు, అర్హులకు అందాల్సిన పథకాలకు ఆ కమిటీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం ఏమిటనే ఆవేదనతో మా బాధను చాటేందుకు ఎంపీడీవో కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాం. స్థానికులు స్పందించి కాపాడారు. అయినా జన్మభూమి కమిటీల ఒత్తిడితో మాకు పింఛను మంజూరు చేయలేదు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసినా స్పందన కరవైంది. చివరికి నాలుగు నెలల క్రితం పింఛను వచ్చింది. – ఐతిరెడ్డి శ్రీను, వియ్యపు సోమునాయుడు, పెదపూడి కాళ్లు చచ్చుబడినా కనికరం చూపలేదు నాకు 70 ఏళ్లపైనే ఉంటాయి. నిరుపేద కుటుంబం. పక్షవాతంతో రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. దివ్యాంగుడినని చెప్పే ‘సదరం’ ధ్రువపత్రం కూడా ఉంది. దీనిని చూపుతూ పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నా. అయితే, గ్రామ జన్మభూమి కమిటీ ఏ మాత్రం పట్టించుకోలేదు. వారు ఆమోదం తెలిపితేనే దరఖాస్తు ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. చివరకు నా దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యాయి. ఇప్పటికీ పింఛన్ రావడం లేదు. – తుమ్మటి కృష్ణమూర్తి, ఎం.అగ్రహారం -
చంద్రబాబువి పగటి కలలు: పెద్దిరెడ్డి
చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో అధికారులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. -
జన్మభూమికి సభ్యులు కావలెను
►తాజాగా జన్మభూమి కమిటీలు ►తమకు నచ్చనివారిపై వేటు ►కొత్త సభ్యులతో భర్తీకి సన్నాహాలు ►పట్టుకోసం టీడీపీ నేతల ప్రయత్నాలు కమిటీలో చోటుకు రేటు జన్మభూమి కమిటీలపై జిల్లా టీడీపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రభుత్వ పథకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నఈ కమిటీలు తమ చెప్పుచేతల్లో ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమ మాట వినని వారిని పక్కన పెట్టేందుకు శ్రీకారం చుట్టనున్నారు. త్వరలోనే వారికి ఉద్వాసన పలికి పూర్తిగా తమకు అనుకూలురైనవారిని నియమించాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా కొంతమందినాయకులు కమిటీలో స్థానం కావాలంటే ఖర్చవుద్దని కూడా సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకాలపై అధికార పార్టీ నాయకులు ఆసక్తి చూపుతున్నారు చిత్తూరు, సాక్షి: సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న జన్మభూమి కమిటీలను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని జిల్లా టీడీపీ నాయకులు సంకల్పించారు. ఎంతో డిమాండున్న ఈ కమిటీలు తమ చేతిలో ఉండాల్సిందేనని వీరు భావిస్తున్నారు. చాలాచోట్ల జన్మభూమి కమిటీ సభ్యులదే పెత్తనంగా సాగుతోంది. వీరికి ముడుపులివ్వనిదే లబ్ధిదారుల ఎంపిక జరగదు. కాదంటే వారిపేరు జాబితాలో ఉండదు. మూడున్నరేళ్లుగా కమిటీలు చేస్తున్న నిర్వాకమిదే. వారు అధికారాన్ని అతిగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడా కమిటీలపై జిల్లా టీడీపీలో కీలక స్థానంలో ఉన్న నాయకుల కన్నుపడింది. పాత కమిటీలను రద్దు చేసి కొత్తవాటిని వేస్తే వ్యక్తిగతంగా లాభం చేకూరుతుందని ఆశిస్తున్నారు. నిర్ణయం తీసుకునేందుకు చిన్నబాబును సంప్రదిస్తున్నట్లు సమాచారం. అడ్డగోలు లబ్ధి పొందాలంటే.. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో భారీ ఆస్తులున్న ఓ మండల స్థాయి నాయకుడికి ఎన్టీఆర్ గృహం మం జూరైంది. ఆయనకున్న ఆర్హత ఏంటంటే టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు కావడమే. ఈ మండలంలోనే కాదు జిల్లాలో చాలా మండలాల్లో ఇలాగే జరుగుతోంది. ఈ విషయంలో వారిలో వారికే విభేదాలు కూడా వచ్చి రోడ్డుకెక్కుతున్నారు. ఫిర్యాదులు కూడా చేసుకుం టున్నారు. ప్రస్తుత ఎంపీటీసీ, సర్పంచ్ల కన్నా జన్మభూమి కమిటీ సభ్యులే కీలకమవుతున్నారు. వారంతా టీడీపీ సభ్యులే కావడంతో ప్రభుత్వం కూడా పెత్తనం వారికే అప్పజెపుతోంది. రాజ్యాంగేతర శక్తులుగా ఈ కమిటీ సభ్యులు తయారయ్యారు. వీరి శక్తిని చూసి కొందరు టీడీపీ నాయకులు కమిటీల్లో తమకు కావాల్సిన వారిని వేయించుకోవాలని చూస్తున్నారు. ఆదాయంలో వాటా ఇస్తే కమిటీల్లో స్థానమిచ్చేందుకు సిద్ధపడుతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో ఈతరహా వసూలు పర్వం ఇప్పటికే నడుస్తోంది. కొత్తకమిటీల నియామకాల ముసుగులో కలెక్షన్లకు తెరతీస్తున్నారు. డబ్బు లెక్క చేయని కొంతమంది ఎంతైనా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కమిటీలు చేతుల్లో ఉంటే.. మూడేళ్ల క్రితం నాటికి, నేటికీ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు నాయకులు పార్టీలు మారడంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. జన్మభూమి కమిటీలే కీలకం కావడంతో టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ స్థాయి వ్యక్తులు కూడా డమ్మీలుగా మిగులుతున్నారు. కొన్నిచోట్ల మాట వినడం లేదని, మరికొన్నిచోట్ల మనవాళ్లే ఉంటే బాగుంటుందని, చెప్పుచేతల్లో కమిటీలుంటే అడ్డుఉండదనే ఉద్దేశానికి టీడీపీ జిల్లా నేతలు వచ్చారు. పని చేయనివారు అనే ముద్రతో కొంత మందిని, పార్టీకి సేవలు చేయడంలేదనే సాకుతో కొంతమందిపై వేటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా వేసే కమిటీల్లో మనవాళ్లే ఉండాలన్న ఏకైక దృక్పథంతో ఉన్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. -
గ్రామ పరిపాలనకు తూట్లు
– జన్మభూమి కమిటీలతో సర్పంచ్‌లను డమ్మీ చేసిన సర్కార్ – నిధుల్ని పక్కదారి పట్టిస్తున్న వైనం ధర్మవరం : పంచాయతీ పాలనకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారిని కాదని, సొంత పెత్తనం చేస్తోంది. సర్పంచ్‌లను డమ్మీలను చేసి తమ పార్టీ కార్యకర్తలతో పాలన సాగిస్తోంది. ఫలితంగా పంచాయతీల్లో స్థానిక పరిపాలన చతికలపడిందని గ్రామీణులు మండిపడుతున్నారు. జిల్లాలో 63 మండలాలకు గానూ 1003 పంచాయతీలు ఉన్నాయి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మురుగునీటి కాల్వలు, సిమెంట్ రోడ్లు, పాడైన పథకాలను మరమ్మతులకు నోచుకోక సమస్యలతో ప్రజలు తల్లడిల్లుతున్నాయి. ఇక మారుమూల గ్రామాల్లో అయితే తాగునీటి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలైతే నేటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. సర్పంచ్ల పాత్ర నామమాత్రం : అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమాలకు ప్రారంభించింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లను కాదని, తమ పార్టీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, సొంత పెత్తనానికి తెరతీసింది. పల్లెల్లో అరకొరగా చేసే అభివృద్ధి పనులను పార్టీ కార్యకర్తలకు అప్పగిస్తూ తమను అవమాన పరుస్తోందని సర్పంచులు వాపోతున్నారు. దీనిపై సర్పంచుల సంఘం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర నిధులు పక్కదారి : పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టిస్తోంది. నిధులు విడుదలైంది ఒక పనికైతే ఖర్చు చేస్తున్నది మరో పనికి. విద్యుత్ బకాయిలకు 30శాతం చెల్లించేలా జీవో జారీ చేసింది. అలాగే ఉపాధి పథకం పనులకు అడ్డదారిలో 13వ, 14వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించి తమ పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతోంది. ధర్మవరం నియోజకవర్గంలో నిధుల పరిస్థితి ఇలా..! –బత్తలపల్లి మండలంలో 14వ ఆర్థిక సంఘం నిధులు అప్రాశ్చెరువుకు రూ.3.29 లక్షలు, బత్తలపల్లి పంచాయతీకి రూ.16.88 లక్షలు, డి. చెర్లోపల్లికి రూ.3.25 లక్షలు, మూష్టూరు పంచాయతీకి రూ.3.77 లక్షలు మంజూరయ్యాయి. ఈ మండలానికి మొత్తం రూ. 51.09 లక్షల మేర 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల్ని ఖర్చు చేసే బాధ్యత సర్పంచ్‌లకు కాకుండా జన్మభూమి కమిటీలకు కట్టబెట్టేందుకు అధికార పార్టీ నాయకులు, అధికారులు పావులు కదుపుతున్నారు. –ధర్మవరం మండలంలో మొత్తం 18 పంచాయతీలు ఉండగా, ఆయా పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు గానూ 14వ ఆర్థిక సంఘం కింద రూ.62 లక్షలు నిధులు మంజూరయ్యాయి. మరో రూ.5 లక్షల దాకా జనరల్ ఫండ్ ఆయా పంచాయతీలకు మంజూరైంది. –జిల్లాలోనే అతిపెద్ద మండలమైన ముదిగుబ్బ మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉన్నాయి. ముదిగుబ్బ మేజర్ పంచాయతీకి 14ఫైనాన్స్ గ్రాంట్ రూ.72.48 లక్షలు, జనరల్ ఫండ్ రూ.49వేలు మంజూరయ్యాయి. ఈ మండలానికి మొత్తం రూ. 10 లక్షల మేర జనరల్ ఫండ్, 14వ ఆర్థిక సంఘం ని«ధులు 2.69 లక్షల మేర విడుదలయ్యాయి. –అలాగే తాడిమర్రి మండలంలో 40 లక్షల మేర నిధులు మంజూరయ్యాయి. జన్మభూమి కమిటీ పెత్తనం తగదు : పంచాయతీల్లో జన్మభూమి కమిటీల పెత్తనం ఏంటి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన సర్పంచ్‌లను కాదని, ఇతర వ్యక్తుల పెత్తనమేంటి ? ఇది రాజ్యాంగ విరుద్ధం. అభివృద్ధి పనులు చేసే హక్కు సర్పంచ్‌లకే ఉంటుంది. అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి, ఏ పని చేసినా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నీ తెలిసిన అధికారులు గుర్తెరిగి వ్యవహరించడంపోయి.. అధికారపార్టీకి దాసోహమవటం దారుణం. – గెలివి మధుసూదనరెడ్డి, ధర్మవరం మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు అభివృద్ధి జరగడం లేదు : జన్మభూమి కమిటీల వల్ల గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదు. ఏ నిధులు మంజూరైనా పనులు చేసేందుకు వారిలో వారే పోటీ పడుతున్నారు. ఇది మంచిది కాదు. పంచాయతీ ప్రథమ పౌరుడ్ని కాదని జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టడం దారుణం. దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. పంచాయతీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. - సానే సూర్యనారాయణరెడ్డి, సర్పంచ్, తంబాపురం, బత్తలపల్లి మండలం -
ఎమ్మెల్యేలను లాక్కోవడమే మీ పనా..?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాలకొండ ఎమ్మెల్యే కళావతి సీతంపేట: ఎమ్మెల్యేలను లాక్కోవడానికే ప్రభుత్వం సమయమంతా ఖర్చు చేస్తోందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తోందని పాలకొండ ఎమ్మెల్యే కళావతి ఘాటుగా విమర్శించారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించి నెలలు గడుస్తున్నా ఎలాంటి పరిహారం అందలేదని తెలి పారు. కనీసం ఎన్టీఆర్ జలసిరిలో తీస్తామన్న బోర్లు కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరుగురు ఏజెన్సీ ఎమ్మెల్యేలం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఐటీడీఏ టీఎస్పీ పరిధిలో వెలు గు, యూత్‌ట్రైనింగ్ కేంద్రాలకు కంప్యూటర్లు, వివిధ రకాల మెటీరియల్ కొనుగోలులో లక్షలాది రూపాయల అ వినీతి జరిగినా దర్యాప్తు చేయకపోవ డం అన్యాయమన్నారు. ఉపకార వేతనా ల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. దీనిపై సీబీసీఐడీ ద ర్యాప్తు చేయాలన్నారు. ఎస్డీఎఫ్ జి ల్లాకు నిధులు రూ.50 కోట్లు కేటాయిస్తే ఇంతవరకు దాన్ని 10 నియోజకవర్గాలకు ఎలా పంపిణీ చేశారో చెప్ప డం లేదన్నారు. స్పోర్ట్స్ పాఠశాల ఎచ్చెర్లలో నిర్మిస్తామని, ఇప్పుడు లంబసిం గిలో పెడతామనడం ఎంతవరకు సమంజసమన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా వృద్ధులు, వితంతువుల పింఛన్లను కూడా తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కలెక్టర్, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం..
కడప: వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా కలెక్టరేట్లో జరిగిన విజిలెన్స్ శాఖ కార్యక్రమానికి వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అంజాద్ బాషా, జెడ్పీ చైర్మన్ రవి హాజరయ్యారు. గ్రామ సర్పంచులు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడమేంటని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు, వైఎస్ఆర్సీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జన్మభూమి కమిటీలు సుప్రీం కాదని పేర్కొన్నారు. ఓడిపోయిన వాళ్లు సమీక్షలు చేస్తుంటే ప్రజాస్వామ్యానికి విలువ ఏముందని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేత వరదరాజులు, అధికారులు సమీక్ష చేయడమేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే రాచమల్లు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఓటమి పాలైన నేతలు సమీక్షలకు వెళ్లవద్దని అధికారులకు కలెక్టర్ సూచించాలని వైఎస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.