జన్మభూమికి సభ్యులు కావలెను
►తాజాగా జన్మభూమి కమిటీలు
►తమకు నచ్చనివారిపై వేటు
►కొత్త సభ్యులతో భర్తీకి సన్నాహాలు
►పట్టుకోసం టీడీపీ నేతల ప్రయత్నాలు కమిటీలో చోటుకు రేటు
జన్మభూమి కమిటీలపై జిల్లా టీడీపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రభుత్వ పథకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నఈ కమిటీలు తమ చెప్పుచేతల్లో ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమ మాట వినని వారిని పక్కన పెట్టేందుకు శ్రీకారం చుట్టనున్నారు. త్వరలోనే వారికి ఉద్వాసన పలికి పూర్తిగా తమకు అనుకూలురైనవారిని నియమించాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా కొంతమందినాయకులు కమిటీలో స్థానం కావాలంటే ఖర్చవుద్దని కూడా సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకాలపై అధికార పార్టీ నాయకులు ఆసక్తి చూపుతున్నారు
చిత్తూరు, సాక్షి: సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న జన్మభూమి కమిటీలను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని జిల్లా టీడీపీ నాయకులు సంకల్పించారు. ఎంతో డిమాండున్న ఈ కమిటీలు తమ చేతిలో ఉండాల్సిందేనని వీరు భావిస్తున్నారు. చాలాచోట్ల జన్మభూమి కమిటీ సభ్యులదే పెత్తనంగా సాగుతోంది. వీరికి ముడుపులివ్వనిదే లబ్ధిదారుల ఎంపిక జరగదు. కాదంటే వారిపేరు జాబితాలో ఉండదు. మూడున్నరేళ్లుగా కమిటీలు చేస్తున్న నిర్వాకమిదే. వారు అధికారాన్ని అతిగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడా కమిటీలపై జిల్లా టీడీపీలో కీలక స్థానంలో ఉన్న నాయకుల కన్నుపడింది. పాత కమిటీలను రద్దు చేసి కొత్తవాటిని వేస్తే వ్యక్తిగతంగా లాభం చేకూరుతుందని ఆశిస్తున్నారు. నిర్ణయం తీసుకునేందుకు చిన్నబాబును సంప్రదిస్తున్నట్లు సమాచారం.
అడ్డగోలు లబ్ధి పొందాలంటే.. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో భారీ ఆస్తులున్న ఓ మండల స్థాయి నాయకుడికి ఎన్టీఆర్ గృహం మం జూరైంది. ఆయనకున్న ఆర్హత ఏంటంటే టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు కావడమే. ఈ మండలంలోనే కాదు జిల్లాలో చాలా మండలాల్లో ఇలాగే జరుగుతోంది. ఈ విషయంలో వారిలో వారికే విభేదాలు కూడా వచ్చి రోడ్డుకెక్కుతున్నారు. ఫిర్యాదులు కూడా చేసుకుం టున్నారు. ప్రస్తుత ఎంపీటీసీ, సర్పంచ్‌ల కన్నా జన్మభూమి కమిటీ సభ్యులే కీలకమవుతున్నారు. వారంతా టీడీపీ సభ్యులే కావడంతో ప్రభుత్వం కూడా పెత్తనం వారికే అప్పజెపుతోంది. రాజ్యాంగేతర శక్తులుగా ఈ కమిటీ సభ్యులు తయారయ్యారు. వీరి శక్తిని చూసి కొందరు టీడీపీ నాయకులు కమిటీల్లో తమకు కావాల్సిన వారిని వేయించుకోవాలని చూస్తున్నారు. ఆదాయంలో వాటా ఇస్తే కమిటీల్లో స్థానమిచ్చేందుకు సిద్ధపడుతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో ఈతరహా వసూలు పర్వం ఇప్పటికే నడుస్తోంది. కొత్తకమిటీల నియామకాల ముసుగులో కలెక్షన్లకు తెరతీస్తున్నారు. డబ్బు లెక్క చేయని కొంతమంది ఎంతైనా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
కమిటీలు చేతుల్లో ఉంటే..
మూడేళ్ల క్రితం నాటికి, నేటికీ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు నాయకులు పార్టీలు మారడంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. జన్మభూమి కమిటీలే కీలకం కావడంతో టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ స్థాయి వ్యక్తులు కూడా డమ్మీలుగా మిగులుతున్నారు. కొన్నిచోట్ల మాట వినడం లేదని, మరికొన్నిచోట్ల మనవాళ్లే ఉంటే బాగుంటుందని, చెప్పుచేతల్లో కమిటీలుంటే అడ్డుఉండదనే ఉద్దేశానికి టీడీపీ జిల్లా నేతలు వచ్చారు. పని చేయనివారు అనే ముద్రతో కొంత మందిని, పార్టీకి సేవలు చేయడంలేదనే సాకుతో కొంతమందిపై వేటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా వేసే కమిటీల్లో మనవాళ్లే ఉండాలన్న ఏకైక దృక్పథంతో ఉన్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు.