బాబూ.. మేము విసిగిపోయాం | The TDP Government Has No Intention To Cancel CPS | Sakshi
Sakshi News home page

బాబూ.. మేము విసిగిపోయాం

Published Fri, Apr 5 2019 10:14 AM | Last Updated on Fri, Apr 5 2019 10:14 AM

The TDP Government Has No Intention To Cancel CPS - Sakshi

సాక్షి, అమరావతి : క్షేత్రస్థాయిలో రేషన్‌ కార్డు అందకపోయినా, గ్రామ శివారులో అరాచకశక్తుల అలికిడి వినబడినా, ఉన్నతాధికారులిచ్చిన ప్రోగ్రామ్‌ సతాయించినా వీటన్నింటికీ బాధ్యులు క్షేత్రస్థాయి ఉద్యోగులే.. ఇలా ఏ చిన్న పొరపాటు జరిగినా అటు ఉన్నతాధికారులు, ఇటు ప్రజలు, పాలకుల వేళ్లన్నీ వీరివైపే చూపిస్తుంటాయి. ఇంత అవమానాలు ఎదుర్కొంటున్నా రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత మాత్రం లేదు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.

ఇప్పటికే అనేక పోరాటాలు చేసినా, నిరసనలు తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్‌ రద్దు చేస్తానని మాట ఇచ్చారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం కల్పిస్తానని, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని వరాలు కురిపించారు. దీంతో అన్ని శాఖల ఉద్యోగులు తమ జీవితాల్లో చింతలు తీరబోతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీపీఎస్‌ రద్దు 
పాదయాత్ర ఆరంభంలో తనని కలసి సీపీఎస్‌ పెన్షన్‌ విధానం వల్ల ఎదుర్కొంటున్న సమస్యను, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాల గురించి విన్న వైఎస్‌ జగన్‌ ఆ రోజే వారికి స్పష్టమైన హామీచ్చారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తానని ప్రకటించారు. మరోవైపు గత ఎన్నికల ముందు సీపీఎస్‌ రద్దు చేస్తామని గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేసింది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఓ కమిటీ వేసి, దాని రిపోర్టు కూడా ప్రకటించకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ    ఉద్యోగులు ఎవరూ నమ్మని పరిస్థితి.  

ఐఆర్‌ ప్రకటనతో హర్షం 
ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌)ను అధికారంలోకి రాగానే 27 శాతం ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఉద్యోగుల మనసును గెలుచుకున్నారు వైఎస్‌ జగన్‌.  పీఆర్‌సీని కూడా సకాలంలో అమలు చేసి తీరుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు జననేత. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఐఆర్, డీఏలు పెండింగ్‌లో పెట్టడం, పోస్టు డేటెడ్‌ చెక్కులు ఇవ్వటం వంటి ఉద్యోగలను ఇబ్బందిపెట్టే నిర్ణయాలు ఉండవని భరోసా ఇచ్చారు.

గుంటూరు జిల్లాలో 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు
10-15 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 


పాపం ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు
అధికారంలోకి రాగానే ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేస్తానన్న బాబు కోర్టు తీర్పులు, నిబంధనలు అంటూ కుంటి సాకులు చెప్పారు. కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సమాన పనికి – సమాన వేతనం వంటి సుప్రీం కోర్టు తీర్పులు చంద్రబాబు పాలనలో అమలు నోచుకోక మూలనపడ్డాయి. 

హెల్త్‌కార్డులు కావవి.. నాలికబద్దలు!
ఉద్యోగులకు  హెల్త్‌కార్డుల మంజూరు చేశానంటూ సీఎం చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారుæ. వాటితో కనీసం నాలుక గీసుకోవటానికి కూడా పనికిరావటం లేదు. క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ అని గొప్పలు చెప్పారు. తీరా  ఏ హాస్పిటల్‌కు వెళ్లినా సారీ సార్‌ మేం ట్రీట్‌మెంట్‌ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. పెన్షనర్ల పరిస్థితి మరీ ఘోరం.  

నాలుగో సింహానికి వారాంతపు సెలవు 
పోలీసులకు  వేళాపాళలుండవు. పండుగలు, వేడుకలు, సెలవులు లాంటివి ఏవీ ఉండవు. వారి బాధలు గుర్తించిన ఏకైక నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. అధికారంలోకి రాగానే పోలీసులకు వారాంతపు సెలవు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్యం, సంక్షేమం నాది బాధ్యతంటూ భరోసా ఇచ్చారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలివి.

  • కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది క్రమబద్ధీకరణకు చర్యలు అన్నారు. చేయనే లేదు.
  • అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు.  ఎన్నికల దగ్గరపడటంతో ఉద్యోగులను నమ్మించటానికి పాలసీని మాత్రమే తయారు చేశారు.
  • ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణాలు. ఆ దిశగా చర్యలు ఏవీ తీసుకోలేదు
  • ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వీలైనంత త్వరగా భర్తీ చేస్తాం. ఈ హామీ అమలులో ఘోరంగా విఫలం. లక్షల్లో ఉద్యోగాల ఖాళీ ఉన్నప్పటికీ భర్తీ చేసింది చాలా తక్కువ
  • వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు. ఈ విధానాన్ని కేవలం సచివాలయం,      హెచ్‌వోడీలలో మాత్రమే అమలు చేశారు.  
  • ఉద్యోగులకు పదవీ విరమణ రోజు బెనిఫిట్స్‌ అందించే విషయంలోనూ బాబు పూర్తిగా విఫలమయ్యారు. ఏళ్ల తరబడి తిరిగినా ఆ బెనిఫిట్స్‌ వారికి అందటం లేదు.
  • పెన్షనర్లకు మెరుగైన క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ హామీ అమలు కాలేదు.పైగా సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

27 శాతం ఐఆర్‌ మంచి నిర్ణయం
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉద్యోగులకు ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత మాకు ప్రస్తుతం 27 శాతం ఐఆర్‌ ప్రకటించటం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఒకొక్కరికి రూ.5 వేల ప్రయోజనం చేకూరుతుంది. హెల్త్, పెన్షన్‌ స్కీం వలన ఎంతో మంది ఉద్యోగులకు ప్రయోజనం.
–హరినాథ్‌బాబు, రిటైర్డ్‌ పంచాయతీ కార్యదర్శి, మాచర్ల 

ప్రభుత్వ ఉద్యోగులు గమనించాలి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని ఐఆర్‌తోపాటు పెన్షన్‌ ఇస్తామన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. ప్రతిపక్షనేత జగన్‌  నిర్ణయాలు హర్షణీయం. ఉద్యోగులకు మేలు చేసే వారే మా     నాయకులు. మాకు రాజకీయాలతో పని లేదు.
– నందా నరసింహయ్య, రిటైర్డ్‌ తహసీల్దార్, మాచర్ల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement