సీపీఎస్‌ రద్దు తో భరోసా!  | YS Jagan Ensure the CPS cancellation For Employees | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు తో భరోసా! 

Published Sat, Apr 6 2019 8:37 AM | Last Updated on Sat, Apr 6 2019 8:37 AM

YS Jagan  Ensure the CPS cancellation For Employees - Sakshi

సాక్షి, అమరావతి :  ప్రభుత్వ ఉద్యోగం ఆర్థిక భద్రతకు సూచిక. కుటుంబానికి ఆర్థిక, సామాజిక భరోసా. అయితే, ఇది 2004కు ముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి మాత్రమే. 2003లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) పేరుతో ఈ ఆసరాపై దెబ్బకొట్టింది. దీంతో 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి ఆర్థిక భద్రత ఎండమావిలా మారింది.

సమ న్యాయ సూత్రాలకు, సమాన పనికి సమాన వేతనం నిబంధనకు విరుద్ధమైన దీనిని రద్దు చేసి అందరికీ పాత పింఛను విధానం వర్తింపజేయాలని సీపీఎస్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులు నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం ససేమిరా అంగీకరించలేదు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం... మన ప్రభుత్వం రాగానే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానం అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. 

పింఛను అనేది ఉద్యోగులకు సర్కారు పెట్టే భిక్ష కాదు. అది వారి హక్కు, ప్రభుత్వ బాధ్యత. న్యాయస్థానాలు, ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న మాట ఇది. ఒకేచోట ఒకేవిధమైన పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి ఆర్థిక భరోసా ఇస్తూ, మరికొందరికి నిరాకరించడం అన్యాయమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇది సమన్యాయ సూత్రాలకు, సమాన పనికి సమాన వేతనం నిబంధనలకు వ్యతిరేకం.

ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని 1.86 లక్షల ఉద్యోగ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయం. అందుకే సీపీఎస్‌ స్థానంలో అందరికీ పాత పెన్షన్‌ విధానం అమల్లోకి తేవాలని ఉద్యోగులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ డిమాండ్‌తో ధర్నాలు, నిరాహార దీక్షలు, ఛలో అసెంబ్లీ తదితర ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రభుత్వ అణచివేతను చవిచూశారు. అయినా పోరాట బాట వీడలేదు.

సీపీఎస్‌ కింద పనిచేస్తూ... మరణించిన ఉద్యోగుల కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఆసరాలేక పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఉద్యోగం చేస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (పేరు మార్చాం) రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన భార్య ప్రసన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలను చదివించడం కూడా ఇబ్బందిగా ఉందని ఆమె వాపోతున్నారు.

ప్రసన్నలాంటి కుటుంబాలు ఇలా ఎన్నో ఉన్నాయి. పాత పెన్షన్‌ విధానంలోని ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మరణించినా వారి జీవిత భాగస్వామికి (భర్త లేదా భార్య) జీవితాంతం పింఛను వస్తుంది. సీపీఎస్‌ పరిధి ఉద్యోగి మరణిస్తే వారి జీవిత భాగస్వామికి నయా పైసా పింఛను రాదు. 

వేర్వేరు పెన్షన్‌ విధానాలెందుకు?  
ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాంటి సామాజిక, ఆర్థిక భద్రత ఉంటుందో పదవీ విరమణ తర్వాత కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతోనే ఉద్యోగులకు గతంలో ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించారు. ప్రభుత్వ నిధులతోనే ఉద్యోగులకు పింఛను ఇవ్వడం ఇందులో భాగమే. 2003లో చంద్రబాబు కేంద్రంలో మద్దతిచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రతైన పింఛనుకు గండికొడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) విధానం అమల్లోకి తేనున్నట్లు నోటిఫై చేసింది.

2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు 2004 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి వర్తింపజేసింది. దీనిప్రకారం ఈ తేదీకి ముందు చేరినవారికి పాత పెన్షన్, తర్వాత చేరినవారికి కంట్రిబ్యూటరీ పింఛను వర్తిస్తుంది. 2013లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం  పీఎఫ్‌ఆర్‌డీఏ (పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) బిల్లు  ఆమోదించింది.

ఉద్యోగుల మూల వేతనంలో పది శాతాన్ని ప్రభుత్వం మినహాయించుకుని అంతే మొత్తాన్ని ప్రభుత్వం జత చేసి, దానిని స్టాక్‌ మార్కెట్లో పెట్టి ఆ మొత్తంపై వచ్చే రాబడిని పెన్షన్‌గా ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం. ఇది రెండో రకం పింఛను విధానం. 

పింఛన్లు ఎందుకు ఇవ్వాలంటే! 

  • వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనను పిల్లలు పట్టించుకోకపోతే వారి సంగతేమిటి? పనిచేయలేని వయసులో జబ్బులు వస్తే వైద్యానికి డబ్బు సంపాదించలేరు. వారు మంచానపడి చిక్కిశల్యమై పోవాల్సిందేనా? ఇది మంచి సమాజానికి సంకేతం కాదు. ఈ ఉద్దేశంతోనే సామాజిక భద్రతా పింఛన్‌ విధానాన్ని గతంలో అమలు చేశారు. 
  • అల్పాదాయ కుటుంబాల్లోని పేదలు, ఇతర వర్గాలకే సామాజిక భద్రతలో భాగంగా పింఛన్లు ఇస్తున్నప్పుడు దశాబ్దాల తరబడి ప్రత్యక్షంగా సేవలందించి వృద్ధాప్యంలో రిటైరైన ఉద్యోగులకు ఇదే తరహాలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? కచ్చితంగా ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 
  • ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తమకూ పెన్షన్‌ ఇవ్వాలని కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగులు చేస్తున్న డిమాండును ముఖ్యమంత్రి చంద్రబాబు అయిదేళ్లుగా ఆమోదించలేదు. అసలీ డిమాండ్‌ అసంబద్ధమైనదా? అనే ప్రశ్నకు ఔనని కూడా ఆయన చెప్పలేకపోతున్నారు. దీన్నిబట్టి సీపీఎస్‌ అమలు న్యాయమైనదే అని తెలుస్తోంది. అయినా ఐదేళ్లుగా అమలు చేయకుండా కాలయాపన చేశారు. 

సాకులతో బాబు కాలయాపన 
సీపీఎస్‌ రద్దు చేయాలని నాలుగేళ్లుగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా పోలీసులతో లాఠీచార్జి చేయించారు. మహిళలని కూడా చూడకుండా దారుణంగా కొట్టించారు. ఛలో అసెంబ్లీ ప్రకటించిన ఉద్యోగులను తీవ్రవాదులన్నట్లుగా చితకబాదించారు. ఉద్యోగుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు.

ఓ దశలో సమస్యలు చెప్పేందుకు వెళ్లిన సీపీఎస్‌ ఉద్యోగులకు మొదట ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి అంశమంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారు. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో స్వేచ్ఛ ఉందని ఆధారాలు సహా చెప్పడంతో ఎన్నికలు ఉన్నాయనగా గతేడాది నవంబరులో సాధ్యాసాధ్యాలను పరిశీలనకంటూ కమిటీ వేశారు. ఇప్పటికీ ఈ కమిటీ రిపోర్టు రాలేదు. దీనినిబట్టి కాలయాపన చేసేందుకే కమిటీ వేశారని తెలుస్తోంది.  

రాష్ట్ర ప్రభుత్వాలకే స్వేచ్ఛ 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పెన్షన్‌ విధానం అమలు చేయాలో నిర్ణయించుకునే అధికారం స్థానిక ప్రభుత్వాలకే ఉంది. అయితే, తమ ఉద్యోగులకు పాత పింఛను అమలు చేస్తామని ముందుగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా పడే ఆర్థిక భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబుకు సీపీఎస్‌ రద్దు చేయాలనే చిత్తశుద్ధి లేదు. అందుకే అనుమతి కోసం చొరవ చూపలేదు. 

ఉద్యోగ విరమణ ప్రయోజనాలపై కొండంత ఆశ 
సగటు ఉద్యోగులంతా విరమణ తర్వాత తమ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితులపై ఒకింత ఆందోళనగా ఉంటారు. వారి జీవనం సాఫీగా సాగడానికి పింఛనే ఆధారం కాబట్టి ఎంతో ఆశతో లెక్కలేసుకుంటారు. గ్రాట్యుటీ సొమ్ముతో ఇల్లు కొనుక్కోవాలని, ఆడ పిల్లల పెళ్లి చేయాలని భావిస్తుంటారు.  వారు ఆర్థికంగా తట్టుకోవడం చాలా కష్టం. పెద్ద జబ్బులు చేసినా, కుటుంబంలో ఏదైనా ఉపద్రవం వచ్చినా తట్టుకుని నిలదొక్కుకునేందుకే పెన్షన్‌ విధానాన్ని గత ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి.  

వైఎస్‌ జగన్‌ హామీతో పెరిగిన విశ్వాసం 
మన ప్రభుత్వం రాగానే సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ అమల్లోకి తెస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీతో రాష్ట్రంలోని 1.86 లక్షల సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా పలు జిల్లాల్లో సీపీఎస్‌ పరిధిలోని ఉద్యోగులు ఆయనను కలిసి తమ కష్టాలను వివరించి న్యాయం చేయాలని కోరారు.

అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను కచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమల్లోకి తెస్తాం’ అని ఆయన భరోసా ఇచ్చారు. ‘సీపీఎస్‌ రద్దు చేయాలి, పెన్షన్‌ భిక్ష కాదు– మా హక్కు’ అనే నినాదాలున్న ఫ్లకార్డులు పట్టుకుని కొన్ని జిల్లాల్లో సీపీఎస్‌ ఉద్యోగులు జగన్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు. వారి సమస్యలు తెలుసుకున్న జగన్‌ కుటుంబ పోషకులైన ఉద్యోగులను కోల్పోయి ఆర్థికంగా, సామాజికంగా చిక్కుల్లో పడ్డ కుటుంబాలకు సొంతంగా కొంత ఆర్థిక సాయం చేశారు.

ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తామని, 11వ పీఆర్సీని త్వరగా అమలు చేస్తామని కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగ సభలో జగన్‌ వాగ్దానం చేశారు. మాట ఇస్తే తప్పని వైఎస్‌ కుటుంబ చరిత్రను గుర్తుచేసుకుంటూ, జగన్‌ అధికారంలోకి వస్తారని సీపీఎస్‌ రద్దు చేస్తారని ఉద్యోగులు విశ్వాసంతో ఉన్నారు.   

రెండింటి మధ్య తేడా ఇది... 
పాత పింఛను విధానం 

  • జీపీఎఫ్‌ ఖాతాలో మెచ్యూరిటీ మొత్తానికి ఆదాయ పన్ను ఉండదు. 
  • విరమణ తర్వాత ఉద్యోగులకు డీఏ పెరిగితే ఆ మేరకు రిటైర్డు ఉద్యోగులకు డీఆర్‌ పెరుగుతుంది. 
  • పింఛనును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లిస్తుంది. 
  • ఉద్యోగి ఒక్క రూపాయి కూడా జమ చేయాల్సిన పనిలేదు. 

సీపీఎస్‌ విధానం 

  • ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఉండదు. 
  •   పింఛను గ్యారంటీ ఉండదు. ఇది స్టాక్‌మార్కెట్‌ రాబడిపై ఆధారపడి ఉంటుంది. 
  •  ఉద్యోగి మూల వేతనం నుంచి 10 శాతం పింఛను కోసం చెల్లించాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement